“రాష్ట్రంలో 50 శాతం మంది మహిళలు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, చెప్పుకోవడానికి ఇష్టం లేక, చికిత్స కోసం వెళ్లే తీరిక లేక వ్యాధుల గురించి వారు పట్టించుకోవడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని, ఆడబిడ్డల ఆరోగ్యమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళ పథకానికి శ్రీకారం చుట్టింది. మహిళ బాగుంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటుంది’ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్‌లోని బుట్టి రాజారాంకాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లో మరో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రాంనగర్ మార్క్‌ఫెడ్ గ్రౌండ్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడుతూ, ‘ఆరోగ్య మహిళ’ ద్వారా ఏర్పాటు చేసిన దవాఖానల్లో అటెండర్ నుంచి డాక్టర్ వరకు అందరూ మహిళలే ఉంటారని, నిర్భయంగా వెళ్లి తమ ఆరోగ్య సమస్యలు చెప్పుకోవచ్చని సూచించారు.
కరీంనగర్, మార్చి 8 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : తల్లి ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో మహిళలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకు సీఎం కేసీఆర్ ‘ఆరోగ్య మహిళ’ పథకాన్ని అమల్లోకి తెచ్చారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. బుధవారం కరీంనగర్లో పర్యటించిన ఆయన రాంనగర్‌లోని మార్క్‌ఫెడ్ గ్రౌండ్లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు.
‘ఆరోగ్య మహిళ’ పథకం ద్వారా రాష్ట్రంలోని వంద దవాఖానల్లో ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక సేవలు అందించే ఏర్పాటు చేశామని, రాబోయే రోజుల్లో మరిన్ని దవాఖానలు పెంచుతామని చెప్పారు. దవాఖానలో అటెండర్ నుంచి డాక్టర్ వరకు అందరూ మహిళలే ఉంటారని, నిర్భయంగా వెళ్లి తమ ఆరోగ్య సమస్యలు చెప్పుకోవచ్చన్నారు.
8 రకాల పరీక్షలు నిర్వహిస్తారని, 80 శాతం మహిళలకు ఇక్కడే ఉచిత పరీక్షలు, మందులు, సూచనలు, ఆరోగ్య సలహాలు లభిస్తాయని, ఇక్కడ పరిష్కారంకాని సమస్యలను జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలకు రెఫర్ చేస్తారని, అక్కడ మహిళల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్, ప్రత్యేక వార్డు ఉంటుందని వివరించారు. చికిత్స చేయించుకునే స్థోమత లేని మహిళలు తమ ఇబ్బందులు చెప్పుకోలేక వ్యాధులు ముదిరిపోయే పరిస్థితికి తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మహిళలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని, ఈ విషయాన్ని ప్రతి మహిళా సంఘం సమావేశాల్లో చర్చించుకోవాలని కోరారు.
మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మహిళల కోసం ఇచ్చిన మూడు కానుకల్లో ఒకటి ‘ఆరోగ్య మహిళ’ కాగా, మరొకటైన ‘న్యూట్రిషియన్ కిట్’ పథకాన్ని శ్రీరామనవమి తర్వాత అమలు చేస్తామన్నారు. తల్లీ బిడ్డకు బలవర్థకమైన ఆహారాన్ని అందించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. గర్భం దాల్చిన 3 నుంచి 4 నెలల్లో ఒకటి, 7 నెలల్లో మరో న్యూట్రిషియన్ కిట్ అందజేస్తామన్నారు. రాష్ట్రంలో ఏటా 6 లక్షల మంది గర్భం దాల్చుతున్నారని, బలవర్థక ఆహారం లేక చాలా మంది పిల్లలు బలహీనంగా జన్మిస్తున్నారని, రక్త హీనత కారణంగా తల్లులు మరణిస్తున్నారని, ఇలాంటి సమస్యలకు కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్స్‌తో చక్కటి పరిష్కారం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమ ల్ల విజయ, మేయర్ వై సునీల్‌రావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీసు కమిషనర్ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్‌లాల్, గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, అసిస్టెంట్ కలెక్టర్ తెనిన్ వాత్సవ్ టొప్పో, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, ఆర్ఎంవో డాక్టర్ జ్యోతి, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ప్రోగ్రాం ఆఫీసర్ వాసుదేవరెడ్డి, మెడికల్ కళాశాల లక్ష్మీనారాయణ, ఆర్ఎం జ్యోతి, వైద్యులు నవీన, సాయినరేందర్, మంజుల, అలీం, రవీందర్,పద్మ తదితరులు పాల్గొన్నారు.
కమలాకరన్న మస్తు డెవలప్ చేసిండు
“ఒకప్పటి కరీంనగర్ ఎట్లుండె.. ఇప్పుడు ఎట్లయ్యింది. నేను ఇక్కన్నే సైన్స్వింగ్లో చదువుకున్న. అప్పుడు కరీంనగర్లో ఏం లేకుండె.. కమలాకరన్న ఎమ్మెల్యే, మంత్రి అయినంక మస్తు డెవలప్ చేసిండు. సిటీ మొత్తం మారిపోయింది. ఎటు చూసినా బందవస్తు రోడ్లేసిండు.. మంచి లైట్లు పెట్టిండు. రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలున్నయ్.. మేం ఇంకోటి ఇవ్వమని కేంద్రంలోని బీజేపీని అడిగితే మొండి చేయి చూపెట్టింది. అయినా పట్టుబట్టి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి రూ.500 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీని సాధించిండు” అంటూ మంత్రి గంగుల కమలాకర్‌పై మంత్రి హరీశ్‌రావు ప్రశంసలు కురిపించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే మెడికల్ కాలేజీ ప్రారంభం కానున్నదని తెలిపారు.
మహిళా అధికారులకు ఘన సన్మానం
మహిళా దినోత్సవాల్లో భాగంగా జిల్లాలో సేవలు అందిస్తున్న మహిళా అధికారులను మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ ఘనంగా స న్మానించారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ కమిషనర్ శ్వేతా మహంతితోపాటు జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వా ల్, జడ్పీ సీఈవో ప్రియాంక, డీఎంహెచ్‌వో జువేరియా, జి ల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, డీఆర్డీవో ఎల్ శ్రీలతా రెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి, జిల్లా సంక్షేమ అధికారి సబిత, రిసోర్స్ పర్సన్లు సీతల రాధ, అలిసెరి చంద్రకళ, ఆరెపల్లి రజిత, లింగంపల్లి సుజాత, తదితరులను ఘనంగా సన్మానించారు. మంత్రి గంగుల కమలాకర్ వీరికి చీరెలు బహూకరించారు.
మహిళా సంఘాలకు నిధులు
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వడ్డీ లేని రుణాలతో పాటు బ్యాంక్ లింకేజీ రుణాలను ఈ సందర్భంగా మంత్రులు పంపిణీ చేశారు. సెర్ప్ ద్వారా 9,065 సంఘాలకు 17.45 కోట్ల వడ్డీ లేని రుణాలు, 8,649 సంఘాలకు 684 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు, 4,086 సంఘాలకు 62 కోట్ల స్త్రీ నిధి రుణాల చెక్కులను ఆయా మహిళా సమాఖ్యల ప్రతినిధులకు మంత్రులు అందించారు. అలాగే మెప్మా నుంచి 1,630 సంఘాలకు 9.49 కోట్ల వడ్డీ లేని రుణాలు, 55 సంఘాలకు 5 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు, మరో 2 కోట్ల స్త్రీ నిధి రుణాల చెక్కులను పంపిణీ చేశారు.
బీజేపీది పార్టిషియన్ పాలిటిక్స్
రాష్ట్రంలో మేం న్యూట్రిషియన్ పాలిటెక్స్ చేస్తుంటే దేశంలో బీజేపీ ప్రభుత్వం మాత్రం కులం, మతం పేరిట పార్టిషియన్ పాలిటెక్స్ చేస్తున్నది. ఇక మూడో కానుకగా రాష్ట్రంలోని మహిళా సంఘాలకు 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన రూ.750 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేశాం. ఇవి ఆయా సంఘాల ఖాతాల్లో జమవుతున్నయ్. కరోనా కారణంగా సకాలంలో విడుదల చేయలేక పోయాం. జూన్, జూలైలో మిగతా మొత్తాన్ని చెల్లిస్తం.
రాష్ట్రం పవర్ ఫుల్
తాగు నీటి సమస్యనే కాకుండా సాగు నీటి సమస్యనూ సీఎం కేసీఆర్ పరిష్కరించారు. రాష్ట్రంలో వ్యవసాయం పనులు పెరిగి మహిళా కూలీలు లేక మగవాళ్లు నాట్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇపుడు రాష్ట్రంలో నీళ్లు ఫుల్లు, కరెంట్ ఫుల్లు, చేపలు ఫుల్లు, మొత్తంగా రాష్ట్రమే పవర్ ఫుల్‌గా మారింది. పండిన ప్రతి గింజనూ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న మా అన్న గంగుల కమలాకర్ కొనుగోలు చేసి రైతులకు అండగా ఉంటున్నరు.
ముహూర్త ప్రసవాలు వద్దు
రాష్ట్రంలో సీ సెక్షన్ ఎక్కువగా నడుస్తున్నది. ప్రసవం అంటేనే ఆపరేషన్ అన్నట్లుగా వైద్యు లు వ్యవహరిస్తున్నరు. కరీంనగర్లో ఈ దందా మరీ ఎక్కువగా ఉన్నది. కేసీఆర్ కిట్స్ ప్రవేశ పెట్టిన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 30 నుంచి 62 శాతానికి పెరిగిన య్. అయితే, కొందరు ముహూర్తాలు చూసి ప్రసవాలు చేయాలని ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి పను లు చేయద్దు. నెలలు నిండకుండానే ఆపరేష న్ ద్వారా ప్రసవం చేస్తే ఆరోగ్య రీత్యా తల్లీ, బిడ్డలకు క్షేమం కాదు. ఆపరేషన్ల ద్వారా ప్రస వం జరిగితే ఆ మహిళలు 35 ఏండ్లు వచ్చే సరికి అనారోగ్యం బారిన పడుతున్నరు.
ఆరోగ్య కేంద్రాల్లో పరిష్కారం
అనారోగ్యంతో వచ్చే కొందరికి వైద్యులు గర్భ సంచులు తీసేసుకోవాలని చెబుతున్నరు. ఇప్పుడు ఇదొక పెద్ద దందాగా మారింది. అకారణంగా గర్భ సంచులు తొలగిస్తే ఇతర ఆరోగ్య సమస్యలు వస్తయ్. ఇలాంటి సమస్యలకు ఆరోగ్య మహిళ కేంద్రాల్లో చక్కటి పరిష్కారం ఉంటుంది.
సద్వినియోగం చేసుకోవాలి
ఉన్నత ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరోగ్య మహిళ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడయ్యింది. వీటిని పరిష్కరించి మహిళలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మనందరికీ ముఖ్యమంత్రి కానుకగా ఇచ్చారు. ఇంటిని చక్కదిద్దే తల్లుల ఆరోగ్యం బాగుండకుంటే ఇల్లు గడవదు. అందుకే మహిళలు ముందు తమ ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోవాలి.
-శ్వేతా మహంతి, హెల్త్ అండ్ ఫ్యామిలీ కమిషనర్