నాటి సమైక్య పాలనలో ఎమ్మెల్యే అంటే.. పదవిని చూసి మురిసిపోవడం, ప్రజలను పట్టించుకోకపోవడం, నియోజకవర్గాలకు దూరంగా ఉండడం, మళ్లీ ఎన్నికల సమయంలోనే కనిపించడం వంటివి చూశాం. కానీ, స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందుకు పూర్తిగా భిన్నం! ప్రజాసేవకే ప్రాధాన్యమివ్వడం, నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండడం, జనంతో మమేకం కావడం, ప్రతి సమస్యనూ నిశితంగా పరిశీలించి పరిష్కరించడం, ప్రభుత్వ ఫలాలను గడపగడపకూ అందించడం, నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టించడం వారికి ఇష్టం! ఫలితంగా ప్రజల్లో ఆదరణ పొందుతున్నారు. తమ విజయపరంపరను కొనసాగిస్తున్నారు. అందుకే అధినేత కేసీఆర్ మళ్లీ సిట్టింగ్‌లకే అవకాశం కల్పించారు. వేములవాడ, కోరుట్ల, హుజూరాబాద్‌లో సిట్టింగ్‌లు కాకపోయినా సమర్థులైన వారికి టికెట్లు ఇచ్చారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా మొత్తం సీట్లు గులాబీ ఖాతాలోకి చేరుతాయని నిపుణులు చెబుతుండగా, ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన విషయంలో సీఎం కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక చాలా మంది పోటీకే జంకుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆది నుంచీ జనంలో ఉంటున్నారు. పదవుల్లో ఉన్నామని కాకుండా ప్రజాసేవకులుగా అందుబాటులో ఉంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో కార్యక్రమం పేరిట, పొద్దు పొడవంగానే గ్రామాలకు వెళ్తున్నారు. స్థానికంగా పర్యటిస్తూ.. జనంతో మమేకమవుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ పథకానికి సంబంధించి చెక్కులు వస్తే.. ఏ ఆఫీసులోనో లేదంటే ఎక్కడైనా పంపిణీ కార్యక్రమంలోనే అందిస్తుంటారు. కానీ, మన ప్రజాప్రతినిధులు మాత్రం అందుకు భిన్నంగా నేరుగా సదరు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి చెక్కులను అందజేస్తున్నారు. ప్రేమతో ఆడబిడ్డలకు చీరలు కూడా పెడుతున్నారు. మరికొంత మంది స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతూ సాయం అందిస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
మంత్రి, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, ప్రతి రోజూ తన నియోజకవర్గంలోనే తిరుగుతూనే ఉంటారు. కష్టం ఉన్న చోట అయన ఉంటారు. ప్రజల సాధకబాధలను వింటూనే.. అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఆయన, ధర్మపురిని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ ప్రజల మన్నలను పొందుతున్నారు. మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా నిత్యం జనం మధ్యలోనే ఉంటున్నారు. తన రాజకీయ జీవితంలో ఓటమి అంటే ఏమిటో తెలియని నాయకుడిగా ఎదిగిన ఆయన, ప్రజలే తనకు దైవమంటున్నారు. ఆ ఇష్టంతోనే జనంతో మమేకమవుతూ ప్రతి సమస్యనూ పరిష్కరిస్తున్నారు. కరీంనగర్ సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది మన్నలను పొందుతున్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజవర్గ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చి వేశారు. ఒకనాడు కరవుతో అల్లాడిన సిరిసిల్లను నేడు సిరులకు నిలయంగా మార్చారు.
ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను సిరుల ఖిల్లామా మర్చడమే కాదు, వస్త్రపరిశ్రమకు జీవం పోసి నేతన్నలకు చేయూతనిచ్చారు. అలాగే సిరిసిల్లను అభివృద్ధికి కేరాఫ్‌గా నిలిపి ప్రజాభిమానం చూరగొన్నారు. ఎమ్మెల్యేలు కూడా నిత్యం జనం మధ్యలోనే ఉంటున్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పొద్దు పొడువక ముందే గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూడా అదేబాటలో సాగుతున్నారు. ప్రభుత్వ ఫలాలను నేరుగా ఇంటింటికీ చేరుస్తూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ తన దైనశైలిలో ప్రజాభిమానం పొందుతున్నారు. ప్రజల వద్దకు వెళ్లి, సమస్యలు తెలుసుకొని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అంతేకాదు, హుస్నాబాద్‌లో గతంలో ఎప్పుడూ లేని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్.. వైద్యుడిగా ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తూనే.. ‘మీరు-నేను’ పేరిట గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పెద్దపల్లికి కావాల్సిన సాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తూనే.. ప్రభుత్వ ఫలాలను ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటి చందర్.. సింగరేణితోపాటు రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తూ మన్ననలు పొందుతున్నారు.
ఆది నుంచీ ప్రజాక్షేత్రంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు
సమర్థులకు అవకావం
ఉమ్మడి జిల్లాలోని కొన్ని స్థానాల్లో సిట్టింగ్‌లు లేకపోవడం, మరికొన్ని మార్పులు చేర్పులు చేసి కొత్తవారికి అవకాశం కల్పించారు. అయితే ఇక్కడ సమర్థతతోపాటు ఇప్పటికే ప్రజాసేవలో ఉన్నవారికి చాన్స్ ఇచ్చారు. వేములవాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్ బాబు స్థానంలో చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు అవకాశం కల్పించారు. ఉన్నత విద్యావంతుడు కావడంతోపాటు సుదీర్ఘ రాజకీయ అనుభవమున్నది. సొంత నియోజవర్గం కావడంతో ఈ ప్రాంతంలో మంచి పరిచయాలున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, ఉచిత శస్త్ర చికిత్సలు చేస్తూ ప్రజాభిమానం పొందారు. ఇలా అన్ని కోణాల్లోనూ పరిశీలించిన తర్వాతే అధినేత కేసీఆర్ అవకాశం కల్పించారు. కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు స్థానంలో ఆయన తనయుడు కల్వకుంట్ల సంజయ్‌కు చాన్స్ ఇచ్చారు. ఉన్నత విద్యావంతుడు కావడం, కొన్నేళ్లుగా నియోజకవర్గంలో తిరుగుతూ సేవా కార్యక్రమాలు చేపట్టడం, ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించడం.. ఇదే సమయంలో ఉచిత వైద్య శిబిరాలు పెట్టి.. శస్త్ర చికిత్సలు ఫ్రీగా చేయడం వంటి వాటితో మంచి పేరు సంపాదించుకున్నారు. హుజూరాబాద్‌లో మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డికి అవకాశం కల్పించారు.
ఆయనకు నియోజకవర్గం మీద మంచి పట్టు ఉండడం, అలాగే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడం, ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం వంటివి పరిగణలోకి తీసుకొని అభ్యర్థిగా ప్రకటించారు. మంథనిలో పుట్ట మధుకు అవకాశం కల్పించారు. నిజానికి ఇతను ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కాకపోయినా మాజీ ఎమ్మెల్యే. అలాగే ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీ చైర్మన్ కూడా. మంథనిపై మంచి పట్టు ఉండడమే కాదు, క్షేత్రస్థాయి నుంచి వచ్చిన రాజకీయ అనుభవం ఉన్నది. అందుకే అధినేత కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల పరిధిలో పనివంతులకే మళ్లీ అవకాశం కల్పించడంతో ప్రతిపక్షాలు బేజారు అవుతున్నాయి. ప్రత్యుర్థులుగా ఎవరిని నిలుపాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నాయి. కాగా ప్రస్తుత పరిస్థితులు ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల నేపథ్యంలో ఈ సారి ఉమ్మడి జిల్లాలో మొత్తం స్థానాలు గులాబీ ఖాతాలో చేరడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల్లోనే రసమయి
కరీంనగర్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : కళామతల్లి ముద్దుబిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతలు ఊగించే పాటలతో ప్రజలను చైతన్యం చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు హ్యాట్రిక్ సాధించే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గాన్ని మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రసమ యి తెలంగాణ ఉద్యమంలో వేదికలపై పాటలు పాడుతూ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. 2014లో కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకు ని మానకొండూర్ ఎమ్మెల్యేగా బరిలో నిలిచి భారీ మెజార్టీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నిత్యం ప్రజల్లోనే ఉంటూ తనదైన శైలిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. 2018లో కూడా మరో అవకాశం ఇవ్వడంతో మొదటిసారి కంటే మరింత మెజార్టీతో మానకొండూర్ ప్రజలకు ఆయనకు పట్టం కట్టారు. వెనుకబడిన ప్రాంతంగా ముద్రపడిన మానకొండూర్ నియోజకవర్గానికి గత పాలకు లు చేసిన అన్యాయాన్ని గ్రహించి ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకునేందుకు ‘తొలిపొద్దు’ చేపట్టారు. ప్రతి రోజూ ఉదయం ప్రజల మధ్యకు వెళ్లి వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ, వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా తమ ఇండ్లలోకి వచ్చి తమ సమస్యలు తెలుసుకున్న వారు గతం లో లేరని ప్రజలు ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారు. అనేక అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అందించడంలో రసమయి బాలకిషన్ అనతి కాలంలోనే నియోజకవర్గంలో మంచి నాయకుడిగా ఎదిగి కేసీఆర్ మన్ననలు పొందారు. దీంతో మరోసారి అవకాశం లభించింది. ఇక నుంచి రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకివెళ్లి మరోసారి గెలుపు ఖా యంచేసుకుని హ్యాట్రిక్ సాధిస్తాననే ధీమాతో రసమయిబాలకిషన్ కనిపిస్తున్నారు.
జనంతో మమేకం ‘సుంకె’
కరీంనగర్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : చొప్పదండి అంటే ఒకప్పుడు చాలా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ తాగేందుకు కూడా కనీసం నీళ్లు ఉండేవి కాదు. పుణ్యక్షేత్రమైన కొండగట్టులోనూ భక్తులు స్నా నం చేసేందుకు కూడా కరువే కనిపించేది. అలాంటి నియోజకవర్గంలో 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందిన సుంకె రవిశంకర్, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఎక్కడ చూసినా పారే నీళ్లు కనిపించేలా చేశారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా అనూహ్య పరిమణామాల మధ్య తెరపైకి వచ్చిన సుంకె రవిశంకర్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2018 తర్వాత ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వగా, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న రవిశంకర్ తన నియోజకవర్గంలో ఎక్కడా నీటి కొరత లేకుండా ప్రణాళికలు చేసుకుని విజయం సాధించారు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా గుర్తింపు పొందిన చొప్పదండి ఇప్పుడు కోనసీమను తలపిస్తున్నదని సీఎం కేసీఆర్ స్వయంగా అనేక సార్లు ప్రస్తావించారు. స్థానికుడైన సుంకె రవిశంకర్‌కు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ‘పొద్దు పొడుపు’ పేరిట గ్రామాల్లో పర్యటించి, వారి సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రెండోసారి అవకాశం కల్పించడంతో రెట్టించిన ఉత్సాహంతో గెలుపు సుసాధ్యం చేసుకుంటానని, మరోసారి భారీ మెజార్టీతో గెలిచి కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతానని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేస్తున్నారు.
అభివృద్ధే ‘గంగుల’ మంత్రం

కరీంనగర్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : అభివృద్ధే ఆయన మంత్రం. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే ఆయన అభిమతం. అందుకే కరీంనగర్ గడ్డపై హ్యాట్రిక్ విజయాన్ని సాధించి, మరోసారి అధికార బీఆర్ఎస్ పార్టీ టికెట్‌ను దక్కించుకున్నారు మంత్రి గంగుల కమలాకర్. అమాత్యుడిగా తన నియోజకవర్గాన్నే కాకుండా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. కరీంనగర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆయన, 2009 నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వస్తున్నారు. 2018లో గెలువడంతో రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధిపై మరింత దృష్టి సారించారు. రూ.వేలకోట్ల నిధులు రాబట్టి కరీంనగర్ నగరాన్ని అతి సుందరంగా తీర్చి దిద్దారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. ఐటీ టవర్ ఏర్పాటు, మానేరు నదిపై కేబుల్ బ్రిడ్జి పూర్తి చేయడంతోపాటు మానేరు రివర్ ఫ్రంట్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. తమ అధిష్టానం ప్రజలేనని, ప్రజల డిమాండ్ మేరకే పనులు చేస్తున్నామని చెప్పే గంగుల, నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. తన సొంత నియోజకవర్గమే కాకుండా ఇన్చార్జి మంత్రిగా జిల్లాను కూడా ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. గతంలో అభివృద్ధి అంటే తెలియని కరీంనగర్ నగరంలో అభివృద్ధి అంటే ఇలా ఉండాలని అతి కొద్ది కాలంలోనే చేసి చూపించారు. కరీంనగర్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం చేపడుతున్నారు. గంగుల చేపట్టిన అభివృద్ధి పనులను చూసిన సీఎం కేసీఆర్ కరీంనగర్ బరిలో మరోసారి ఆయనకే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు.
ఇంటింటికీ కౌశిక్‌రెడ్డి
కరీంనగర్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ బరిలో యువ కిశోరం ఎమ్మెల్సీ, మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి బీఆర్ఎస్ బరిలో దిగనున్నారు. 2018 ఎన్నికల్లో ఈటల రాజేందర్‌పై పోటీ చేసి 61 వేలకు పైగా ఓట్లను సాధించి అందరి దృష్టినీ ఆకర్శించారు. వీణవంకకు చెందిన కౌశిక్‌రెడ్డి పూర్తిగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు. క్రికెటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని రాజకీయాల్లోకి మళ్లారు. మొదట కాంగ్రెస్‌లో చేరి, అనూహ్య పరిణామాల కారణంగా గత 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు వెన్నుదన్నుగా నిలబడ్డారు. 2021 డిసెంబర్లో సీఎం కేసీఆర్ కౌశిక్‌రెడ్డికి శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పించారు. 2023 మార్చి 4న మండలి విప్‌గా నియమితులయ్యారు. నియోజకవర్గంలో తిరుగుతూ నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్న కౌశిక్ రెడ్డి ఉత్సాహాన్ని గుర్తించిన మంత్రి కేటీఆర్ 2023 ఏప్రిల్ 19న జమ్మికుంటలో నిర్వహించిన సభలోనే నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. అప్పటి నుంచి వంద కోట్ల నిధులు తెచ్చి హుజూరాబాద్ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. దీంతో ఆయన దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ‘ఇంటింటికీ కౌశికన్న’ పేరుతో లబ్ధిదారుల ఇండ్లలోకే నేరుగా వెళ్లి చెక్కులు పంపిణీ చేస్తున్నారు. ప్రజలకు అత్యంత దగ్గరగా వెళ్లి సేవలు అందిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఒకరిగా చేర్చారు.