రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. సుమారు 7:30 గంటల పాటు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గంలో రూ.వంద కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సిరిసిల్ల కలెక్టరేట్లో జిల్లాలోని 600 మంది బీసీ కుల వృత్తిదారులకు రూ.లక్ష చొప్పున రూ.6 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో గృహలక్ష్మి పథకం, ఇతర అంశాలపై సమీక్షించారు. తర్వాత సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, వస్త్ర పరిశ్రమ ఉత్పత్తిదారులు, వ్యాపారులు, టెక్స్టైల్ అధికారులతో సమావేశమయ్యారు.
వేములవాడ/ కలెక్టరేట్/ సిరిసిల్లరూరల్, ఆగస్టు 8 : రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం విస్తృత పర్యటన చేశారు. ఉదయం 11 గంటలకు జిల్లాకు చేరుకున్న ఆయన సాయంత్రం 6:30 గంటల వరకు వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి పాల్గొన్నారు. ముందుగా వేములవాడ పట్టణానికి చేరుకున్న ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11:10 గంటలకు రూ.1.27 కోట్లతో నిర్మించిన నందికమాన్ జంక్షన్‌ను ప్రారంభించారు. అనంతరం వేములవాడ అర్బన్ మండలం చింతల్‌ఠాణా ఆర్అండ్ఆర్ కాలనీలో సంచార జాతులకోసం రూ.2.20 కోట్లతో నిర్మించిన 42 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులతో కాసేపు ముచ్చటించి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
తర్వాత వేములవాడ ఏరియా దవాఖానలో రూ.కోటితో ఏర్పాటుచేసిన డయాలసిస్ సెంటర్, మాతా సేవాకేంద్రం, నవజాతశిశువుల కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఇక్కడే రూ.40 లక్షలతో ఏర్పాటుచేసిన బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించారు. తర్వాత రూ.1.98 కోట్లతో మూలవాగు ఒడ్డున నిర్మించిన పార్క్‌ను ప్రారంభించి పార్క్‌లో తిరిగారు. తర్వాత రూ.10 కోట్లతో నిర్మించనున్న బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులను ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ప్రస్తుత సంస్కృత పాఠశాల ఆవరణలో రూ.15 కోట్లతో నిర్మించనున్న వసతి గదుల సముదాయానికి శంకుస్థాపన చేశారు. రూ.2.70 కోట్లతో నిర్మించిన సమీకృత మార్కెట్ భవనాన్ని ప్రారంభించారు.
గుడిచెరువు కట్టపై రూ.12 కోట్లతో టూరిజంశాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న సుందరీకరణ పనులు, రూ.90 లక్షలతో నిర్మించే శివార్చన వేదిక శిలాఫలాకాలను ఆవిష్కరించారు. రూ.42 కోట్లతో ఇంటింటికీ మంచినీరు అందించే మిషన్‌భగీరథను మహాలక్ష్మి వీధిలో కాలనీ మహిళలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లా నీళ్లు తాగారు. 2:15 గంటలకు సిరిసిల్లకు చేరుకున్నారు. భోజనం తర్వాత 2:35 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లాలోని 600 మంది బీసీ కుల వృత్తిదారులకు రూ.లక్ష చొప్పున రూ.6 కోట్ల విలువైన చెక్కులను అందజేసి, ప్రసంగించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సెస్ డైరెక్టర్లతో కలిసి గృహలక్ష్మి పథకం, ఇతర అంశాలపై సమీక్షించారు. తర్వాత సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృధ్దిపై తీసుకోవాల్సిన చర్యలు, వస్త్ర పరిశ్రమ ఉత్పత్తిదారులు, వ్యాపారులు, టెక్స్టైల్ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు.
రామన్నను చూసి చిన్నారుల కేరింత
వేములవాడలోని భగవంతరావునగర్‌లో సమీకృత మార్కెట్ భవనాన్ని ప్రారంభించి తిరిగి ప్రయాణమవుతున్న నేపథ్యంలో పక్కనే ఉన్న జిల్లా పరిషత్ బాలికల పాఠశాల విద్యార్థులు మంత్రి కేటీఆర్‌ను చూసి కేరింతలు కొట్టారు. గమనించిన అమాత్యుడు రామన్న పాఠశాల ప్రహరీ వద్దకు వెళ్లి కిటికీలోనుంచి చిన్నారులతో ముచ్చటించారు. ఏ క్లాస్ చదువుతున్నారని అడిగి, బాగా చదువుకోవాలని సూచించారు. ‘మేం మీ అభిమానులం సార్’ అంటూ వాళ్లు అనగా.. తాను కూడా మీ అభిమానిని అంటూ వారికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్లారు.
జీవితాంతం రుణపడి ఉంటం
ఇంత మంచిగా డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తారని అనుకోలేదు. రెండు గుంటల భూమితోపాటు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్‌బాబుకు రుణపడి ఉంటం. మా జీవితంల ఇలాంటి ఇంటిలో ఉంటామని ఊహించలేదు. మాకు ఇల్లు కావాలని గతంలో ఎంతో మందిని కలిసినా పట్టించుకోలేదు. కొత్త ఇంటి పట్టాలు అందజేసిన ఈ గవర్నమెంట్‌కు జీవితాంతం రుణపడి ఉంటం.
– రోజా, చింతల్‌ఠాణా