కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 11 : ఓ వైపు టీటీడీ టెంపుల్, మరోవైపు సుమారు 1800 ఏళ్ల చరిత్ర కలిగిన రేకుర్తి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంతో కరీం’నగరం’ అధ్యాత్మిక శోభను సంతరించుకున్నదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అ న్నారు. స్వయంభువుగా వెలిసిన రేకుర్తి ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరాయని చెప్పారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 17న స్వామివారి ప్రతిష్ఠాపనోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని తెలిపారు.
ఆదివారం రేకుర్తిలో లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అభివృద్ధి పనులను పరిశీలించారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్, అధికారులకు సూచించారు. అక్టోబర్ 17న ఉదయం 8 గంటలకు ప్రతిష్ఠాపనోత్సవాల్లో భాగంగా మహాకుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. రేకుర్తి నృసింహుడి క్షేత్రం మహిమాన్వితమైనదన్నారు.
ఇక్కడ స్వామివారు సుదర్శన చక్రంతో వెలియడంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్త్యాన్ని సంతరించుకున్నదని చెప్పారు. ఉమ్మడి పాలకులు ఆలయాభివృద్ధిని విస్మరించారని ఆక్షేపించారు. 2009లో తాను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టానన్నారు.
2014లో బీఆర్ఎస్ సర్కారు ఏర్పడిన తర్వాత రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ సహకారం తో ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. కొందరు కోర్టుకు వెళ్లి అడ్డుకునేందుకు వెళ్లారన్నారు. అయితే, స్వామివారి కటాక్షంతో ఆటంకాల న్నీ తొలగిపోయాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్‌రావు, కార్పొరేటర్లు ఎదుర్ల రాజశేఖర్, సుధగోని మాధవీ కృష్ణగౌడ్ ఉన్నారు.