Putta Madhukar | మంథని, డిసెంబర్ 10 : స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రి శ్రీధర్ బాబుకు ముఖం చెల్లడం లేదని, అందుకే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను తన పార్టీలో చేర్చుకొని తనను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను సర్పంచ్ పోటీలో లేకుండా చేసి ఏకగ్రీవం చేశారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. ఏన్నో ఏళ్లుగా పార్టీనే నమ్ముకున్న కాంగ్రెస్ నాయకుల గొంతు కోసిన చరిత్ర మంత్రి శ్రీధర్‌కే దక్కుతుందన్నారు.
స్థానిక రాజగృహలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రజల్లో మంథని నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న దుద్దిళ్ల శ్రీధర్ నమ్మకం విశ్వాసం కోల్పోయినట్లు కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నదన్నారు. ఇదే విషయాన్ని తాము పదేపదే చెప్తునప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. దుద్దిళ్ల శ్రీధర్ పెద్ద మోసగాడని, ఐస్ గడ్డతో చంపేస్తడని చెప్పితే పెడచెవిన పెట్టే ఈ సమాజం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అర్థం చేసుకోవడం లేదన్నారు.
దీనికి నిలువెత్తు నిదర్శనం సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికనే అన్నారు. మంత్రి అయిన తర్వాత మొదటిసారి మంథనిలో నిర్వహించిన ర్యాలీలో గొప్ప గొప్ప శ్లోకాలు చదివాడని, ఈసారి జరిగే సర్పంచ్ ఎన్నికల్లో తాము చెప్పిన వారు మాత్రమే ఊరికి ఒక్కరే కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఉంటారని, గతంలో ఊరికి ఇద్దరు ముగ్గురు నిలబడితే బీఆర్ఎస్ వాళ్లు గెలిచారని, అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉండదని నమ్మించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాట తప్పాడని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కోల్పోయామని అర్థం చేసుకున్న ఎమ్మెల్యే శ్రీధర్ 30ఏండ్లుగా పార్టీ జెండా మోసిన నాయకులను పక్కకు పెట్టి బీఆర్ఎస్ నాయకులకు కండువా కప్పి ఏకగ్రీవం చేశాడన్నారు.
కాంగ్రెస్ నాయకులను కాంప్రమైజ్ చేసి మా పార్టీ మెంబర్ షిప్ ఉన్న వాళ్లకు అవకాశం కల్పించడంలో మంథని ఎమ్మెల్యే నీతిని ఆ పార్టీ నాయకులు అర్థం చేసుకోవాలన్నారు. మైదుపల్లిలో పంతంగి లక్ష్మణ్, చందనాపూర్లో కొండ శ్రీను, మహదేవపూర్‌లో జువ్యాజి తిరుపతిలకు కండువా కప్పి కాంగ్రెస్ నాయకులను మోసం చేశాడన్నారు. చందనా పూర్లో బాబుమియా అనే నాయకుడు ఏన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ జెండా మోస్తూ వేరే పార్టీ నాయకులతో కనీసం మాట్లాడడని, అలాంటి నాయకుడిని మోసం చేశాడన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యే ఎలా మోసం చేస్తాడో గమనించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ బానిసలుగా ఉంటారు కాబట్టే వాళ్లకు అర్థం కాదన్నారు. మంథని ఎమ్మెల్యేకు ప్రజల్లో ముఖం చెల్లి ఉంటే మా పార్టీ వాళ్లను తీసుకుని కండువా ఎందుకు కప్పాడో కాంగ్రెస్ నాయకులకే సమాధానం చెప్పాలన్నారు. 420హమీల ఇచ్చిన దొంగ దుద్దిళ్ల శ్రీధర్ అని నియోజకవర్గం, రాష్ర్టమంతా అర్థమైందన్నారు. మహదేవపూర్‌లో మొదట గుడాల అరుణ అని ప్రకటించి, మళ్లీ మరుసటి రోజున హసీనాబాను అని ప్రకటించారని, ఇలాంటి మోసాలపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉపవాసం ఉండి సద్దులు తెచ్చుకుని ఆ కుటుంబం కోసం పని చేసిన వాళ్ల గొంతు కోస్తున్నారన్నారు.
అదే విధంగా మంథని మండలం గాజులపల్లి, ఎగ్లాస్ పూర్లాంటి అనేక గ్రామాల్లో ఇద్దరు ముగ్గురిని బరిలో నిలిపారని, పార్టీ రూల్స్ దాటితే చర్యలు అని ప్రకటన చేసిన మంత్రి ఇప్పటి వరకు ఎవరినైనా సస్పెండ్ చేశారా అని ప్రశ్నించారు. నాలుగు ఓట్లు కూడ లేని కుటుంబం 40 ఏండ్లుగా అధికారంలో ఉందన్నారు. మంథని ఎమ్మెల్యేకు కేవలం అధికారాన్ని వాడుకొని డబ్బు సంపాదించడం తప్ప అభివృద్ధి, ప్రజల సమస్యలను పట్టించుకోవడం తెలియదన్నారు.
40 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలను, నమ్మిన కాంగ్రెస్ నాయకులను మోసం చేసి అధికారాన్ని అనుభవిస్తున్న దుద్దిళ్ల కుటుంబం నిజస్వరూపాన్ని ఇప్పటికైనా ప్రజలు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తగరం శంకర్‌లాల్, పూదరి సత్యనారాయణగౌడ్, ఆరెపల్లి కుమార్, యాకుబ్, గొబ్బూరి వంశీ, కాయితీ సమ్మయ్య, తిరుపతి, కనకరాజు, ఇర్ఫాన్, ఆసీఫ్లతో పాటు తదితరులు పాల్గొన్నారు.