కరీంనగర్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) కరీంనగర్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ అయ్యింది. కరీంనగర్ నియోజకవర్గంలోని అర్బన్‌తోపాటు రెండు మండలాల నుంచి జనం భారీగా తరలి వచ్చారు. అంచనాలకు మించి జనం రావడంతో కరీంనగర్, సిరిసిల్ల రోడ్డు పూర్తిగా జనసంద్రమైంది. ఉదయం 9 గంటల నుంచి సభకు జనం రావడం కనిపించింది. గులాబీ కండువాలు చేత బూని ఆటోలు, వ్యాన్లు, మినీ బస్సులు, బైక్‌లపై జనం వచ్చారు. ఆయా డివిజన్లు, గ్రామాలకు చెందిన యువకులు బైక్‌లపై ర్యాలీగా తరలి వస్తూ ‘జై తెలంగాణ’ అంటూ హోరెత్తించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ పూర్తిగా నిండి పోవడంతో వందలాది మంది కార్యకర్తలు, జనాలు సిరిసిల్ల రోడ్డుపై నిలిచి పోయారు. పద్మనగర్ నుంచి గీత భవన్ చౌరస్తా వరకు అటు చింతకుంట, కమాన్‌పూర్ వరకు జనాలు బారులు తీరి రావడం కనిపించింది.
ఆకట్టుకున్న గంగుల స్పీచ్
తాను చేసిన అభివృద్ధి పనుల గురించి మంత్రి గంగుల ప్రజలకు వివరించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత సులువుగా కోట్లాది నిధులు ఇచ్చింది చాలా స్పష్టంగా అర్థం చేయించారు. కౌన్సిలర్‌గా ఉన్నా, కార్పొరేటర్‌గా ఉన్నా, ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నా అప్పటికి ఇప్పటికి ఒకే తీరుగా ఉన్నానని, ఒక అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా ప్రజల మధ్యనే ఉన్నానని గంగుల చేసిన ప్రసంగం జనాలను ఆకట్టుకుంది. సభకు భారీగా జనం తరలి రావడంతో గంగుల గెలుపు నల్లేరుపై నడకే అన్నట్లుగా అనిపించింది.
ఉత్తేజ పర్చిన కేటీఆర్ ప్రసంగం
హైదరాబాద్ నుంచి హెలీక్యాప్టర్‌లో కరీంనగర్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అక్కడి నుంచి సిరిసిల్ల, జగిత్యాల బైపాస్ మార్గంలో సభా స్థలికి చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సభలో ఆయన చేసిన ప్రసంగం కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపింది. కరీంనగర్లో గంగుల కమలాకర్‌పై పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు జంకుతున్నాయని, ఆయనపై పోటీ చేయడం అంటే పోచమ్మ గుడి ముందు కట్టేసి పొట్టేలుతో సమానమని చేసిన వ్యాఖ్యలు సభలో ఒక్కసారిగా నవ్వులు పూయించాయి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై గంగుల అంటూ కార్యకర్తలు నినాదాలు ఇచ్చారు. బండి సంజయ్‌పై విమర్శలు చేసినపుడల్లా కార్యకర్తలు ఉత్సాహంతో నినదించారు.
గంగులపై పోటీ అంటే గుడి ముందు పొట్టేలు కట్టేసిన లెక్కనే..
మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీ చేసుడంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్టేనని భయపడి పారిపోతున్నరు. కమలాకర్ మీద పోటీ చేయండని కాంగ్రెస్ బీఫాం ఇస్తామంటే నాకొద్దంటే నాకొద్దని భయపడి పోతున్నరట. ఒకరు హుస్నాబాద్ పోతున్నరట, ఇంకొకరు ఇంకెటో పోతున్నరట. ఇక్కడ మాత్రం పోటీ చేయరట. కాంగ్రెస్ పరిస్థితి ఇట్లుంటే బీజేపీ వాళ్లు పోటీ చేయాలా? వద్దా? అనే ఆలోచనలో పడ్డారట. ఇక్కడి బీజేపీ నాయకుడొకరు ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలా?, వేములవాడ నుంచి పోటీ చేయాలా? అనే ఆలోచనలో పడ్డాడట. వీళ్లకు కరీంనగర్లో పోటీ చేసే దమ్ము లేకుండ పోయింది. ఎందుకంటే వాళ్లు ఇక్కడి ప్రజల కోసం చేసింది ఏమీ లేదు. ఈ విషయం వాళ్లకు తెలుసు. కరీంనగర్లో పుట్టి పెరిగిన ఆ నాయకుడి బతుకేందో, లెక్కేందో ఇక్కడి ప్రజలకు స్పష్టంగా తెలుసు.
మళ్లీ గెలిపిస్తే మరిన్ని పథకాలు తెస్తం
మీరు మళ్లీ గెలిపించి మాకు అవకాశం ఇస్తే మరిన్ని కొత్త పథకాలు తెస్తం. రాష్ర్టాన్ని అన్ని విధాలుగా మరింత ముందుకు తీసుకెళ్తం. ఆసరా పెన్షన్లను 5 వేలకు పెంచుకోబోతున్నం. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికీ ధీమా అనే మరో కొత్త పథకాన్ని తెచ్చుకోబోతున్నం. రాష్ట్రంలో ఉండే 93 లక్షల కుటుంబాల కోసం ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించి బీమా చేయించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. మీరు ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఈ పథకాన్ని అమలులోకి తెస్తం.