కొత్తపల్లి, ఆగస్టు 29 : కరీంనగర్‌లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని, కోచ్‌లను నియమిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని క్రీడా పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన జాతీయ క్రీడాదినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని, ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు క్రీడా పాఠశాలలు మంజూరు కాగా అందులో ఒకటి కరీంనగర్‌కు కేటాయించామన్నారు. పలు క్రీడాంశాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారుల చిత్రపటాలతోపాటు వారి చరిత్రను తెలిపేవిధంగా క్రీడాపాఠశాలలో గ్యాలరీ ఏర్పా టు చేయాలని సూచించారు.
కరీంనగర్ క్రీడా పాఠశాలలో ఈత కొలను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, క్రీడాకారులకు అవసరమైన ఆటవస్తువులను అందిం చాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి కింద కూర్చొని వారికి కావాల్సిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పోషకాహారం గురించి సిబ్బందిని అడిగారు. అనంతరం క్రీడాకారులకు ట్రాక్ షూట్‌తో పాటు స్పోర్ట్స్ షూ అందజేశారు. క్రీడా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన యోగా, కరాటే, జిమ్నాస్టిక్స్ ఆకట్టుకున్నాయి. ఇక్కడ కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, ఆర్డీవో మహేశ్వర్, డీవైఎస్వో శ్రీనివాస్‌గౌడ్, క్రీడా పాఠశాల ప్రిన్సిపాల్ లీలాప్రసాద్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా కంటే ముందే ప్రజా పాలనలో భాగంగా కరీంనగర్లో భూ ఆక్రమణదారులు, బెదిరింపుదారులపై కఠిన చర్యలు ఇప్పటికే తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. క్రీడా పాఠశాల నుంచి వెళ్తున్న సందర్భంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా స్పందించారు. అవినీతి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, పేదవారిని ఇబ్బందులు పెట్టేవారిపై ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కుంటలను ఆక్రమించుకొనే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. కరీంనగర్ చుట్టు పక్కల గ్రామాలు, ప్రాంతాల్లో కబ్జాలు, ఆక్రమణలు, ఎక్కువగా ఉంటున్నాయని, కొత్తపల్లి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు.