‘డౌట్‌లేదు వచ్చేది మన ప్రభుత్వమే.. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం పక్కా.. ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ వస్తున్న కాంగ్రెస్‌వన్నీ బోగస్ ముచ్చట్లే.. వాళ్లను నమ్మి ఆగంకావద్దు.. ఎవుసం తెలువని రేవంత్ కరెంటుపై మాట్లాడడం విడ్డూరంగా ఉన్నది.. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాలె..” అని సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండల కేంద్రాల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో పాల్గొని ప్రసంగించారు. వీర్నపల్లి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, మల్కపేట రిజర్వాయర్ ద్వారా ఎల్లారెడ్డిపేట మండలాన్ని కోనసీమలా మారుస్తామన్నారు. అపర భగీరథుడు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మండుటెండల్లో ఎగువమానేరు మత్తడి దుంకిందని తెలిపారు. మీ కళ్ల ముందే జరిగిన అభివృద్ధిని చూసి తనను గెలిపించాలని కోరారు.
– సిరిసిల్ల/వీర్నపల్లి/ ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట, నవంబర్ 26
రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన. మీ తల ఎత్తుకునేలా చేశానే తప్ప.. ఎక్కడా తలదించుకునే తప్పులు చేయలేదు. ఏవైనా పొరపాట్లుంటే సరిదిద్దుకుంట. గ్రామానికి, గడప గడపకూ రావాలని ఉన్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలతో రాష్ట్రమంతా తిరగాల్సి వస్తున్నది. అందువల్ల మీ అందరినీ కలువలేక పోతున్న. ఇక నుంచి వారానికి రెండు రోజులు నియోజక వర్గానికి వచ్చి, మీకు అందుబాటులో ఉంటా. మీరు నన్ను ఆశీర్వదించి.. భారీ మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకం ఉన్నది.
– మంత్రి కేటీఆర్
సిరిసిల్ల/వీర్నపల్లి/ ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట, నవంబర్ 26 : ‘వచ్చేది మన ప్రభుత్వమే.. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం పక్కా’ అని సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండల కేంద్రాల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో పాల్గొన్నారు. ముందుగా వీర్నపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో అమాత్యుడు మాట్లాడారు. వీర్నపల్లి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని.. ప్రగతి, సంక్షే మం కావాలంటే కేసీఆరే మళ్లీ రావాలి అని అన్నారు. మీరు ఓటేస్తే తాను 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందానని, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రిని అయి మీకు సేవ చేస్తున్నానని తెలిపారు. సరిగ్గా 14 ఏండ్ల క్రితం తెలంగాణ కోసం ఉద్యమ నేత కేసీఆర్ 11 రోజులు అమర నిరాహార దీక్షతో ఢిల్లీ పెద్దలు కదిలి డిసెంబర్ 9న తెలంగాణను ప్రకటించారన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత వీర్నపల్లిలోని పాఠశాలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దామని తెలిపారు.

అత్యాధునిక సదుపాయాలు కల్పించామన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎన్నికల కాగానే బీడీ కార్మికుల కటాఫ్ తేదీని మార్చి అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని ప్రకటించారు. అత్తలకు పింఛన్లు పెంచుతామని, కోడండ్లకు కూడా సౌభాగ్యలక్ష్మి ద్వారా రూ.3 వేల పింఛన్ ఇస్తామని తెలిపారు. ప్రధాని మోదీ సిలిండర్ ధరను రూ.1,200కు పెంచాడని, ఈ ఎన్నికలు కాగానే బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.400కే ఇస్తుందని ప్రకటించారు. జనవరిలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో 93 లక్షల తెలుపు రేషన్‌కార్డులు ఉన్నవారికి కేసీఆర్ బీమా ద్వారా రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. తెలుపు రేషన్‌కార్డుదారులకు అన్నపూర్ణ పథకంలో సన్నబియ్యం అందిస్తామన్నారు.
గల్ఫ్ బాధితులకు రూ.5 లక్షల బీమా సదుపాయంతోపాటు గల్ఫ్ పాలసీ అమల్లోకి తెస్తామన్నారు. మల్కపేట నుంచి వన్‌పల్లికి లిప్ట్ ద్వారా సాగునీరు తెస్తున్నామని పేర్కొన్నారు. వీర్నపల్లి వెంకటరాయిని చెరువు బాధితుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వీర్నపల్లి కొత్త మండలంగా ఆవిర్భవించిందని, మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించి అందుబాటులోకి తెస్తామన్నారు. వీర్నపల్లిలోని ప్రతి తండాకు ఒక సేవలాల్ భవన్ కేటాయిస్తామని చెప్పారు. ఆరు శాతంగా ఉన్న గిరిజన రిజర్వేషన్లు పది శాతం పెంచామని గుర్తు చేశారు.
సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను అధికారికంగా సీఎం కేసీఆర్ ప్రకటించారని వివరించారు. మండలానికి ఒక బంజారా భవన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. వీర్నపల్లి మండలంలోని పోడు పట్టాలు అందిస్తామని చెప్పారు. కాంట్రాక్టర్‌ను మార్చి పెం డింగ్‌లో ఉన్న వీర్నపల్లి రహదారి పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. సాగునీరు తెచ్చింది, 24 గంటల ఇస్తున్నది కేసీఆరే.. కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంటే ఇస్తామని, 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంటున్నారని.. వారిని నమ్మితే ఆగం అయితామన్నారు. కాంగ్రెస్ 55 ఏండ్లపాటు ప్రజలను సతాయించిందని, మనం ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నామని.. మళ్ల వాళ్లకు అవకాశం ఇచ్చి మన తొవ్వను కరాబు చేసుకోవద్దని కోరారు. మీకు న్యాయం చేసేది కేసీఆరే.. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ రావాలని కోరారు. ‘ప్రతి గ్రామం.. గడపగడపకూ రావాలని నాకు ఉన్నది. పార్టీ బాధ్యతలతో రాష్ట్రమంతా తిరగాల్సి వస్తున్నది. ఇవేం మనసులో పెట్టకోకుండా మీ గ్రామానికి.. మీ ఇంటికి వచ్చినట్లు అనుకొని నాకు మద్దతు ఇవ్వండి’ అని మంత్రి కేటీఆర్ కోరారు.

మల్కపేట రిజర్వాయర్ నుంచి సింగసముద్రం వరకు కాలువ పనులు తుదిదశకు చేరుకున్నాయని, త్వరలోనే ఎల్లారెడ్డిపేట మండలాన్ని కోనసీమలా మారుస్తామని సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొని మాట్లాడారు. గతంలో కరెంటు కష్టాలను ఏకరువు పెడుతూ, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వెంకటాపూర్‌కు చెందిన మునిగె ఎల్లయ్య ఎరువుల కోసం లైన్లో నిలుచుని కుప్పకూలిన పరిస్థితులు ఇంకా గుర్తున్నాయన్నారు.
గ్రామాల్లో ఎవరైనా చనిపోతే, దహన సంస్కారాల తర్వాత స్నానం చేసేందుకు కరెంటు ఇవ్వాల ని బతిమిలాడిన రోజులను గుర్తు తెచ్చుకోవాలన్నారు. కరెంటు లేక షాపుల్లో ఇన్వర్టర్ లేనిది కనిపించిందా..? అంటూ ప్రజలకు గుర్తు చేశారు. డిసెంబర్ 3 తర్వాత సౌభాగ్యలక్ష్మి కింద కోడళ్లకు రూ.3 వేల పింఛన్ ఇచ్చి శుభవార్త చెబుతామన్నారు. 2014 కంటే ముందు మోదీ జన్‌ధన్ ఖాతా తెరిస్తే రూ.15 లక్షలు వేస్తానని, సిలిండర్ ధర తగ్గిస్తామని హామీ ఇచ్చి రెండూ చేయలేదని విమర్శించారు.
రైతుబంధుపై కాంగ్రెసోళ్లు వెటకారపు మాటలు మాట్లాడుతున్నరు. రైతుబంధు కౌలుదారుకు ఇస్తే రైతుకు ఇవ్వమని, రైతుకు ఇస్తే కౌలుదారుకు ఇవ్వమని తేల్చిచెబుతున్నరు. ఇదే జరిగితే రైతు తమ పొలాన్ని కౌలుకు ఇస్తడా? ఇది కౌలురైతు కడుపుకొట్టే ముచ్చటకాదా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి 10 హెచ్‌పీ మోటర్తో పొలానికి నీళ్లు పారిస్తే మూడుగంటల కరెంటు సరిపోతదంటూ అసలు ఏ రైతు 10 హెచ్‌పీ మోటర్ పెడుతున్నడో తెలియని వాళ్లు కాంగ్రెస్ పార్టీ వాళ్లని ఎద్దేవా చేశారు.
కరెంటు ఎక్కడుంది అంటున్న రేవంత్‌రెడ్డికి బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. మండలంలో ఏ ఊరికి ఏ టైమ్‌లో పోతవోపోయి కరెంటు తీగలు పట్టుకుం టే ఉన్నదా? లేదా? తెలుస్తుందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. అందరి కీ కొత్తగా తెల్ల రేషన్‌కార్డు ఇస్తామని, అందరికీ సన్నబియ్యం కూడా ఇవ్వబోతున్నామని చెప్పారు. పెన్షన్ రాని బీడీ కార్మికులు ఇంకా 50 వేల మంది ఉన్నారని, వారందరికీ పింఛన్లు ఇస్తామని హామీఇచ్చారు. రైతులకే కాకుం డా అందరికీ రూ.5లక్షల బీమా చేయించనున్నామని పేర్కొన్నారు. తొమ్మిదిన్నరేండ్లు తనకు అవకాశం ఇచ్చిన సిరిసిల్ల నియోజకవర్గాన్ని అద్భుతంగా చేసుకున్నామన్నారు. ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పా టు చేస్తామని, ఇందుకోసం రూ.40 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. అలా గే, వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కూడా నెలకొల్పుతామని చెప్పారు.

మం డల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మోడర్న్‌గా చేసినట్లు, ప్రతి బడినీ చేయాలన్నదే తన కల.. అంటూ మనసులోని మాటచెప్పారు. వచ్చే టర్మ్‌లో అర్హులందరికీ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. చాలామంది బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్తున్నారని, వారికోసం గల్ఫ్ పాలసీ తెచ్చి వారికి సైతం రూ.5 లక్షల బీమా పాలసీని చేయిస్తామన్నారు. ‘కాంగ్రెస్ అనే దున్నపోతు 55 ఏండ్లు పొడిచిందని.. పాలిచ్చే బర్రెనిడిసి పొడిచే దున్నపోతును చేరదీయవద్దని’ ప్రజలకు సూచించారు. మల్కపేట రిజర్వాయర్ పూర్తి చేసి, కాలువలను తవ్వి సింగసముద్రం నింపబోతున్నది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
ఎల్లారెడ్డిపేట మండలాన్ని కోనసీమ కంటే బాగా చేసుకుంటామని తెలిపారు. ‘తన మీద ఉన్న ఒకే ఒక షికాయతు ఉన్నది.. అది తాను అందరికీ అందుబాటులో ఉండడం లేదని.. ఇక నుంచి వారానికి రెండు రోజులు అందరికీ అందుబాటులో ఉంటా.. అని హామీఇచ్చారు. అధికారం ఉన్నప్పుడు రూ.200 పింఛన్ ఇచ్చినోడు.. అధికారంపోంగనే రూ.4 వేలు ఇస్తామంటే నమ్ముదామా అంటూ అడగ్గానే లేదు.. లేదు.. అంటూ ప్రజలు సమాధానం చెప్పారు. అసైన్డ్ భూములు ఉన్నవారికి పట్టాలిచ్చేందుకు నిర్ణయించామని, ప్రతి గ్రామంలో మహిళా సంఘ భవనాలను నిర్మించి ఇస్తామని తెలిపారు.
గోదావరి జలాలను నర్మాల ఎగువ మానేరుకు కూడవెల్లి వాగు ద్వారా తీసుకువచ్చి మండుటెండల్లో మానేరు మత్తడి దుంకిన నీళ్ల సాక్షిగా నన్ను ఆశీర్వదించాలని సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి మండల కేంద్రంలోని నిర్వహించిన రోడ్‌షో కార్యక్రమానికి హాజరయ్యారు. సుభాష్‌నగర్ నుంచి దోస లగూడెం వరకు కిలోమీటరు మేర నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు.
కేసీఆర్ సారు సంకల్పంతో కొట్లాడి తెచ్చుకున్న రా్రష్ట్రంలో రెండు సార్లు నన్ను గెలిపించారు. 65ఏళ్లలో జరుగని అభివృద్ధి పనులతోపాటు పేదల సంక్షేమానికి దేశంలో ఆదర్శమైన సంక్షేమ పథకాలను అర్హులందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఏప్రిల్‌లో మానేరుకు గోదావరి జలాలను తీసుకువచ్చి మత్తడి దుంకించామన్నారు. మీరు కళ్లతో చూసిన నీళ్ల సాక్షిగా నన్ను ఆశీర్వదించాలని కోరారు. ఏప్రిల్‌లో పరీక్ష ఫెయిల్ అయితే, తిరిగి సప్లమెంటరీ రాసే పరీక్షలు ఇవి కాదని, పని చేయని వారికి ఓటేసి ఐదేళ్లపాటు కష్టాలను తెచ్చుకోవద్దన్నారు. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు రాష్ట్రంలోని ఆదర్శంగా గంభీరావుపేటలో కేజీ టూ పీజీ విద్యాలయం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
అందులో చక్కటి హాస్టల్ వసతి ఏర్పాటు చేసుకుందామని వారు తెలిపారు. లింగన్నపేట వాగుపై వంతెన నిర్మాణం ప్రారంభించుకున్నామని, నర్మాల ప్రాజెక్టు వద్ద మరో రెండు వంతెనలను నిర్మాణం చేసుకుందామని కేటీఆర్ అన్నారు. సింగసముద్రం నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వార సముద్రలింగాపూర్, గజసింగవరం, గోరంటాల గ్రామాలకు సాగు నీరు అందించే పనులు చేపట్టుకుందామన్నారు. మండల కేంద్రంలోని రోడ్డు విస్తరణలో భాగంగా రెండు వైపులా ఇండ్లు, భవనాలు కోల్పోతున్న బాధితులకు రానున్న రోజుల్లో అండగా ఉంటానని అభివృద్ధికి సహకరిస్తూ నన్ను తిరిగి ఆశీర్వదించాలని కోరారు.