కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి పనులపై మొదటిసారి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించడం బాగానే ఉన్నది! కానీ, స్థానిక ఎంపీ, ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తోపాటు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ సునీల్‌రావుకు కనీస సమాచారం ఇవ్వకుండా నిర్వహించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. నగరాభివృద్ధిలో ఆ ముగ్గురి సహకారం తప్పనిసరి అని తెలిసినా.. ఆహ్వానం అందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పూర్తిగా ప్రొటోకాల్ విస్మరణే అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మంత్రి పేషీ నుంచి సమాచారం ఇవ్వలేని పరిస్థితి ఉంటే అధికారులైనా ఆహ్వానించాలి కదా..! అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే సమయంలో సమీక్షా సమావేశానికి సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు స్పష్టం చేయడం చూస్తే కావాలనే పిలువ లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, జూన్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మొదటిసారి మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సమీక్షలో చర్చించిన అంశాలను వెల్లడించారు. సీఎం అస్యూరెన్స్, స్మార్ట్ సిటీ కింద చేపట్టిన పనులతోపాటు తాగునీటి సరఫరా, శానిటేషన్ వంటి విషయాలను చర్చించినట్టు తెలిపారు. స్మార్ట్ సిటీ కింద 79 పనుల్లో కొన్నింటిని ఇతర పథకాల కింద వచ్చిన నిధులతో కూడా చేపట్టారని, ఓవర్ లాపింగ్ పనులపై విచారణ జరిపిస్తున్నట్టు చెప్పారు. స్మార్ట్‌సిటీలో భాగంగా చౌరస్తాల ఆధునీకరణ కింద ఇందిరాచౌక్‌లో 1.30 కోట్లు ఖర్చు చేశారని, ఎలాంటి అనుమతులు లేకుండా 50 లక్షలు అదనంగా ఖర్చు జరిగినట్టు అధికారులు చెప్పారని తెలిపారు.
నాణ్యతా ప్రమాణాల విషయమై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పర్యవేక్షణలో విజిలెన్స్ విచారణ జరుగుతున్నదని, ఎక్కడైనా నాణ్యతాలోపం ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అయితే మంత్రి హోదాలో సమీక్షించడాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు కానీ, ఈ విషయంలో ఆయన వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదస్పదమవుతున్నది. నిజానికి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై గతంలో అనేక సార్లు మాజీ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు సమీక్షించారు.
స్మార్ట్ సిటీ ఫండ్స్ వినియోగంపై వారికి పూర్తి అవగాహన ఉంది. అలాగే స్మార్ట్ సిటీ పనులు, నిధులు కేంద్రంతో ముడిపడి ఉన్నాయి. అంతేకాదు, నగరంలో అభివృద్ధి పనులు ముందుకెళ్లాలంటే మేయర్‌తోపాటు పాలకవర్గం మద్దతు తప్పనిసరి అవసరం. అయితే మొదటిసారి సమీక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. బండి సంజయ్, గంగుల కమలాకర్, సునీల్‌రావుకు సమాచారం ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఒక వేళ మంత్రి పొన్నం పేషీ నుంచి సమాచారం ఇవ్వలేని పరిస్థితి ఉంటే అధికారులైనా సమాచారం ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రొటోకాల్ ప్రకారం చూసిన ఎంపీగా, ఎమ్మెల్యేగా, మేయర్‌గానే కాదు, కార్పొరేషన్ పాలకవర్గంలో ఈ ముగ్గురు సభ్యులే. సమాచారం ఇచ్చిన తర్వాత ఏదైనా కారణాల వల్ల వాళ్లు రాకపోవడం వేరు.
నిజానికి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం మొత్తం స్థానికంగా అందుబాటులోనే ఉన్నారు. ఎమ్మెల్యే విధుల్లో భాగంగా ఆయన తన కార్యాలయంలో ప్రజలతో మమేకమయ్యారు. మేయర్ సునీల్‌రావుకు సమాచారం లేకపోవడంతో ఆయన హైదరాబాద్ వెళ్లారు. సమీక్షా సమావేశం గురించి తమకు ఏమాత్రం సమాచారం లేదని, అధికారుల నుంచి గానీ, మంత్రి పేషీ నుంచి గానీ తమకు ఆహ్వానం లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు తెలిపారు.
ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అన్నీ పార్టీలను కలుపుకొని ప్రగతిలో ముందుకెళ్లాలంటూ వివిధ సందర్భాల్లో మంత్రి పొన్నం చెబుతూ వస్తున్నారు. అదే నిజమైతే సుమారు 650 కోట్ల వార్షిక బడ్జెట్ ఉన్న కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి పనుల సమీక్షకు ఏకంగా మేయర్‌కే సమాచారం ఇవ్వకపోవడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే సమయంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్థానికంగా అందుబాటులో ఉన్న ఆ విషయం అందరికి తెలిసిందే అయినా సమీక్షకు ఎందుకు ఆహ్వానించలేదన్న చర్చ జరుగుతున్నది. నగరంలో అభివృద్ధి పనులు ముందుకెళ్లాలంటే.. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్ సహకారం తప్పనిసరి. వారికే సమాచారం లేకుండా సమీక్షలు నిర్వహించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి నగరంలో అనేక అభివృద్ధి పనులు కొన్ని నెలుగా నిలిచిపోయాయి. ఎమ్మెల్యే, మేయర్ పాల్గొని ఉంటే.. ఆ విషయాలను ప్రస్తావించే వారు. వాటికి కారణాలను కనుక్కొని.. పరిష్కారం దిశగా అడుగులు వేసే పరిస్థితి ఉండేది. కానీ, సమీక్ష అందుకు పూర్తిగా విరుద్ధంగా జరిగింది. మొత్తంగా చూస్తే నగరంలో అభివృద్ధి పనులు కొనసాగాలంటే సమన్వయంతో ముందుకెవెళ్తే తప్ప సాధ్యం కాదన్న అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏకపక్షంగా సమీక్ష నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలా స్పందిస్తారో చూడాలి.