పేదలకు వైద్యసేవలు అందించడంలో మన తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. గురువారం ఆయన జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి పట్టణాలతో పాటు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పర్యటించారు. ముందుగా కోరుట్లలోని హాజీపురాకాలనీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన, ప్రభుత్వ ఏరియా దవాఖానలో నెలకొల్పిన డయాలసిస్ సెంటర్ ప్రారంభించారు. 20 కోట్లతో నిర్మించ తలపెట్టిన 100 పడకల దవాఖాన భవన నిర్మాణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం మెట్పల్లి పట్టణంలోని సామాజిక వైద్యశాలలో 7.5 కోట్లతో నిర్మించనున్న 30 పడకల దవాఖాన భవనానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పూజలు చేసి, 6.29 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ, శంకుస్థాపనలు చేశారు. తర్వాత పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం చేరుకొని 7.32 కోట్లతో నిర్మించే సీహెచ్‌సీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వైద్య రంగానికి పెద్దపీట వేశారని చెప్పారు.
మెట్పల్లి: దవాఖాన భవన నిర్మాణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు హరీశ్‌రావు,
కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
మెట్పల్లి/ కోరుట్ల/ ధర్మపురి/ ధర్మారం, జనవరి 5 : వైద్య సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి పట్టణాలతో పాటు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో పర్యటించారు. ఆయాచోట్ల మాట్లాడారు. నాటి పాలనలో ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారని, ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్లో తప్పా ఎక్కడా సరైన సౌకర్యాలున్న దవాఖానలు లేవన్నారు. పేదవారికి ఆపదొస్తే దీనమైన పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. కానీ, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ, పేదల కోసం మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గం, కేంద్రంలో వంద పడకల దవాఖానతోపాటు డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రతి నియోజకవర్గ పట్టణాన్ని బట్టి వంద పడకల నుంచి 500 పడకల దవాఖానల వరకు నిర్మించుకున్నామన్నారు. త్వరలోనే మహిళలకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని, సొంత జాగలో ఇల్లు నిర్మించుకునే వారికి 3 లక్షల మంజూరు కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.
సుఖప్రసవాలతో తల్లీబిడ్డా ఆరోగ్యం
సహజ (సుఖ) ప్రసవాలతోనే తల్లీబిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ప్రసవాల సమయంలో ముహూర్తాలను నమ్మద్దు. దవాఖానలకు వెళ్లి వైద్యులపై ఒత్తిడి చేయవద్దు. సిజేరియన్లు తగ్గించడంపై వైద్యులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. తల్లి ప్రసవించిన తర్వాత మొదటి గంటలోపు బిడ్డకు ఇచ్చే ముర్రు పాలు అమృతంతో సమానం. అవి తాగిన పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సుఖ ప్రసవంలో పుట్టిన బిడ్డకు మాత్రమే ఈ మొదటి గంట ఇచ్చే పాలు తాగే అవకాశం కలుగుతుంది. 66 శాతం మొదటి గంటలోపు ఇచ్చే పాలకు పిల్లలు దూరమవుతున్నారు. జగిత్యాల జిల్లాలో వంద ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు జరిగేవి. ఇప్పుడు కొంత మార్పు వచ్చింది. అభివృద్ధి దేశాల్లోనూ 70 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా నార్మల్ డెలివరీలను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కిట్లను ఇవ్వడమే కాకుండా గర్భిణుల కోసం అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం ఇస్తున్నాం. తాజాగా, న్యూట్రిషన్ కిట్లను తొమ్మిది జిల్లాల్లో అందిస్తున్నాం. మెరుగైన వైద్యం కోసం దవాఖానలను మరింత బలోపేతం చేస్తున్నాం. ఇటీవల 950 మంది శాశ్వత వైద్యులను భర్తీ చేశాం. రాబోయే రోజుల్లో గాంధీ, మరో దవాఖానకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నియోజకవర్గంలో వంద పడకల దవాఖాన, జిల్లాలో మెడికల్ కాలేజీ, 750 పడకలతో సీటీ స్కాన్, ఇతర సకల వసతులతో దవాఖానలను తీర్చిదిద్దుతున్నాం.
కల్యాణలక్ష్మితో బాల్య వివాహాలకు అడ్డుకట్ట
కల్యాణలక్ష్మి పథకం వల్ల బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేశాం. యువతులు 18 ఏండ్లు దాటిన తర్వాతనే వివాహాలు చేసుకుంటున్నారు. రిజర్వాయర్‌కు గ్రామస్తులు భూమి ఇచ్చినందుకు మమకారంగా మంత్రి ఈశ్వర్‌పై ఉన్న ప్రేమతో నంది మేడారం గ్రామానికి 30 పడకల దవాఖాన మంజూరు చేశా. ఈశ్వర్ సహకారంతో ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశాం. అభివృద్ధి కోసం కొప్పుల ఏది అడిగినా ఇస్తాం. అది ఆయనతో ఉన్న అనుబంధం.
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అండగా ప్రభుత్వం
ఉమ్మడి రాష్ట్రంలో డయాలసిస్ సెంటర్లు మూడు మాత్రమే ఉండేవి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్కటీ అందుబాటులో లేదు. పేషెంట్లు హైదరాబాద్ వరకు వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ, స్వరాష్ట్రంలో నియోజక వర్గానికో డయాలిసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. రోగులకు ఇబ్బందులు కలుగకుండా ఉచితంగా సింగల్యూజ్ ఫిల్టర్‌లో డయాలసిస్ సేవలు అందిస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంక్షేమం కోసం ఏటా బడ్జెట్లో 100 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తున్నాం. పేషెంట్లకు ఆసరా పింఛన్లతోపాటు ఆర్టీసీ బస్‌పాస్ అందజేస్తున్నాం. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు సూచన మేరకు కోరుట్లలో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం.
ఉమ్మడి జిల్లాపై సీఎంకు ఎనలేని ప్రేమ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై సీఎం కేసీఆర్ ఎనలేని ప్రేమ ఉన్నది. అందుకే ఇటు జగిత్యాల, అటు రామగుండంలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసుకున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటవుతాయి. ఉమ్మడి జిల్లాలో నాలుగు మెడికల్ కాలేజీలు రావడం చారిత్రాత్మక నిర్ణయం. మెడికల్ కళాశాలల రాకతో వైద్య విద్యతో పాటు పేదలకు వైద్య సేవలు అందుతాయి. 600 పడకల దవాఖాన వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 200 ఐసీయూ బెడ్లు ఉండగా, ఇప్పుడు 6000 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ కోరుట్లకు వంద పడకల దవాఖాన, జగిత్యాలకు 600 పడకల దవాఖాన మంజూరు చేశారు. హుజూరాబాద్, హుస్నాబాద్, పెద్దపల్లిలో 100 పడకల చొప్పున, ధర్మపురిలో 50 పడకల దవాఖాన, నంది మేడారంలో ఆధునిక దవాఖాన నిర్మించనున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 90 మంది డాక్టర్లను కేటాయించాం.
మెడికల్ కాలేజీ సీట్లలో దేశంలోనే నంబర్‌వన్
తెలంగాణ ప్రాంత విద్యార్థులు గతంలో వైద్య విద్య కోసం వ్యయ ప్రయాసాలకు ఓర్చి కెనడా, చైనా, ఉక్రెయిన్, రష్యా వంటి దేశాలకు వెళ్లి నానా కష్టాలు పడేవారు. ఇప్పుడు జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. ప్రతీ లక్ష మందికి 19 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నది. పీజీ సీట్లలో లక్ష మందికి 7 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. పేదలకు వైద్య సేవలు అందించడంలో దేశంలో మూడో స్థానంలో ఉన్నది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మంత్రి మహేంద్రనాథ్ ఇటీవల మన రాష్ట్రంలోని దవాఖానల్లో వైద్య సేవలు సరిగా లేవని రాజకీయం చేశారు. కానీ, వైద్య సేవల్లో ఆ ఉత్తర ప్రదేశ్ చిట్టచివరి స్థానంలో ఉన్నది. కేంద్రంలోని నీతి ఆయోగ్ చెప్పిన లెక్కల ప్రకారం తెలంగాణ వన్ ఆఫ్‌ది బెస్ట్ పర్ఫార్మెనెన్స్ ఎట్ హెల్త్ సెక్టార్‌గా నిలిచింది. జగిత్యాల జిల్లాకు ఆరు బస్తీ దవాఖానలు మంజూరు చేశాం. ఇప్పటికే మూడు ప్రారంభించాం. యూనిసెఫ్ తెలంగాణలో మెటర్నరీ సేవలను ప్రశంసించింది. కోరుట్ల ప్రభుత్వ దవాఖానలో ఖాళీలను భర్తీ చేస్తాం. డెంటల్ చైర్, ఐసీయూ సెంటర్, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా.
కాళేశ్వరంతో నీటికి గోస లేకుండా చేశాం
కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ప్రభుత్వం సాగు, తాగునీటికి గోస లేకుండా చేసింది. గతంలో కేవలం 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండేది. ఇప్పుడు 2.48 లక్షల మెట్రిక్ టన్నులకు ధాన్యం దిగుబడి పెరిగింది. సాగునీరు, ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు ట్రాక్టర్లకు పన్ను రద్దు, పాత బకాయిలను రద్దు చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్సే. నీటి తీరువా లేకుండా సాగునీరు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. పైరవీ లేదు, లంచం లేదు, టింగు.. టింగున ఫోన్ మోగుతున్నది. రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు పడుతున్నయ్. ఇప్పటి వరకు 65 లక్షల మంది రైతులకు 65 వేల కోట్లు ఇచ్చాం. ఇంత మేలు చేస్తూ వ్యవసాయాన్ని పండుగగా మార్చాం. రైతుల గురించి మాట్లాడే హక్కు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్కు మాత్రమే ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో పనుల పరిశీలన కోసం నందిమేడారం గ్రామానికి 50 సార్లు, మండలానికి 10 సారు ్ల వచ్చా. ఒక్కోసారి మంత్రి ఈశ్వర్‌కు చెప్పకుండానే వచ్చా. మంత్రి ఈశ్వర్ సహకారంతో ఇక్కడ కాళేశ్వరం పనులు పూర్తి చేశాం.
ఇది ఉద్యోగనామ సంవత్సరం
తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటికే 1.48 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. తాజాగా 81 వేల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇస్తు న్నాం. రాష్ర్టాన్ని ఉద్యోగ తెలంగాణగా మార్చాం. 2023 ఉద్యోగ నామ సంవత్సరంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వైద్య ఆరోగ్య శాఖలో 6,431 మంది డాక్టర్లను భర్తీ చేశాం. 7,654 మంది స్టాఫ్ నర్సులకు ఉద్యోగాలు కల్పించాం. 5192 పారామెడికల్, ఇతర సిబ్బంది 1927 మందిని నియమించాం. రాబోయేరోజుల్లో తెలంగాణలో అత్యంత పారదర్శకంగా 81వేల ఉద్యోగాలను ఖాళీ లేకుండా భర్తీ చేస్తాం
నాటి ధర్మపురికి.. నేటి ధర్మపురికి జమీన్ ఆస్మాన్ ఫరక్
2003లో జరిగిన పుష్కరాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధర్మపురిలో యాగం చేశారు. వచ్చే పుష్కరాలు స్వరాష్ట్రంలో జరుపుకుందామని అప్పుడే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాం. అప్పటి నుంచి ధర్మపురి ఎంతో అభివృద్ధి సాధించింది. నాటి ధర్మపురికి నేటి ధర్మపురికి జమీన్ ఆస్మాన్ ఫరక్ కనబడుతున్నది. మంత్రి ఈశ్వర్ పట్టుబట్టి రూపురేఖలు మార్చారు. ఆయనను అభినందిస్తున్నా. గత ప్రభుత్వాల హయాంలో దేవాలయాల నిధులు ఇతర పనులకు ఉపయోగించేవారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ నిధులే దేవాలయాలకు కేటాయిస్తున్నాం. ధర్మపురి దేవాలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ 100 కోట్లు కేటాయించారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి 100కోట్లు ప్రకటించారు. వేములవాడ రాజన్న దేవస్థానానికి 100కోట్లు మంజూరు చేశారు. దేవాదాయ శాఖ ఉద్యోగులను కూడా ఆదుకున్నారు. దూపదీప నైవేద్యాలకు నిధులు పెంచారు. దేశం మొత్తంలో దేవుడిపై భక్తి ఉన్న ముఖ్యమంత్రి మన కేసీఆరే. తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులన్నీంటికీ దేవుడి పేర్లు పెట్టుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ధర్మపురి లక్ష్మీ నృంహ స్వామి వారి కృపతోనే పూర్తయింది.
వరాల జల్లు
మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరుట్ల నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు వినతి మేరకు హామీలు ఇచ్చారు. కోరుట్ల తరహాలోనే మెట్పల్లిలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలోని అన్ని ఏఎన్ఎం ఉప కేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణం కోసం ప్రతి కేంద్ర భవనానికి 20 లక్షలు మంజూరు చేస్తామని, అందుకు ప్రతిపాదనలు పంపించాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. మెట్పల్లి ప్రభుత్వ దవాఖానకు అల్ట్రాసౌండ్ మిషన్, డెంట్ చెయిర్‌ను, కోరుట్ల, మెట్పల్లి దవాఖానకు 125 కెపాసిట్తో కూడిన జనరేటర్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ధర్మపురిలో మంత్రి కొప్పుల విజ్ఞప్తి మేరకు ఎంసీహెచ్‌కు మరో 4.50కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రసవాల్లో భేష్
ప్రసవాల్లో రికార్డును సాధిస్తున్న మెట్పల్లి ప్రభుత్వ దవాఖానకు చెందిన వైద్యులను మంత్రి హరీశ్‌రావు ప్రశంసించారు. ఆసుపత్రి సామర్థ్యం 30 అయినా వంద పడకల దవాఖానకు మించి ఏటా 2వేల మేర ప్రసవాలు చేస్తున్నారని, రాష్ట్ర స్థాయిలో ఏటా అవార్డు తీసుకోవడంఅభినందనీయమన్నారు. సంస్థాగతంగా ఎక్కువ ప్రసవాలు జరిగిన కథలాపూర్ మండలం అంబారిపేట, మెట్పల్లి మండలం జగ్గాసాగర్, వెల్గటూర్ పీహెచ్సీ వైద్యాధికారులను అభినందించారు. పనితీరుపై బాగుందంటూ ఆయా కేంద్రాల వైద్యాధికారులను వేదికపైకి పిలిచి శాలువాలతో సత్కరించారు.
పేదలకు మెరుగైన వైద్యం
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నది. ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక్కో రంగం అభివృద్ధి చెందుతున్నది. పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు సర్కారు చొరవ తీసుకుంటున్నది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైద్యసేవలను మరింత అందుబాటులోకి తెస్తున్నది. గతంలో కిడ్నీవ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం హైదరాబాద్, వరంగల్ వంటి పట్టణాలకు పోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు దగ్గరలోని పట్టణాల్లోనే వాటిని ఏర్పాటు చేస్తున్నది. సీఎం కేసీఆర్ పాలన, మంత్రి హరీశ్‌రావు చొరవతో రాష్ట్ర వైద్య రంగం దేశానికే ఆదర్శంగా మారింది.
మంత్రి హరీశ్‌రావు వైద్యశాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల ముంగిటకే వైద్యం అందాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. పేదలకు మరింత చేరువగా బస్తీ దవాఖాలను ఏర్పాటు చేస్తున్నారు. కేసీఆర్ కిట్లతోపాటు తల్లీబిడ్డా ఆరోగ్యం బాగుండాలనే ఆలోచనతో న్యూట్రిషన్ కిట్లను గర్భిణులకు అందిస్తున్న ఘనత హరీశ్‌రావుదే. కోరుట్ల నియోజకవర్గంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతున్నది. అభివృద్ధి పనులకు నిధులు తేవడంలో మీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కంటే నేను జూనియర్‌నే. ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే చూపుతున్న చొరవ అభినందనీయం. నాడు ధర్మపురిలో సరైన వైద్య సేవలు అందుబాటులో లేక అత్యవసర చికిత్స కోసం దూర ప్రాంతాలకు తరలించేది. ఈ క్రమంలో మార్గమధ్యంలోనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అలాంటి దుస్థితి నుంచి విమోచనం కలిగింది. ధర్మపురిలో ఉన్న 30 పడకలను 50 పడకలుగా అప్‌గ్రేడ్ చేశాం. ఇందులోనే 10 పడకల ఐసీయూ సెంటర్‌ను ప్రారంభించుకున్నాం. అలాగే 21లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్‌ను నిర్మించుకున్నాం. సర్కారు దవాఖాన సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. నంది మేడారానికి 30 పడకల దవాఖాన మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు నా కృతజ్ఞతలు.
– మెట్పల్లి, కోరుట్ల, ధర్మపురి, ధర్మారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్
అడుగకుండానే వరాలిచ్చే దేవుడు కేసీఆర్
ప్రజలకు ఏం కావాలో తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్. మనం అడుగకపోయినా అనేక వరాలు ఇచ్చిన దేవుడు ఆయన. ప్రభుత్వ దవాఖానల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారు. సర్కారు హాస్పిటళ్లలో అమ్మాయి పుడితే 13 వేలు, అబ్బాయి పుడితే 12 వేలు అందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించడమే కాకుండా, స్వరాష్ట్రంలో ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖకు న్యాయం చేస్తున్న నాయకుడు హరీశ్‌రావు. ఆయన వైద్యారోగ్యశాఖ మంత్రిగా వైద్యాన్ని ప్రజలకు మరింతంగా అందుబాటులోకి తెస్తున్నారు. ఒకప్పుడు నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి ఉండేది. నేడు ఆ పరిస్థితి పోయింది. మహిళలు ప్రసవాల కోసం సర్కారు దవాఖానకే వెళ్తాం అనే పరిస్థితి వచ్చింది. కోరుట్ల పట్టణంలో వంద పడకల దవాఖానకు 20 కోట్లు, మెట్పల్లిలో దవాఖాన నూతన భవన నిర్మాణానికి 7.50 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు నియోజకవర్గ ప్రజల తరఫున నా ప్రత్యేక కృతజ్ఞతలు.
– మెట్పల్లి, కోరుట్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
అందుబాటులోకి విద్యా వైద్యం
ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో విద్యా వైద్యం ప్రజలకు అందనంత దూరంలో ఉండేవి. డబ్బులు పెడితే గానీ అందే పరిస్థితి లేకుండేది. కానీ, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం విద్యా వైద్య రంగాలను బలోపేతం చేస్తున్నది. పేదలకు అందుబాటులోకి తెస్తున్నది. రాష్ట్రం ఏర్పాటుకు ముందు, తర్వాత పరిస్థితులను ప్రజలు ఒకసారి బేరీజు వేసుకోవాలి. చావు నోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని తేవడంతోపాటు అన్ని రంగాలను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్‌ను మీ గుండెల్లో పెట్టుకోవాలి.
– మెట్పల్లిలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత
దేశానికే తెలంగాణ రోల్‌మోడల్
సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం. తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్‌గా నిలిచింది. ఇక్కడ అమలవుతున్న పథకాలు బీఆర్ఎస్ ద్వారా దేశవ్యాప్తంగా అమలు కావాలని, తమ బతుకులు మారుతాయని ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు.
–పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని