కరీంనగర్ విద్యానగర్, సెప్టెంబర్ 9: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ దవాఖానలో సోమవారం అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దవాఖానలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
దవాఖాన అభివృద్ధి కోసం దాతలు సహకరించాలని కోరారు. డ్రైనేజీ సమస్య, ఏసీలు, రిపేర్, ఆపరేషన్ థియేటర్ ఎక్విప్మెంట్, అంబులెన్స్‌లు, ఆర్వో ప్లాంట్లు, సిబ్బంది మందుల, డెడ్‌బాడీ ఫ్రీజర్ సమస్యల గురించి మంత్రి దృష్టికి సూపరింటెండెంట్ గుండా వీరారెడ్డి తీసుకెళ్లారు. మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో 150, జీజీహెచ్‌లో 350 పడకలు ఉండగా ఒక్కోసారి 700కి పైగా పేషెంట్లు ఉంటున్నారని తెలిపారు.
పేషెంట్లకు అనుకూలంగా సిబ్బందిని ఇవ్వాలని, కొత్తగా నిర్మించిన వంద పడకలకు అనుమతి ఇవ్వాలని మంత్రిని కోరారు. పొన్నం వెంటనే స్పందించి 150ఏసీలు తాను ఇప్పిస్తానని, డ్రైనేజీతోపాటు ఇతర సమస్యలను 15రోజుల్లోగా పరిష్కరిస్తామని చెప్పారు. రోటరీ క్లబ్ వారు అందించే ఎక్విప్మెంట్ కోసం 9లక్షలు వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్‌కు సూచించారు.
సమావేశంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, విజయరమణారావు, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, ట్రైనీ కలెక్టర్, డీఎంహెచ్‌వో సుజాత, ఇన్చార్జి ఆర్ఎంవో డాక్టర్ నవీనా, ఐఎంఎ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాంకిరణ్, ఏడీ షమీమ్, ఇంజినీరింగ్ అధికారులు, రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.