ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకునే పాలకులు లేక కులవృత్తులు కనుమరుగయ్యాయని, కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వృత్తి పనుల వారికి అన్ని విధాలుగా చేయూతనందిస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కూలీలను ఓనర్లుగా మార్చేందుకే రూ.లక్ష ఆర్థిక సాయం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయిందని, ప్రతి నెలా నియోజకవర్గంలో 300 మందికి సాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమాన్ని కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా 30 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పారదర్శకంగా ప్రతి వెనుకబడిన కుటుంబానికి సాయం అందిస్తామని చెప్పారు. తీసుకున్న మొత్తాన్ని కులవృత్తులకు అవసరమైన ముడి సామగ్రి కొనుగోలు చేసేందుకు మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు.
– కలెక్టరేట్, జూలై 15
“ఇన్నేండ్ల జీవితంల ఇలాంటి సాయం మేమెన్నడూ చూడలే. ఇంత సాయం అందుకోలే. పుట్టినప్పటి నుంచి వాళ్ల దగ్గర వీళ్ల దగ్గర మా కులపు పని చేసుడే తప్ప.. సొంతంగా ఎన్నడూ చేయలే. కులవృత్తిలోనే కూలీ పనిగా చేస్తున్న మమ్ములను సీఎం కేసీఆర్ మాత్రం మాకు ఓ దుకాణం పెట్టించి ఓనర్లుగా చేస్తున్నరు. తెలంగాణ వస్తే ఏమైతదని మేం కూడా అనుకున్నం. కానీ, ఇట్ల సొంతంగా దుకాణం పెట్టుకునే స్థాయికి ఎదుగుతమని అనుకోలే. ఇంత సాయం చేసిన ముఖ్యమంత్రి మా ఇంటి దేవునిగ మారిండు. ఈ రుణం తీర్చుకునేందుకు ఎప్పటికీ ఆయన వెంటే ఉంటం.” అంటూ రూ.లక్ష ఆర్థిక సాయం అందుకున్న కులవృత్తిదారులు తమ అభిప్రాయాలను సంబురంగా పంచుకున్నారు. బీసీ కులవృత్తుల వారికి రూ.లక్ష సాయం పథకంలో భాగంగా శనివారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం పండుగలా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ 32 మందికి అందజేయగా, లబ్ధిదారులు చెక్కులు పట్టుకుని చూపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ‘నమస్తే’తో తమ అభిప్రాయాలను సంతోషంగా పంచుకున్నారు.
కలెక్టరేట్, జూలై 15 : ప్రభుత్వం ప్ర తినెలా 15న రూ. లక్ష సాయం పంపిణీ చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో వృత్తు లు చేసుకునే వారంతా కార్పొరేట్ కబంధ హస్తాల్లో బందీలుగా మారారని, స్వరాష్ట్రంలో ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుండడంతో తిరిగి వృత్తి పనులను సంతోషంగా చేసుకుంటున్నారని ప్రస్తు తం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి కాగా, ప్రతి నెలా 300 చొప్పున లబ్ధిదారులకు ఆర్థిక సాయం చెక్కులు అందిస్తామని, అంత్యంత పారదర్శకంగా పంపిణీ చేస్తామని చెప్పారు. తీసుకున్న మొత్తాన్ని కేవలం కులవృత్తులకు అవసరమై న ముడి సరుకు కొనుగోలు చేసేందుకు మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం పంపిణీ ప్రా రంభ కార్యక్రమంలో భాగంగా, శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో అనేక వృత్తు ల్లో కార్పొరేట్ సంస్థలు ప్రవేశించగా, తెలంగాణ లో కులవృత్తులు అంతరించే స్థితికి చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వాలు కూడా ఆదు కోకపోవడంతో వృత్తి పని సక్రమంగా నడవక, తెచ్చిన అప్పులు చెల్లించేందుకే వచ్చిన ఆదాయం సరిపోయేదని, దీంతో కుటుంబ పోషణ భారంగా మారడంతో అనేక మంది వృత్తులు వదులుకుని వలస వెళ్లారని గుర్తు చేశారు. దీనిని కళ్లారా గమనించిన సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో వృత్తులకు పునర్జీవం పోసేందుకు కంకణం కట్టుకున్నారని, కూలీలుగా జీవనం సాగిస్తున్న కులవృత్తిదారులను ఓనర్లుగా మార్చేందుకే రూ.లక్ష ఆర్థిక సాయం అందించే పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. గతంలో రజక, నాయీబ్రాహ్మణ కులవృత్తులను ప్రోత్సహించే క్రమంలో ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించి, నెలకు 250 యూనిట్లు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ మీటరుతోపాటు అవసరమైన సామగ్రి కూడా ఉచితంగా పంపిణీ చేసినట్లు స్పష్టం చేశారు. తద్వారా, నెలకు కనీసం రూ.2,500 వరకు ఆదా అవుతున్నట్లు ఆ యా వృత్తుల్లో కొనసాగుతున్న వారు చెబుతున్నారని తెలిపారు.
ఆ పథకం స్ఫూర్తితోనే బీసీ కులా ల్లో కులవృత్తులు చేసుకుంటున్న వారందరికీ సా యమందించాలనే బృహత్తర పథకం సీఎం కేసీఆ ర్ మదిలో నుంచి ఆవిష్కృతమైందన్నారు. మా నవ మనుగడ ఉన్నంత సేపు అన్ని వృత్తులు కూ డా అవసరమేనని, అందుకే కల్యాణలక్ష్మి తరహా లో ఈస్కీం కూడా నిరంతరాయంగా అమలు చే యనున్నట్లు ప్రకటించారు. అయితే, ముందుగా వచ్చిన దరఖాస్తులు పరిశీలించి, నిజమైన లబ్ధిదారులకు అందించేందుకే కటాఫ్ తేదీ నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పారదర్శకంగా ప్రతి వెనుకబడిన కుటుంబానికి రూ.లక్ష సాయం అందిస్తామని స్పష్టం చేశారు. అ నంతరం 32 మంది లబ్ధిదారులకు చెక్కులు పం పిణీ చేశారు. మిగతా 268 మందికి రెండు రోజు ల్లో అందజేస్తామని తెలిపారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ని ర్వహించిన కార్యక్రమంలో మేయర్ సునీల్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్, కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ రెడ్డవేని మ ధు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు హరిశంకర్ పాల్గొన్నారు.
నిన్న కూలీ.. నేడు యజమానినయ్యా
నిన్నటి దాకా మా కుల వృత్తిలోనే నేను కూలి పని చేశా. వచ్చే ఆదాయంతోనే నా కుటుంబాన్ని ఎల్లదీసిన. ముఖ్యమంత్రి కేసీఆర్ మాలాంటోళ్లను ఆదుకునేందుకే రూ.లక్ష సాయం చేస్తున్నడు. ఈ సాయంతో మా వాడలనే సొంతంగా సెలూన్ షాపు ఏర్పాటు చేసుకుంటున్న. దానికి అవసరమైన వస్తువులను కొనుక్కుని దుకాణం నడుపుకుంట. వచ్చే ఆదాయంతో నా కుటుంబాన్ని పోషించుకుంట. ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని గుర్తించిన కేసీఆర్ సారు మన రాష్ట్రం వచ్చినంక మాలాంటోళ్లను బతికించే ప్రయత్నం చేస్తున్నరు. పేదల అభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఎన్ని జన్మలెత్తినా ఆయన చేసిన సాయం మా కుటుంబం మరిచిపోదు. పూట గడవడమే కష్టంగా ఉన్న మాలాంటి అనేక మందిని సీఎం కేసీఆర్ సార్ ఆదుకుంటారన్న నమ్మకం ఉంది. అందుకే ఆయన వెన్నంటి ఉండి మరోసారి ముఖ్యమంత్రిని చేస్తం.
– జంపాల రాజయ్య, నాయీబ్రాహ్మణుడు, కరీంనగర్
ఓన్ వర్క్ చేసుకుంటం
ఇరవై మూడేండ్ల నుంచి టేలర్ షాపుల పనిచేస్తున్న. ఇన్నేండ్లుగా కేవలం పీస్ వర్క్ మాత్రమే చేస్తున్న. ఆర్థిక స్థోమత లేక దుకాణం పెట్టుకోలేకపోయిన. పీస్ వర్క్‌తో వచ్చే సొమ్ముతో పూట గడవడం కూడా కష్టమయ్యేది. పని లేని రోజు పస్తులున్నట్లుగా ఉండేది మా కుటుంబం. సీఎం కేసీఆర్ చేసిన లక్ష రూపాయల ఆర్థిక సాయంతో ఇప్పుడు సొంతంగా దుకాణం పెట్టుకుంట. నా భార్యకు కూడా టేలరింగ్ వస్తది. ఇద్దరం కలిసి సొంతంగా పని చేసుకుంటం. రెండు కొత్త కుట్టుమిషన్లు కొంటం. మిగతా సొమ్ముతో బట్టలు తెచ్చి అమ్ముతం. మాలాంటి పేద కుటుంబాలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు మేమెంతో రుణపడి ఉంటం. ఆయన మేలు జన్మలో మర్చిపోలేం. పది కాలాల పాటు తెలంగాణల కేసీఆర్ ప్రభుత్వమే ఉండాలని కోరుకుంటున్నం.
– రామగిరి మల్లేశ్, టేలర్, భాగ్యనగర్
సర్కారు మేలు మరువలేం
నేను రోజూ కూలీ పని చేస్త. అట్ల వచ్చిన పైసలతోటి బొంగులు కొని వాటిని తిరిగి అమ్ముతం. ఇట్ల వచ్చిన ఆదాయంతోనే ఇల్లు గడుస్తది. ఇన్ని రోజులు ప్రభుత్వ సాయమంటే మాకు తెల్వదు. తెలంగాణ సర్కారు వచ్చినంక మా బాధలు చూసిన సీఎం కేసీఆర్ సారు లక్ష రూపాయల సాయం చేసిండు. ఈ మొత్తం పైసలతోటి బొంగుల దుకాణం పెద్దగ చేస్తం. సారు చేసిన సాయం మరవకుండ వ్యాపారం చేస్తం.
– ఏకుల పద్మ, మేదరి, కరీంనగర్
కేసీఆర్ సార్ ఫొటో పెట్టుకుంట
రెక్కాడితేనే మా డొక్కాడేది. ఇలాంటి స్థితిల ఉన్న మా ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ సారు చేసిన ఆర్థిక సాయం మరువలేం. టేలర్ పని చేసే నేను కుట్టు మిషన్ కూడా కొనుక్కోలేని నిరుపేదను. రోజూ కరీంనగర్‌కు వచ్చి మార్కెట్ల టేలర్ షాపుల పీస్ వర్క్ చేస్త. ఆ ఆదాయంతోనే నా కుటుంబాన్ని పోషిస్తున్న. లక్ష రూపాయల సాయంతో ఇప్పుడు సొంతంగా కుట్టు మిషన్, పంపకాల మిషన్ కొనుక్కుంట. ఊళ్లెనే షాపు పెట్టుకుంట. నా పిల్లలను మంచిగ చదివిస్త. నాలాంటి పేదోళ్లను ఆదుకునేందుకే కేసీఆర్ సారు పుట్టిండని అనుకుంటన్న. నలభై ఏండ్ల సంది చూస్తున్న. అప్పటి ప్రభుత్వాల నుంచి ఏనాడూ చిల్లిగవ్వ సాయమందుకోలె. ఇప్పుడు సారు దయతో షాపు పెట్టుకోబోతున్న. ఆ దుకాణంల కేసీఆర్ ఫొటోనే దేవుని ఫొటోగా పెట్టుకుంట.
– రామగిరి లక్ష్మి, టైలరింగ్, బావుపేట
సారు సాయంతోనే షాపు పెడుతున్నం
మారుతున్న కాలంల పోటీ పెరగడంతో పెట్టుబడి పెట్టే స్థోమత లేక ఇన్ని రోజులు కులవృత్తిని వదులుకున్నం. సారు దయతో మాకు లక్ష రూపాయల సాయం అందింది. ఇంక మేమిద్దరం కూలీ పని బందువెట్టి, వచ్చిన ఈ మొత్తంతో బొంగులు, కడీలు హోల్‌సేల్‌గా తెచ్చి, ఇక్కడ అమ్ముతం. వ్యాపారం బాగు చేసుకుంటం.
– ఏకుల రమాదేవి, మేదరి, క్రిస్టియన్‌కాలనీ