వేములవాడ, ఆగస్టు 28: రాజన్న ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని వచ్చే కార్తీక మాసం నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రతిరోజూ భక్తులకు దాతల సహకారంతో అన్నదానం చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అందుకు భవనాన్ని కూడా నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతామని చెప్పారు. రేషన్‌కార్డు లేని రైతులందరికీ 2లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని పేర్కొన్నారు.
బుధవారం ఆయన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి వేములవాడలో 15లక్షలతో నిర్మించిన సహకార సంఘం గోదాం, 80.66లక్షలతో నిర్మించిన కేడీసీసీ బ్యాంక్ భవనాన్ని ప్రారంభించారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో 59వేల మంది రైతులకు 444కోట్ల విలువైన రుణాలు మాఫీ చేశామన్నారు.
ఎకడైనా రుణమాఫీ జరగని రైతులుంటే సహకార వ్యవస్థ ప్రభుత్వంతో సమన్వయం చేసి వారికి మాఫీ చేయించాలని కోరారు. రేషన్‌కార్డు లేనివారికి ప్రభుత్వం కుటుంబ నిర్ధారణ ప్రారంభించిందని, అధికారులు విచారణ చేసిన తర్వాత వారికి కూడా రుణమాఫీ అవుతుందని భరోసానిచ్చారు. సహకార సంఘాల ద్వారా విదేశీ విద్య లోన్లు ఇచ్చే అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతానని చెప్పారు. సహకార సంఘం లో కొండూరి రవీందర్రావు కీలకంగా వ్యవహరించారని కొనియాడారు. తాను కూడా క్రిబ్కో డైరెక్టర్‌గా పని చేశానని గుర్తు చేశారు.
రవాణా శాఖ మంత్రిగా ఉండి 265రోజుల్లో 85కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేయడం సంతోషంగా ఉందన్నారు. నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు మాట్లాడుతూ, కేంద్ర సహకార సంఘం బ్యాంక్ 72శాఖలతో రూ.6వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోందన్నారు. ప్రస్తుతం నాబార్డ్ సహకారంతో దేశంలోనే అగ్రగామిగా పని చేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడతూ, సహకార సంఘాలు రైతులకు రుణాలు అందిస్తూనే.. సాగు విధానంలో నూతన ఒరవడిని అందించేవిధంగా వంగడాలను తయారుచేసి ఇవ్వాలన్నారు.
నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.5లక్షల విరాళం
వేములవాడటౌన్ ఆగస్టు 28 రాజన్న ఆలయ నిత్యాన్నదాన ట్రస్ట్‌కు హనుమకొండ జిల్లా నర్సక్కపల్లి వాస్తవ్యులు ఈగ రమేశ్ రూ.5లక్షల విరాళం అందజేశారు. అనంతరం విరాళానికి సంబంధించిన చెక్కును ఆలయ కార్యాలయంలో ఈవో వినోద్‌రెడ్డికి అందజేశారు. తర్వాత వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.