కొత్తపల్లి, ఏప్రిల్ 16 : కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారని, ఈ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా నష్టం చేసిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపెల్లి మండలంలోని మల్కాపూర్, బద్దిపల్లి గ్రామాలలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం గంగుల కమలాకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేసిన రెండు మూడు రోజులలోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన వడ్లను తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.
మల్కాపూర్ గ్రామాన్ని నగరపాలక సంస్థలో విలీనం చేయడం ద్వారా ఉపాధి హామీ కూలీలకు ఉపాధి కరువైందని ఎమ్మెల్యే గంగులకు స్థానికులు మొరపెట్టుకున్నారు. అదేవిధంగా రైతుబంధు రాలేదని, సబ్సిడీ గ్యాస్ అందడం లేదని, తులం బంగారం ఇవ్వడం లేదని, కౌలురైతులకు రైతు భరోసా ఇవ్వటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం నీరందించకపోవడంతో పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ సీజన్లో ఎండిన వరి పంటకు 500 రూపాయల బోనస్ ను చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చివరి తడి వరకు నీరిచ్చామని, సమృద్ధిగా నీళ్లు ఉన్నందున వరి కోతలకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉండేదని తద్వారా ఆ రైతులు నీరు బంద్ చేయండి అని ఎన్నోసార్లు మాతో చెప్పుకునే పరిస్థితి గతంలో నెలకొందని వారు గుర్తు చేశారు. ఈ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులనే నిండుకుండలా ఉండేవని, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నేడు వెలవెలబోతున్నాయన్నారు. రాను రాను పంట దిగుబడి తగ్గిపోతుందని, ఈప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా నష్టం చేస్తుందన్నారు.