కలెక్టరేట్, ఆగస్టు 18: ఉమ్మడి పాలనలో బతుకు భారమై వలసబాట పట్టిన చేనేత కార్మికులు.. స్వరాష్ట్రంలో సొంతూర్లకు వాపస్ వస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. నాడు వృత్తిని వదిలినవారే నేడు మగ్గాలవైపు మరలుతున్నారని చెప్పారు. స్వరాష్ట్రంలో నేతన్నల కండ్లల్లో వెలుగులు నిండుతున్నాయని, కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కుటుంబాల్లో సంతోషం కనిపిస్తున్నదన్నారు.
చేనేత వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కరీంనగర్‌లోని వీకన్వెన్షన్లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వలస పాలకుల నిరాదరణతో చితికిపోయిన చేనేత, నేడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తుందన్నారు. నాడు ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల నేడు సిరుల ఖిల్లాగా రూపుదిద్దుకున్నదని చెప్పారు. నేతన్నల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా అమలు చేస్తున్న త్రిప్టు పథకాన్ని నేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చేనేత మిత్ర ద్వారా వచ్చే సెప్టెంబర్ నుంచి ప్రతి కార్మికుడి ఖాతాలో 3 వేలు జమచేస్తామన్నారు. నేతన్న బీమా ద్వారా 5 లక్షల ఇన్సురెన్స్ సౌకర్యం వర్తించనున్నదని చెప్పారు. నాడు నేతన్న మరణిస్తే కేవలం 12 వేల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే వారని, కానీ ప్రభుత్వం 25వేలు వెంటనే అందిస్తున్నదని చెప్పారు.
నాడు కుల సంఘాల భవన నిర్మాణాలకు నిధులివ్వలేదన్నారు. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చుట్టూ తిరిగితే శ్మశానంలో స్థలం కేటాయించారని గుర్తుచేశారు. ఎకరానికి 100 కోట్లు పలుకుతున్న కోకాపేటలో ఆత్మగౌరవ భవనాలకు స్థలం కేటాయించిన ఘనత తెలంగాణ సర్కారుకే దక్కిందన్నారు. పద్మశాలీ భవన్‌కు కోకాపేటలో రెండెకరాల భూమి, భవన నిర్మాణానికి మరో రూ.రెండు కోట్లు విడుదల చేసిందన్నారు. ఇదేస్ఫూర్తితో మరిన్నీ పథకాలు అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. కానీ కేంద్రం అస్తవ్యస్త విధానాలతో నేత కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేసి కార్మికుల ఉసురుతీసిందని మండిపడ్డారు. బడుగుల నడ్డివిరుస్తూ ఆదానీ, అంబానీలకు ఉడిగం చేస్తున్నదని విరుచుకుపడ్డారు.
చేనేత ముడి సరుకుల ధరలను పెంచేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని వదిలి బడా వ్యాపారులను ప్రోత్సహిస్తున్నదని దుయ్యబట్టారు. ప్రజలు ఆలోచించి పనిచేసేవారిని ఆదరించాలని కోరారు. అంతకుముందు ‘చేనేత వస్ర్తాలు ధరిద్దాం, నేతన్నను ఆదరిద్దాం’ అంటూ సభకు హాజరైన వారితో మంత్రి గంగుల ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నేతన్నకు చేయూత కింద 6,82,58,952 చెక్కు, చేనేత మిత్ర కింద 5,30,19,650 చెక్కు, పావలా వడ్డీ ద్వారా 2,98,39,600, క్యాష్ క్రెడిట్ కింద 3.63 కోట్లు జిల్లాలోని పలు సహకార సంఘాలకు పంపిణీ చేశారు. అలాగే నలుగురు నేత కార్మికులకు జ్ఞాపికలు అందజేసి, శాలువాలు కప్పి సన్మానించారు. సంఘాల సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ బీ గోపి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్ ఉన్నారు.
కార్మికుల సంక్షేమమే లక్ష్యం
నేత కార్మికుల సంక్షేమమే సర్కారు లక్ష్యం. అందుకే నేతన్నల అభ్యున్నతికి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వారికి ఆర్థిక స్థిరత్వం చేకూర్చింది. నేతన్న బీమాతో మరణించిన నేతన్నల కుటుంబాలను ఆదుకుంటున్నది. కరోనా సమయంలో వారిని ఆర్థికంగా ఆదుకున్నది. భవిష్యత్‌లోనూ మరిన్నీ స్కీంలు తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
– యాదగిరి సునీల్‌రావు, కరీంనగర్ మేయర్
సర్కారుకు రుణపడి ఉంటాం
చేనేత వారోత్సవాల పేరిట నేత కార్మికులను గౌరవించడం సంతోషకరం. నాడు ఆప్కో ద్వారా జరిగిన నష్టాలతో అనేక మంది ఆకలిచావులకు గురయ్యారు. స్వరాష్ట్రంలో నేతన్నల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో పొట్టకూటి కోసం ముంబై, భీవండి, షోలాపూర్ లాంటి పట్టణాలకు వలసవెళ్లివారు తిరిగివస్తున్నారు. ఆదుకుంటున్న సర్కారుకు రుణపడి ఉంటాం.
– సత్యనారాయణ, చేనేత సహకార సంఘం కోరుట్ల శాఖ అధ్యక్షుడు
చేనేత పరిరక్షణ మనందరి బాధ్యత
మంత్రి కేటీఆర్ సూచన మేరకే చేనేత వారోత్సవాలు నిర్వహి స్తున్నాం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కార్మికులు తిరిగి వృత్తిని కొనసాగిస్తున్నారు. సొసైటీల ద్వారా విరివిగా రుణాలు ఇస్తున్నారు. నేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి. కొత్తగా వృత్తిలోకి వచ్చే కార్మికులకు, అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న వారికి కూడా మగ్గాల నిర్వహణలో శిక్షణ ఇస్తున్నాం. టెస్కో ద్వారా వస్ర్తాల కొనసుగోళ్లు చేపడుతున్నాం. వస్ర్తోత్పత్తిలో కరీంనగర్‌కు బ్రాండ్ ఇమేజ్ తేవాలి. చేనేత వృత్తిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందిరిపై ఉన్నది.
– అలుగు వర్షిణి, రాష్ట్ర హ్యాండ్లూం అండ్ టెక్స్టైల్ డైరెక్టర్
సంక్షేమ పథకాలు ఊపిరిపోశాయి
పదేండ్ల క్రితం చేనేత రంగం సంక్షోభంలో కూరుపోయింది. అప్పుడు ఉపాధిలేక అనేక మంది కార్మికులు ఉపిరితీసుకున్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వారి బతుకులకు ఊపిరిపోశాయి. నాడు పొద్దంతా కష్టపడితే నెలకు 2 వేలు కూడా రాకపోయేది. నేడు నెలకు 20 వేలు సులువుగా సంపాదిస్తున్నారు. త్రిప్ట్ పథకం అమలు, 40శాతం యార్న్ సబ్సిడీ ఇవ్వడం అభినందనీయం. అడగకుండానే అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుంది.
– రాంచంద్రం, కరీంనగర్ చేనేత సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు
చేనేతకు సర్కారు చేయూత
రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగాని కి చేయూతనందిస్తున్నది. స్పష్ట మైన ప్రణాళికలతో ముందుకె ళ్తున్నది. అందుకు విరివిగా నిధులు వెచ్చిస్తున్నది. చేనేత మగ్గం, చేనేతమిత్ర, నేతన్న బీమా, నేతన్న ఆరోగ్య కార్డు, పావలావడ్డీ లాంటి పథకాలను అమలు చేస్తున్నది. క్యాష్ క్రెడిట్ ద్వారా ఆర్థిక పరిపుష్టి కల్పిస్తున్నది. టెస్కో ద్వారా వీవర్ మెంబర్స్‌కు ఎక్స్‌గ్రే షియా పెంచింది. మూతపడ్డ పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును పునరుద్ధరించింది. కరోనా సమయంలో 100 కోట్ల సాయం అందించింది. తాజాగా 12వేల కుటుంబాలకు మరో 40కోట్లు అందించాలని నిర్ణయించింది. దేశంలోని తొలిసారిగా ఉమ్మడి జిల్లాలో నేతన్న బజార్‌ను ఏర్పాటు చేసింది. మంత్రి గంగుల పద్మశాలీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించడం అభినందనీయం.
– ఎల్ రమణ, ఎమ్మెల్సీ
నిశ్చింతగా బతుకుతున్నారు
ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధిలేక నేత కార్మికులు కాటికి వెళ్తే, స్వరాష్ట్రంలో కార్ఖానాలకు వెళ్తున్నారు. అప్పుడు పస్తులు న్నవారు ఇప్పుడు నిశ్చింతంగా బతుకున్నారు. సీఎం కేసీఆర్ నేతన్న బీమా ప్రవేశపెట్టి కార్మిక కుటుంబాలకు భరోసా ఇచ్చారు. జనాభాలో అధికశాతం ఉన్న పద్మశాలీయు లకు ఎమ్మెల్సీ, కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్ల పదవులు కట్టబెట్టి రాజకీయంగా ప్రాధాన్యమిచ్చారు. సీఎం సారుతోనే నేతన్నల బతుకుల్లో వెలుగులు నిండాయి.
– గూడూరి ప్రవీణ్, టీపీటీడీసీ చైర్మన్
త్రిఫ్ట్ను సద్వినియోగం చేసుకోవాలి
కార్మికుల అభ్యున్నతి కోసం తెచ్చిన త్రిఫ్ట్ పథకాన్ని చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ స్కీం ద్వారా 37 వేల మందిని ఆదుకున్నాం. కరోనా సమయంలో 112 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినం. వచ్చే నెల నుంచి చేనేతమిత్ర పథకం కూడా మరమగ్గాల కార్మికులకు వర్తింపజేస్తున్నం. ప్రస్తుతమున్న మగ్గాల స్థానంలో ఆధునిక మగ్గాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నం.
– వెంకటేశం, చేనేత జౌళిశాఖ అడిషనల్ డైరెక్టర్