కార్పొరేషన్, మే 25: ‘ పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆరే మాకు నాయకుడు. ఆయన బాటలోనే ప్రతి ఒక కార్యకర్త నడుచుకుంటారు. ఆదేశాలు పాటిస్తారని’ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత పార్టీ పెట్టడమనేది ఊహాగానాలేనని కొట్టిపడేశారు. ఆదివారం నగరంలోని 20వ డివిజన్ ఆరేపల్లిలో శ్మశాన వాటికలో అభివృద్ధి పనులు, కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, మాట్లాడారు. ఆరెపల్లిలో శ్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని సుమారు రూ.49.50లక్షల నిధులతో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఆరేపల్లి నుంచి రాణిపూర్ నగునూరు దుర్గామాత ఆలయానికి వెళ్లే దారిలో రూ.12లక్షలు వెచ్చించి కల్వర్టును నిర్మిస్తామని చెప్పారు.
వచ్చే నెల 2న తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా అమెరికాలోని డల్లాస్‌లో ఎన్నారైల ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహిస్తున్నారని, పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు తాను, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వెళ్తున్నట్లు వివరించారు. బీఆర్ఎస్ ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్న పార్టీ అని, ప్రతి ఒకరి అభిప్రాయాలను వారు తెలియజేయవచ్చునని చెప్పారు.
కానీ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాయడం కాకుండా అధినేత కేసీఆర్‌కు వ్యక్తిగతంగా కలిసి విషయాలను చెప్పి ఉంటే బాగుండు అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో తాను కూడా ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు జంగిలి సాగర్, జంగిలి ఐలేందర్ యాదవ్, దిండిగాల మహేశ్, నాయకులు తుల బాలయ్య, పిల్లి మహేశ్ గౌడ్, మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, మాజీ సూడా డైరెక్టర్ నేతి రవివర్మ, పలువురు బీఆర్ఎస్ నాయకులు, ఆరెపల్లి గ్రామస్తులు ఉన్నారు.