పంచాయతీ ఎన్నికల్లో దిమ్మతిరిగే తీర్పు రావడంతో కంగుతిన్న కాంగ్రెస్ నాయకులు.. బీఆర్ఎస్ మద్దతు, స్వతంత్ర సర్పంచుల వెంట పడుతున్నారు. అధికారంలో పార్టీలో చేరితేనే నిధులు వస్తాయని, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎర వేస్తున్నారు. లేదంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వమని బెదిరింపులకు దిగుతున్నారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి ఏకంగా తమ పార్టీలో చేరితే 10 లక్షల ఫండ్ ఇస్తానని ప్రతిపక్ష పార్టీల సర్పంచులకు గాలం వేసే పనిలో ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్తోపాటు స్వంత్రులు, బీజేపీ సర్పంచులను ఒప్పించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
కరీంనగర్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పల్లె ప్రజలు కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే తీర్పును ఇచ్చారు. అధికారపక్షంలో లేకున్నా సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు పట్టంగట్టారు. అంతే కాకుండా స్వతంత్రులు, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులను కూడా గెలిచారు. మెజార్టీ స్థానాలు సాధించి ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీయాలని భావించిన అధికారపార్టీకి ఈ ఎన్నికల్లో చుక్కెదురైంది. కరీంనగర్ జిల్లాలో 308 సర్పంచ్ స్థానాలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఊహించని రీతిలో 108 స్థానాలను కైవసం చేసుకున్నది. గ్రామాలన్నీ స్వీప్ చేస్తామని చెప్పుకొన్న హస్తం పార్టీ 120 స్థానాలతోనే సరిపెట్టుకున్నది. 42 స్థానాల్లో బీజేపీ, 38 స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందగా, కొన్ని మండలాల్లో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ అధికంగా సీట్లు చేజిక్కించుకున్నది. మరికొన్ని మండలాల్లో సమానంగా సీట్లు సాధించింది. కాంగ్రెస్‌ది పైచేయి అనుకున్న మండలాల్లో ఒకట్రెండు సర్పంచులు మాత్రమే అధికంగా వచ్చాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధిపత్యం కనిపించగా, మానకొండూర్‌లో కాంగ్రెస్ కంటే ఒక సర్పంచ్ స్థానం అధికంగా గెలుచుకున్నది. అంతేకాకుండా చాలా చాట్ల తక్కువ ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. కొన్ని గ్రామాల్లో ఒకట్రెండు ఓట్లతో చివరి వరకు పోరాడారు. సాదారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే స్థానిక సంస్థల్లో ప్రజలు ఆ పార్టీవైపే మొగ్గు చూపుతుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా ఈ ఎన్నికల్లో ప్రజలు భిన్నంగా స్పందించారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది.
అధికార పార్టీకి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పంచాయతీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా బయట పడింది. దీంతో కంగుతున్న కాంగ్రెస్ నాయకులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నాల్లో పడ్డా రు. ఏ పార్టీలో గెలిస్తే ఏంటి? తమ పార్టీలో కలుపుకొంటే సరిపోతుందన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీల్లో గెలిచిన సర్పంచులను తమ పార్టీలో కలువాలని ప్రలోభాలకు గురిచేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఇప్పటికే ఈ ప్రయత్నాలు మొదలు పెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు ప్రతిపక్ష పార్టీల సర్పంచుల వెంట పడుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ సర్పంచులే లక్ష్యంగా పెట్టుకుని పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారు. తమ పార్టీలో చేరితే గ్రామాభివృద్ధికి 10 లక్షలు ఇస్తానని జిల్లాకు చెందిన ఓ మంత్రి బీఆర్ఎస్ సర్పంచులకు గాలం వేస్తున్నట్టు తెలుస్తున్నది. బీఆర్ఎస్ సర్పంచులు మొగ్గు చూపకపోవడంతో ముందుగా స్వతంత్రులుగా గెలిచిన వారిపై దృష్టి సారించినట్టు తెలిసింది. స్వతంత్రులుగా గెలిచిన వారిలో ఎక్కువగా తమ పార్టీ సానుభూతిపరులే ఉన్నారని కాంగ్రెస్ భావిస్తున్నది. అధికార పార్టీలో ఉంటేనే నిధులు వస్తాయని, గ్రామాలు అభివృద్ధి అవుతాయని, ఎన్నికల్లో చేసిన అప్పులు కూడా తీర్చుకోవచ్చనే విధంగా సర్పంచులను నయానో.. బయానో ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడువకముందే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తున్నది. బీఆర్ఎస్ను వీడితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆ పార్టీకి చెందిన సర్పంచులు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తున్నది. పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు చట్ట ప్రకారమే వస్తాయని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ సర్పంచులకు ఏ విధంగానైతే నిధులు వచ్చాయో.. అదే విధంగా తమకు నిధులు వస్తాయని బీఆర్ఎస్ సర్పంచులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైపు మొగ్గు చూపే పరిస్థితి కనిపించకపోవడంతో పార్టీ మారితే ప్రత్యేక నిధులు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని, తమ పదవీ కాలంలో రెండేళ్లు మిగిలిన గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామని కొందరు బీఆర్ఎస్ సర్పంచులు ముఖం మీదనే చెబుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌కు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా ఇప్పుడు పార్టీ మారితే తమపైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని, భవిష్యత్తులో ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదని స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రలోభాలకు లొంగవద్దని మరో పక్క బీఆర్ఎస్ నియోజకవర్గాల ఇన్చార్జిలు, ముఖ్యనాయకులు కూడా సర్పంచులను అప్రమత్తం చేస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ సర్పంచులు సానుకూలంగా లేక పోవడంతో స్వతంత్రులు, బీజేపీ సర్పంచులవైపు కాంగ్రెస్ నాయకుల దృష్టి మళ్లినట్టు తెలుస్తున్నది.