పెద్దపల్లి, మే 15 (నమస్తే తెలంగాణ): ‘రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన చివరి గింజనూ కొంటాం. ఇటీవల అకాల వానలతో దెబ్బతిన్న పంటలన్నింటికీ ఎకరానికి 10వేల చొప్పున పరిహారం ఇస్తాం.’ అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, వృద్ధాప్య, దివ్యాంగ శాఖల మంత్రి కొ ప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ సర్కారు రైతాంగానికి ప్రోత్సాహం అందిస్తున్నదని చెప్పారు. సోమవారం ధాన్యం కొనుగోళ్లపై పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో మండలి చీఫ్ విప్ భానుప్రసాదరావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, కలెక్టర్ సర్వే సంగీతా సత్యనారాయణతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల తీరుపై కలెక్టర్ మంత్రికి వివరించారు.
క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించి కొనుగోలుకు ఇబ్బందులు రాకుండా చూ డాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లాలో 3.49 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు మొదటి విడుత ఎకరానికి 10 వేల చొ ప్పున పరిహారం మంజూరు చేశామని తెలిపా రు. కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాస్థాయి ఆఫీసర్లను మండలానికి ప్రత్యేకాధికారులగా నియమించామని చెప్పారు. రైస్ మిల్లుల వద్ద 24 గం టలు ధాన్యం దిగుమతి చేసేలా చర్యలు చేపట్టామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తూకంలో కోత పెడితే బాధ్యులైన రైస్మిల్లర్లపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణం
రాష్ట్ర ప్రభుత్వం రైతు అనుకూల విధానాలతో పెద్దపల్లి జిల్లాలో సాగువిస్తీర్ణం గణనీయంగా పె రిగిందన్నారు. ఏటా రూ. 10వేల కోట్లు వెచ్చిం చి సాగుకు ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు. నీటి తీరువా రద్దుచేసి ఉచితంగా సాగునీరు అం దిస్తున్నామని చెప్పారు. రైతుబంధు, రైతు బీ మా పథకాలతో అన్నదాతకు భరోసానిస్తున్నామని పేర్కొన్నారు. సకాలంలోఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 303 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 3. 49 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పారు. ఇప్పటివరకు 92. 750 వేల టన్నుల ధాన్యం కొని 89 వేల టన్నులను రైస్ మిల్లులకు తరలించామని తెలిపారు. గతేడాది ఈ సమయానికి కేవలం 80 వేల టన్నులు కొంటే ఈ యేడు అదనంగా మరో 12 వేల టన్నులను కొ నుగోలు చేశామని తెలిపారు. రైస్ మిల్లర్ల వద్ద స్థలం కొరత కారణంగా వడ్ల తరలింపులో కొంతమేర ఇబ్బంది కలిగిందన్నారు.
ప్రతిపక్షాల రాద్ధాంతం..
ప్రతిపక్షాలు రైతుల ముసుగులో రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ రాక, విత్తనాలు, ఎరువులు అందక రైతులు అరిగోస పడ్డారని గుర్తుచేశారు. దేశంలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. పక్క రాష్ర్టాల్లో కొనుగోలు కేంద్రాలను ఎత్తేశారని, కేవలం 15 శాతం ధాన్యాన్నే ప్రభుత్వాలు కొంటున్నాయని చెప్పారు. జిల్లాలో అ కాల వానలతో 6910 ఎకరాల్లో పంటలు నష్టపోయిన 5790 మంది రైతులకు ఎకరానికి 10 వేల చొప్పున 6 .91 కోట్ల పరిహారం మంజూరు చేశామని తెలిపారు. రెండో విడుత సైతం ఎకరానికి 10 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ధాన్యం సేకరణలో ఏమైనా సమ స్యలు ఎదురైతే అధికారుల దృష్టికి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, డీపీఆర్వో తోట వెంకటేశ్, డీఆర్డీవో శ్రీధర్, జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి, కో ఆపరేటీవ్ ఆధికారి మైఖేల్ బోస్ తదితరులు పాల్గొన్నారు.