పెద్దపల్లి, జూన్1: గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లు, కలల స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సాకారమయ్యాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గత పాలకులు గిరిజనుల సమస్యలను గాలికొదిలేశారని, కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎవరూ ఆలోచన చేయని, సాధ్యంకాని గిరిజనం దశాబ్దాలుగా కోరుతూవస్తున్న పోడు పట్టాలను ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో జిల్లాలోని నలుగురు లబ్ధిదారులకు 1.39 ఎకరాలకు సంబంధించిన పోడు పట్టాలను జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, కలెక్టర్ సంగీత సత్యనారాయణతో కలిసి అందజేశారు.
ముత్తారం మండలం అడవీ శ్రీరాంపూర్ పరిధిలోని పోడు వ్యవసాయం చేసుకునే పోలం మధునమ్మకు 21 గుంటలు, పోలం లస్మయ్యకు 13 గుంటలు, పోలం నర్సయ్యకు 18 గుంటలు, పోలం రాజయ్యకు 27 గుంటల భూమికి సంబంధించిన పోడు పట్టాపాసు పుస్తకాలను అందజేశారు. ఇక్కడ అదనపు కలెక్టర్లు వీ లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, డీఎఫ్‌వో శివయ్య, పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు అనంతరెడ్డి, జడ్పీటీసీలు బండారి రామ్మూర్తి, తిరుపతి రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ కే ప్రమోద్ కుమార్, డీసీహెచ్ఎస్ కే శ్రీధర్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ మాట నిలుపుకున్నడు..
మా తాత ముత్తాతల నుంచి అడవిలో పోడు భూమి ని దున్నుకుంట పంటలు పండించుకుంటూ బతుకుతున్నం. ఎప్పుడు ఎవరు వస్తరో.. ఇది మీ భూమి కాదు పొమ్మంటారోనని దినదిన గండంగా బతికాం. పట్టాలు ఇవ్వాలని ఏండ్లుగా అడిగినా ఏ ప్రభుత్వం మమ్ముల పట్టించుకోలే. కానీ కేసీఆర్ సారూ మా బాధలను చూచి పోడు పట్టాలు ఇస్తామని చెప్పిండు. పట్టాలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నడు. ఆయనకు మా అడవి బిడ్డలందరూ జీవితాంతం రుణపడి ఉంటం.
– పోలం మధునమ్మ, పోడు పట్టా లబ్ధిదారు, అడవి శ్రీరాంపూర్( ముత్తారం )