కరీంనగర్ రూరల్, జూన్ 3: ప్రత్యేక రాష్ట్రం కోసం బరిగీసి కొట్లాడి, ఉద్యమించి తెలంగాణను తెచ్చింది మనమేనని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. 13 ఏండ్లు సుధీర్ఘ పోరాటం చేసి ఉద్యమాన్ని ముందుండి నడిపించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. మన రాష్ర్టానికి హక్కుదారులం మనమేనని, మన భవిష్యత్ తరాలను కాపాడుకునేది మనమేనని తేల్చి చెప్పారు. భూమి ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుందని, ఎవరూ పార్టీని ఖతం చేయలేరన్నారు. త్వరలోనే బీఆర్ఎస్కు మంచి రోజులు వస్తాయని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
త్వరలోనే నూతన జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకొని, పార్టీ అనుబంధ సంస్థల కమిటీలు నియమించుకుందామని చెప్పారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కేసీఆర్ భవన్లో సోమవారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జాతీయ జెండాను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు, పార్టీ జెండాను బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జీవీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడంతోపాటు, ఇప్పుడు దశాబ్ది ఉత్సవాల్లో జరుపుకునే అవకాశం మనందరికీ రావడం గర్వంగా ఉందన్నారు.
దేశ స్వాతంత్ర పోరాటం తర్వాత జరిగిన గొప్ప ఉద్యమం, తెలంగాణ ఉద్యమమేనని కీర్తించారు. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..?’ అని నినదించి మన కరీంనగర్ నుంచే ఉద్యమాన్ని ప్రారంభించారని, పార్టీ సందర్భంగా తెలంగాణ శంఖారావం, తెలంగాణ దీక్ష జరిగింది మన గడ్డ పైనేనని గుర్తుచేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు చేసి దేశంలో వివిధ రాష్ర్టాల ప్రజల దృష్టిని ఆకర్షించారని చెప్పారు.
కేసీఆర్ పాలనలో తాను సివిల్ సప్లయ్ మంత్రిగా పనిచేశానని, రైతులు రికార్డు స్థాయిలో 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించినా కొనుగోలు చేశామని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమైపోయారని దిగుబడి 45 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి పోయి వానకాలం సీజన్ వచ్చిందని, రైతులకు సకాలంలో జీలుగ, పచ్చిరొట్ట విత్తనాలు, ఎరువులు ఎందుకు పంపిణీ చేయలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కరెంట్, నీళ్లకు ప్రజలు గోసపడుతున్నారని, మళ్లీ కెసీఆర్ పాలన ఎదురు చూస్తున్నారని చెప్పారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో పండ్లు పంపిణీ చేశారు.
రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియడం లేదు. రోడ్లు భవనాల మంత్రి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నడు. ఇంకో మంత్రి మరో శాఖ గురించి వివరాలు చెబుతడు. వారి శాఖలు ఏంటో కూడా వారికే తెలువకుండా పోయింది. మంత్రుల వ్యవస్థ అదుపు తప్పింది. అయితే వాళ్లను నియంత్రిస్తే ఎక్కడ తనపై అసమ్మతి తెస్తారో..? అని సీఎం రేవంత్‌రెడ్డి భయపడిపోతున్నడు. కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో రాష్ట్రం ఆగమైపోయింది. మళ్లీ 1956 నాటి పరిస్థితులను తీసుకొస్తున్నరు. ప్రజలు, రైతులకు ప్రభుత్వంపై నమ్మకం పోయింది. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉన్నది. అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలి. సమిష్టిగా ఉందాం, సమిష్టిగా కృషి చేద్దాం.
– గంగుల కమలాకర్
తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు కరీంనగర్ గడ్డ. 2009లో దీక్షకు కేసీఆర్ ఇక్కడి నుంచి కదిలినప్పుడు ఇక్కడ ప్రజలు అండగా నిలిచిన్రు. ఉద్యమంతోపాటు ప్రతి ఎన్నికల్లో వెన్నంటే ఉన్నరు. నాడు చంద్రబాబుతో కలిసి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసింది రేవంత్‌రెడ్డి. తెలంగా ఉద్యమం, దినోత్సవం, అస్థిత్వంగురించి ఆయనకు తెలియదు. అంపదకే అవరతణ దినోత్సవాన్ని ఒక్కరోజులోనే నిర్వహించి మమ అనిపించిండు. బలిదానాలకు కారణమైన సోనియాగాంధీ వేడుకలకు వస్తే అవమానం జరుగుతుందని రాలేకపోయింది.
-జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు