పెద్దపల్లి, జనవరి 19(నమస్తే తెలంగాణ)/ ధర్మపురి : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని, అంధత్వ రహిత రాష్ట్రమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణసంఘ భవనంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల శిబిరానికి వచ్చిన వారితో కంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలను క్షుణ్ణంగా పరిశీలించి, మాట్లాడారు. ఒకేసారి రాష్ట్రంలోని ప్రజలందరికీ నేత్ర పరీక్షలు నిర్వహించడం వల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధిస్తుందన్నారు.
ఈ కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒకరికీ కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా అద్దాలు ఇస్తామని, శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామన్నారు. కంటి సమస్యలతో దాదాపు 50 శాతానికి పైగా ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని గుర్తించి సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే ఒక విడుత నిర్వహించడమే కాకుండా, మరో విడతను ప్రారంభించినట్లు చెప్పారు. మొదటి విడతలో కోటి 54లక్షల మందికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేయడంతోపాటు శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమష్టిగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రెండో విడుత కోసం ప్రభుత్వం 300కోట్లు కేటాయించదన్నారు. ఈ కార్యక్రమం ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులకు బాగా నచ్చిందనీ, వారి రాష్ర్టాల్లోనూ అమలు చేస్తామని ప్రకటించారని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో డీసీఎమ్మెఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్లు దాసరి మమతారెడ్డి, సంగి సత్తెమ్మ, అడిషనల్ కలెక్టర్ మకరంద్, డీఎంహెచ్వోలు శ్రీధర్, ప్రమోద్‌కుమార్, ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్, చైర్మన్ నజ్మీన్ సుల్తానా-మోబిన్, ఇందారపు రామన్న, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మారు లక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్‌కుమార్, ఆర్బీఎస్ కన్వినర్ సౌళ్ల భీమయ్య, పీడీ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్ రమేశ్, ఏఎంసీ వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్‌కుమార్, కౌన్సిలర్లు పస్తం హన్మంతు, లైసెట్టి భిక్షపతి, వార్త శ్రీధర్, పెద్ది వెంకటేశ్, పూదరి చంద్రశేఖర్, ఉప్పు రాజు, అమ్రేశ్, ఎరుకల రమేశ్, గాదె మాధవి, రేవెళ్లి స్వామి, అయ్యోరి వేణు, తిర్మందాసు అశోక్, యూనుస్, వొడ్నాల ఉమాలక్ష్మి, కోఆప్షన్ సభ్యులు అలీమ్, వసంత్, ఫహీం, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, నాయకులు శేఖర్, ఇనుగంటి వెంకటేశ్వరరావ్, చిలివేరి శ్యాంసుందర్ పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం
సర్వేద్రియాల్లో నయనం ప్రధానం అనే నానుడి వందకు వంద శాతం నిజం. ఇదే విషయాన్ని తన పాలనలో చూపించిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజల ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతీ పేద వాడికి ఖరీదైన వైద్యాన్ని చేరువ చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు పేద ప్రజలను శిబిరాలకు తరలించి ప్రతీ ఒక్కరికీ కంటి పరీక్షలు చేయించాలి.
– పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
వందరోజుల మహత్తర కార్యక్రమం
కంటి వెలుగు వంద రోజుల పాటు సామాజిక బాధ్యతతో నిర్వహించే మహత్తర కార్యక్రమం. చీకటి కమ్మిన జీవితాల్లో వెలుగులు నింపే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలి. జిల్లా వ్యాప్తంగా నిర్వహించే శిబిరాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయించాలి. పెద్దపల్లిని అంధత్వ రహిత జిల్లాగా రూపుదిద్దుకునేందుకు కృషి చేద్దాం.
– పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ