కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 6: బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని తానే చేసినట్టు బండి సంజయ్ చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. నగరాభివృద్ధిలో బండి పాత్ర శూన్యమని, కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ తీసుకురావడంలోనూ ఆయనకు ఏ సంబంధమూ లేదని స్పష్టం చేశారు. తానే అభివృద్ధి చేశానంటూ ప్రచురించిన కరపత్రాల్లో ఒక్కటి నిజం ఉన్నా చర్చకు రావాలని, కరీంనగర్ కోసం తెచ్చిన నిధులకు సంబంధించిన ఒక్క జీవో అయినా చూపించాలని సవాల్ చేశారు. ఒక్క అవకాశం ఇవ్వాలని అడుగుతున్న ఆయనకు కరీంనగర్ ప్రజలు ఇప్పటికే ఎంపీగా, కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చినా ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. ఇప్పుడు మేయర్ పీఠం అప్పగిస్తే ఇంకేం చేస్తారని ప్రశ్నించారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరిగితే.. కాంగ్రెస్, బీజేపీ పాలనలో విధ్వంసం జరుగుతున్నదని ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కరీంనగర్ గడ్డ మీద అభివృద్ధి జెండా తమ నినాదమని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి గంగుల మాట్లాడారు. ఏడేండ్లు ఎంపీగా ఉన్న సంజయ్ కరీంనగర్‌కు చేసిందేమీ లేదని విమర్శించారు. నగరంలో తాము చేసిన పనులను సంజయ్ చెప్పుకోవడం దుర్మార్గమన్నారు. నగరానికి స్మార్ట్‌సిటీ వచ్చినప్పుడు ఆయన కార్పొరేటర్‌గానే ఉన్నారని, అలాంటప్పుడు ఆయన పాత్ర ఏముందని ప్రశ్నించారు.
స్మార్ట్‌సిటీ కోసం వినోద్‌కుమార్, తాను, కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దగ్గరకు వెళ్తే సంజయ్ రాలేదని గుర్తు చేశారు. అందుకు సాక్ష్యంగా ఆనాడు దిగిన ఫొటోలను చూపించారు. అలాగే, నగరంలోని సెంట్రల్ లైటింగ్‌ను కేసీఆర్ పథకం(కరీంనగర్ సిటీ రెనొవేషన్ స్కీం) కింద తాము ప్రత్యేకంగా జీవో తెచ్చి ఏర్పాటు చేశామని, అందులో కేంద్రం నిధులు గుండు సున్నా అని చెప్పారు. గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యేగా తానే ఆర్డర్ ఇచ్చి తీసుకవచ్చానని, చౌరస్తాల పనులు కూడా పూర్తిగా సీఎం అస్యూరెన్స్ నిధులతోనే చేపట్టామని తెలిపారు. రవీందర్‌సింగ్ మేయర్‌గా ఉన్న సమయంలో కోర్టు చౌరస్తా సుందరీకరణ జరిగిందని చెప్పారు.
మల్టీపర్పస్ పార్కు అభివృద్ధి కోసం తాము ప్రణాళికలు చేసినప్పుడు, వినోద్‌కుమార్, తాను కబ్జా చేసేందుకు కుట్రలు పన్నుతున్నామని సంజయ్ ఆరోపణలు చేశాడని, ఇప్పుడు దానిని అభివృద్ధి చేశానని ఎలా చెబుతారని మండిపడ్డారు. తాను రూట్స్ కంపెనీతో ప్రత్యేకంగా మాట్లాడి నాలుగు పెద్ద స్వీపింగ్ మిషన్లు తీసుకువచ్చానని, మానేరు సమీపంలో కేసీఆర్ నిధులతో వైకుంఠధామం నిర్మించానని, అవి కూడా ఆయనే చేశానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
2025లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కరీంనగర్‌కు వచ్చి.. డంప్‌యార్డును తొలగిస్తామని చెప్పి ఏడాది గడిచినా ఇప్పటి వరకు కిలో చెత్తను కూడా తొలగించలేదని మండిపడ్డారు. తాను రాష్ట్ర నిధులు తెచ్చి కేబుల్ బ్రిడ్జిని పూర్తి చేశానని, మరీ ఆర్వోబీ నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారో సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీగా నిధులు తేవడంలో సంజయ్ విఫలమయ్యారని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు ఓట్ల కోసం అన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతుంటే రేవంత్‌రెడ్డి పంచాయతీల్లో సభలు పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నడు. కరీంనగర్లో అన్నిచోట్లా బీఆర్ఎస్ బలంగా ఉండడం వల్లే భయపడి తప్పుడు ప్రచారాలు చేస్తున్నడు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితం. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి సిఫారసు చేస్తే కేంద్రం స్పందించడం లేదని, అదే పొత్తుకు కారణం అన్నట్టు మాట్లాడుతున్నడు. మరీ నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో రాహుల్‌గాంధీ, సోనియా ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. మరి వారిని కేంద్రం అరెస్టు చేయడం లేదంటే.. సోనియా, మోదీ మధ్యన ఫెవికాల్ బంధం ఉందని మేం అనవచ్చునా..? కానీ, మేం అలా ఎప్పుడు అనం. ఆ కేసు ఇంకా విచారణలో ఉందని మాకు తెలుసు.
– మాజీ ఎంపీ వినోద్‌కుమార్