కమాన్‌చౌరస్తా, అక్టోబర్ 7 : కరీంనగర్ అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నదని, నగరం పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఇక్కడి ప్రజలకు వ్యాపార, ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతాయని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కేబుల్ వంతెనపై శనివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలను ఆయన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మేయర్ వై సునీల్ రావు, కలెక్టర్ డాక్టర్ గోపితో కలిసి ప్రారంభించారు. ఈ క్రమంలో నిర్వహించిన ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో తీగల వంతెనపై లేజర్‌షో, డ్రోన్ షో నిర్వహించిన జిల్లా వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి హాజరైన కళాకారుల పాటలు స్థానిక యువతను ఉర్రూతలూగించాయి. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, నగరం పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, డిప్యూటి మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. కాగా, సాంకేతిక కారణంతో డ్రోన్ షో వాయిదా పడగా, ఆదివారం సాయంత్రం 7 గంటలకు కార్యక్రమం తిరిగి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేయనున్నారు.
కరీంనగర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ ఎంతో కృషి చేస్తున్నారు. కరీంనగర్‌పై ప్రేమతో అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ వేల కోట్లు నిధులు మంజూరు చేస్తున్నారు. దీంతో కరీంనగర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. దీన్ని నగరవాసులు స్వాగతించాలి.
-బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు