కార్పొరేషన్, అక్టోబర్ 2: ‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో పచ్చగా మారిన, అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్న తెలంగాణను చూసి కాంగ్రెస్, బీజేపీలు కండ్లు మండించుకుంటున్నయి. విషం చిమ్ముతున్నయి. దేవుడు ఉన్న చోట రాక్షసులు ఉన్నట్టు ఇక్కడ వీళ్లు మోపైనరు. మన సంపదను దోచుకునేందుకు కొత్త ఎత్తులతో వస్తున్నరు. వారు చెప్పేవన్నీ ఝూటా మాటలే. నమ్మితే మోసపోతరు. తెలంగాణ మళ్లీ అంధకారమే అయితది. జాగ్రత్తగా ఉండాలె’ అంటూ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
సోమవారం నగరంలో పలు డివిజన్లల్లో మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి ఉదయం నుంచీ రాత్రి దాకా సుడిగాలి పర్యటన చేశారు. 58వ డివిజన్ జ్యోతినగర్, 42వ డివిజన్ క్రిస్టియన్ కాలనీ, 40వ డివిజన్ బ్యాంకుకాలనీ ఒకటో నంబర్ రోడ్డులో, 17వ డివిజన్ హరిహరనగర్ రోడ్డు నంబర్ 8లో, 14వ డివిజన్ మంకమ్మతోట వెంకటేశ్వర టెంపుల్ సమీపంలో, 15వ డివిజన్ సాయిబాబా ఆలయం వద్ద సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తదితర అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడారు.
కరీంనగర్‌లోని అన్ని డివిజన్లల్లోనూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని, ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. కరీంనగర్ గడ్డపై ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎవరూ రెండోసారి గెలువలేదని, కానీ ప్రజల ఆశీర్వాదంతో తాను హ్యాట్రిక్ విజయం సాధించానని చెప్పారు. తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మారుమూల ప్రాంతాల్లో సైతం సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి పైపులైన్లు నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా జీవిస్తున్న సమయంలో మళ్లీ ఆంధ్ర పాలకులు కాంగ్రెస్, బీజేపీ ముసుగులో తెలంగాణలోకి వస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ నాయకత్వాన్ని కాదని కాంగ్రెస్, బీజేపిలకు అధికారం ఇస్తే మళ్లీ గుడ్డిదీపంగా మారుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకపోయి ఉంటే కరీంనగర్ నగరం అభివృద్ధి చెందేది కాదన్నారు. గతంలో గుంతల రోడ్లు, ఎటు చూసినా దుర్గందంతో కనిపించేదని, రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. మన రాష్ర్టాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. నగరంలో మట్టి రోడ్డు లేకుండా చేసే బాధ్యత నాదేనన్నారు. ప్రభుత్వం నుంచి రూ.133 కోట్లు తెచ్చానని, అవసరమైతే ఇంకా రూ.500 కోట్లు తీసుకువస్తానని తెలిపారు.
మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కేసీఆర్ ప్రభుత్వ పాలన కొనసాగలన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో నగరంలో రూ.1000 కోట్లతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మరోసారి తనను ఆశీర్వదిస్తే భావితరాలకు బంగారు బాటలు వేస్తానన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు అని, గెలిచిన తర్వాత అందరూ నా వాళ్లేనని, తనని నమ్మి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. నగరంలో 50 ఏళ్లలో జరగని అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. ఇక్కడ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు గందె మాధవి మహేశ్, మేచినేని వనజా అశోక్‌రావు, భూమాగౌడ్, కోల భాగ్యలక్ష్మి ప్రశాంత్, డిండిగాల మహేశ్, నాగసముద్రం జయలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు యాగండ్ల అనిల్, శ్రీధర్ పాల్గొన్నారు.
కనీవినీ ఎరుగని ప్రగతి
నగరం మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ సహకారంతో గతంలో ఎన్నడూలేనివిధంగా కనీవినీ ఎరుగని రీతిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. ఈ ప్రగతి ఇలాగే కొనసాగాలంటే మరోసారి మంత్రి గంగులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ప్రజా సమస్యలు తీర్చేందుకే ఉన్నాం. మీరు సంతోషంగా ఉంటేనే మాకు ఆనందం. ప్రజలకు చేతులెత్తి మొక్కుతున్న. మరోసారి మంత్రి గంగుల కమలాకర్‌కు ఆశీర్వాదాలు అందించి గెలిపించాలి.
– యాదగిరి సునీల్‌రావు, కరీంనగర్ మేయర్