సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట/తెలంగాణ చౌక్, ఏప్రిల్ 17 : రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేట మండలం లో సోమవారం పర్యటించారు. హైదరాబాద్ నుంచి ఎల్లారెడ్డిపేట మండలం దుమాలకు ఉదయం 11.36 గంటలకు చేరుకున్న ఆయన, ఇచ్చిన మాట ప్రకా రం యాదవుల కులదైవం బీరప్ప పట్నా ల ఉత్సవంలో పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆశీర్వచనం అందించారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులను ఆప్యాయంగా మంత్రి పలుకరించారు. సెల్ఫీలు కూడా దిగారు. అక్కడి నుంచి రాజన్నపేటకు వెళ్తున్న మార్గంలో కిష్టునాయక్తండా వాసులు ఘన స్వాగతం పలికారు. జగదాంబ ఆలయంలో పూజలు చేశారు. స్థానిక మహిళలు మహిళా సంఘ భవనం మంజూరు చేయాలని కోరగా, వెంటనే స్పందించారు.
సర్పంచ్ ప్రభునాయక్ తనవంతుగా రెండు గుంటల స్థలాన్ని ఇస్తానని చెప్పడంతో నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నెల రోజుల తర్వాత గ్రామానికి వస్తానని, మహిళా సంఘ భవన నిర్మాణ పనులతోపాటు నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించుకుందామని చెప్పారు. అనంతరం మధ్యాహ్నం 12:20 గంటలకు తన దత్తత గ్రామమైన రాజన్నపేటకు చేరుకున్నారు. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా 33 లక్షలతో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులు, తదితర అభివృద్ధి పనులను, 37 లక్షలతో నిర్మించిన నూతన జీపీ భవనాన్ని ప్రారంభించారు. సర్పంచ్ ముక్క శంకర్‌ను కుర్చీలో కూర్చోబెట్టి అభినందించారు. అక్కడే కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడారు. కుట్టు మిషన్లు కావాలని అడుగడంతో, ఉన్న 90 మందికి ఇస్తానని హామీ ఇచ్చారు.
జీపీ ఎదుట ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. అనంతరం మధ్యాహ్నం 1:40 గంటలకు బాకురుపల్లితండాకు వెళ్లారు. 20లక్షలతో నిర్మించిన నూతన జీపీ భవనాన్ని ప్రారంభించి, సర్పంచ్ మంజులను అభినందించారు. అనంతరం లావని పట్టాలు, ఇతర సమస్యలపై గ్రామస్తుల నుంచి వినతి పత్రాలను స్వీకరించి, సమస్య పరిష్కారానికి భరోసానిచ్చారు. తర్వాత సభలో మాట్లాడారు. అనంతరం కమ్యూనిటీ భవనం ఆవరణలో భోజనం చేశారు. మధ్యాహ్నం 2:10 గంటలకు తిమ్మాపూర్‌లో 28లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని పీఏసీఎస్ చైర్మన్ రామగిరి సుధీర్‌రావు, వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తితో కలిసి ప్రారంభించారు. మధ్యాహ్నం 2:34 గంటలకు ఇటీవల మోకాలుకు శస్త్ర చికిత్స చేసుకున్న సీనియర్ కార్యకర్త అందె సుభాష్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం 2:50 గంటలకు హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు.