మెట్పల్లి రూరల్, జనవరి 3: శక్తివంచన లేకుండా పనిచేస్తూ కోరుట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్పల్లి మండలం రామారావుపల్లెలో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ నూతన భవనం, రూ. 3.18 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రహరీని, రూ. 7.30 లక్షలతో నిర్మించిన మినీ ఫంక్షన్ హాల్‌ను బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజలు కలిసికట్టుగా ఉన్నప్పుడే పల్లెలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల సంక్షేమానికి, నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తానని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ నియోజకవర్గానికి రావాల్సిన నిధుల కోసం పోరాటం చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎగుర్ల లక్ష్మి, ఎంపీపీ మారు సాయిరెడ్డి, ఎంపీడీవో భీమేశ్‌రెడ్డి, ఉపసర్పంచ్ పుప్పాల ప్రతాప్, పంచాయతీ కార్యదర్శి సౌజన్య, మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు అనిరెడ్డి మారుతి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.