ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి
క్షేత్రస్థాయికి వెళ్లి పర్యవేక్షించాలి
డ్రైనేజీల శుభ్రతపై దృష్టిపెట్టాలి
అధికారులకు మంత్రి గంగుల సూచన
కలెక్టర్ కర్ణన్‌తో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష
హాజరైన సీపీ సత్యనారాయణ, మేయర్ సునీల్‌రావు
కార్పొరేషన్, జూలై 11: ‘జిల్లావ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నందున అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి నిరంతరం పర్యవేక్షించాలి. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి’ అంటూ అధికారులకు రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ దిశానిర్దేశం చేశారు. ప్రజలు అత్యవసరమైతే త ప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని, అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ ఆర్వీకర్ణన్, సీపీ సత్యనారాయణ, మేయర్ వై సునీల్‌రావుతో కలిసి సోమవారం అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడురోజులుగా కురిసిన వానలతో చెరువులు, కుంటలు నిండుగా కనిపిస్తున్నాయని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరినా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదన్నారు. అధికారులు ముందుచూపుతో చేపట్టిన చర్యలే ఇందుకు కారణమన్నారు. మున్సిపల్ యంత్రాంగం డ్రైనేజీలను మెరుగుపరచడంతోనే రోడ్లపై వాననీరు నిల్వలేదన్నారు. వంగిపోయిన, తుప్పుపట్టిన స్తంభాలను తొలగించాలని, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆయాశాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. కలెక్టరేట్లో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో 2 గృహాలు పూర్తిగా, 34 పాక్షికంగా దెబ్బతిన్నాయని ఒక చెరువు తూము, ఒక రోడ్డు ధ్వంసమయ్యాయని తెలిపారు. లోతట్టు కాలనీవాసులను అప్రమత్తం చేశామని చెప్పారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణీ హరిశంకర్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ శివశంకర్ ఉన్నారు.