అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్న వెలిచాల గ్రామం సబ్బండవర్గాల ఆత్మగౌరవానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. ప్రగతిలో పరుగులు పెడుతూ.. పచ్చదనానికి కేరాఫ్‌గా నిలుస్తూ ఇప్పటికే రెండు సార్లు జాతీయ అవార్డులు అందుకున్న ఆ ఊరు.. గ్రామంలోని ప్రతి కులానికీ సంఘ భవనాన్ని నిర్మించింది. ఒకటికాదు రెండు కాదు కోటీ 4లక్షలతో దాదాపు 9 కమ్యూనిటీ హాల్స్‌ను పూర్తి చేసింది. నేడు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మంత్రి గంగుల కమలాకర్ చేతులమీదుగా ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసింది. – రామడుగు, సెప్టెంబర్ 13
రామడుగు, సెప్టెంబర్ 13: అభివృద్ధికి కేరాఫ్‌గా నిలుస్తూ రెండుసార్లు జాతీయ అవార్డును అందుకున్న రామడుగు మండలం వెలిచాల గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నది. కరీంనగర్ జిల్లాకేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ఊరు, ప్రజాప్రతినిధులు, అధికారుల కృషితో పట్టణాలకు దీటుగా ప్రగతి సాధించింది. గ్రామంలో అడుగు పెట్టగానే పచ్చదనానికి ప్రతీకగా కనిపిస్తుంది. గ్రామంలో ఎటు చూసినా నగరాన్ని తలపిస్తుంది. సర్పంచ్ వీర్ల సరోజన గ్రామ ప్రజలను ఒక కుటుంబంలా చూస్తూ, ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ కుల సంఘ భవనాలను నిర్మించారు. అంబేద్కర్ సంఘం భవన నిర్మాణానికి 10 లక్షలు, కురుమ సంఘ భవనం 22.90 లక్షలు, మున్నూరుకాపు సంఘం 18.30 లక్షలు, పద్మశాలీ సంఘం(కిష్టారావుపల్లి) భవనం 14.40 లక్షలు, వైశ్య సంఘం భవనం 8.70 లక్షలు, గౌడ సంఘం 14.80 లక్షలు, విశ్వబ్రాహ్మణ సంఘం 5లక్షలు, పద్మశాలీ సంఘం(వెలిచాల) 5 లక్షలు, దూదేకుల సంఘ భవనం 5 లక్షలు మొత్తం కోటీ నాలుగు లక్షలకు పైగా నిధులతో నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు.
నేడు ప్రారంభోత్సవం
కుల సంఘాల భవనాలను బుధవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పౌరసరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రారంభిస్తారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. సర్పంచ్ వీర్ల సరోజన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన నందనవనాన్ని (పల్లెప్రకృతి వనం) సందర్శించి, పాలకవర్గాన్ని అభినందించారు. ఇక్కడ ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు వీర్ల సంజీవరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్రావు ఉన్నారు.
సమష్టి కృషితోనే గ్రామాభివృద్ధి..
వెలిచాల గ్రామాన్ని జిల్లాకే ఆదర్శంగా నిలుపడంలో పంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామ ప్రజల సహకారం ఎంతగానో ఉంది. ముఖ్యంగా గ్రామాన్ని ప్రగతిపథంలో నడుపడంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరువలేనిది. గ్రామాభివృద్ధితో పాటు కుల సంఘాల బలోపేతమే లక్ష్యంగా అన్ని సంఘాలకు భవనాలు నిర్మించాం. మా గ్రామాభివృద్ధికి చేయూతనందించిన సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. – వీర్ల సరోజన, సర్పంచ్ (వెలిచాల)
అభివృద్ధిలో అగ్రస్థానం
జిల్లాలో ఏ గ్రామంలో లేనివిధంగా మా వెలిచాల అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తున్నది. ఏ గ్రామంలోనైనా కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే అభివృద్ధిని సాధించగలుగుతాయి. కానీ మా ఊరిలో ప్రతి సామాజిక వర్గం అభివృద్ధి బాటలో నడుస్తున్నది. కుల సంఘాల బలోపేతంలో మేమే ముందు వరుసలో నిలుస్తాం. ముఖ్యంగా గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతుంటారు. ప్రస్తుతం మా పంచాయతీ పాలకవర్గం అందిస్తున్న సహకారంతో గ్రామంలో యువతీయువకులు ఉన్నత చదువులతో మంచి ఉద్యోగాలను సాధిస్తున్నారు. మా గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించింది.
– దుబ్బాక చంద్రయ్య, మున్నూరుకాపు సంఘం ఉపాధ్యక్షుడు (వెలిచాల)
సంఘ భవనంతో మాకు ఎంతో ఉపయోగం
మా వెలిచాలలో కురుమ సంఘంలో సుమారు 150 కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మా కురుమలు ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఇలాంటి సమయంలో మాకు ఒక కుల సంఘ భవనం కావాలని సర్పంచ్‌ను కోరగా సుమారు రూ.22.90 లక్షల నిధులతో విశాలమైన సంఘ భవనం కట్టించారు. మా సంఘానికి తగినట్టుగా మా ఎదుగుదలకు ఈ సంఘ భవనం ఎంతగానో ఉపయోగపడుతుంది.
– ఎల్లమ్మల నర్సింహరాజు, కురుమ యువజన సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి (వెలిచాల)