Odela | ఓదెల, జులై 31 : పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు శుక్రవారం పరిశీలించారు. మల్లన్న ఆలయంలో రూ.15 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో అభివృద్ధి పనులు వాస్తు ప్రకారం జరిగే విధంగా దేవాదాయశాఖ, పంచాయతీరాజ్ అధికారులు, ఆలయ పాలకమండలి సభ్యులతో సమీక్షించారు. అభివృద్ధి పనులు వేగవంతంగా జరగడంతో పాటు వాస్తుకు అనుకూలంగా జరగాలని సూచించారు.
ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలతో పాటు ఆహ్లాదం కల్పించడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, ఈవో సదయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, మాజీ చైర్మన్ గోపు నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మీనుగు సంతోష్, రాచర్ల రాకేష్, రెడ్డి రజనీకాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు.