కొత్తపల్లి, ఏప్రిల్ 12 : తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని, కాళేశ్వరం జలాలతో పంటలు బాగా పండి దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం ఆసీఫ్‌నగర్‌లో బుధవారం ఆయన పర్యటించారు. గ్రామంలో సుమారు రూ. 12 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. మీ అందరి అభిమానం సంపాదించుకున్న నేను అదృష్టవంతుడినని, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేందుకు బాధ్యతగా పనిచేస్తున్నట్లు చెప్పారు.
కరీంనగర్ ప్రజల అభిమానంతో కౌన్సిలర్ నుంచి మంత్రిగా ఎదిగానని, కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హ్యాట్రిక్ విజయాలను ఇచ్చిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇకడి ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు మళ్లీ ఎన్నికలు వచ్చేదాకా కనిపించకుండా పోయేవారని, గ్రామాలకు కనీసం రోడ్లు వేసిన పాపాన పోలేదన్నారు. నియోజకవర్గంలోని ఏ గ్రామాన చూసిన గుంతలు పడ్డ రోడ్లే దర్శనమిచ్చేవని, ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో మిషన్ భగీరథ పథకంతో తాగునీటి ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో సాగునీటి ఇబ్బందులకు చెక్ పెట్టి మండుటెండల్లో చెరువులు మత్తడి దుంకుతున్నాయన్నారు.
యూరియా కోసం క్యూలో చెప్పులు పెట్టి లాఠీ దెబ్బలు తిన్న రోజులు ఇంకా మరిచిపోలేదని, సీఎం కేసీఆర్ పాలనలో ఇప్పుడు కావల్సినంత యూరియాను అందుబాటులో ఉంచామన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలతో భూమికి బరువయ్యే పంటలు పండుతున్నాయన్నారు. దళితబంధు పథకం ద్వారా దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు. ఎలగందుల పాత రోడ్డు నిర్మాణం త్వరలో పూర్తయి అందుబాటులోకి వస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలుతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచామన్నారు. సిరిసిల్ల మీదుగా హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు కరీంనగర్‌కు రాకుండా ఆసీఫ్‌నగర్ నుంచి గన్నేరువరం మీదుగా నేరుగా హైదరాబాద్‌కు రోడ్డు వెయ్యాలన్నది తన కలని, ఆ కలను సాకారం చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. నేను మీ బిడ్డనేనని, మీరు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ పచ్చగా ఉండటాన్ని ఓర్వలేని ప్రతిపక్షాల నాయకులు ఇకడ చిచ్చుపెట్టేందుకు పాదయాత్రలు చేపడుతున్నారని విమర్శించారు.
ఇన్నాళ్లు దోచుకున్నది సరిపోలేదా అని ప్రశ్నించారు.? ఇకడి నీరు, నిధులు, బొగ్గు, కరెంట్‌ను దోచుకుని తెలంగాణను మళ్లీ గుడ్డిదీపం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. షర్మిల ఇకడ ఎందుకు పాదయాత్ర చేస్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు. అనంతరం ఎంపీటీసీ దావ మణి-కమలమనోహర్ పుట్టిన రోజు వేడుకలకు మంత్రి హాజరయ్యారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన మంత్రి గంగుల కమలాకర్‌కు గ్రామస్తులు, బీఆర్ఎస్ శ్రేణులు పూల వర్షం, భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, సర్పంచ్ కడారి శాంత-శ్రీనివాస్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు సాబీర్ పాషా, సర్పంచులు ఎల్దండి షర్మిల-ప్రకాశ్, రాచమల్ల మధు, నాయిని ప్రసాద్, ఎంపీటీసీ పట్టెం శారద-లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీ పెరుక లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ నాయకులు పిట్టల రవీందర్, ఒల్లాల నాగరాజు, దావ రాజు, దావ సుమన్, దావ సోమన్, నాగరాజు, సుభాష్, తిరుపతి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.