కార్పొరేషన్ మార్చ్ 20 : నగరంలోని 21వ డివిజన్లో ఐదు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ పనులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కరించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.
దీనివల్ల నగరంలో సీఎం అస్యూరెన్స్ నిధులతో చేపట్టిన అనేక అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈ పనులను ప్రారంభించేందుకు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సాగర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.