కార్పొరేషన్, మార్చి 26: ‘మీ దీవెనలే మాకు కొండంత బలం. ఎప్పటిలాగే ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచినప్పుడే భావితరాలు బాగుంటాయి.’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో బీఆర్టీయూ (భారత తెలంగాణ ట్రేడ్ యూనియన్) ఆధ్వర్యంలో కార్మికుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా, దీనికి మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాక ముందు ఈ ప్రాంతం ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో..? మీరే చూస్తున్నారని పేర్కొన్నారు. 75 ఏండ్ల దారిద్య్రాన్ని ఈ తొమ్మిదేండ్ల పాలనలోనే తొలగించామని, అన్నిరంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ప్రతి సంక్షేమ పథకం మహిళల పేరుతోనే అందిస్తున్నామని తెలిపారు. వచ్చే మేడే నాటికి అన్ని కార్మిక సంఘాలకు యూనియన్ భవన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేదల ఆకలి బాధలు తెలిసిన నాయకుడు కేసీఆర్ అని, ఆడబిడ్డల ముఖాల్లో వెలుగు, సంతోషం చూడాలన్న లక్ష్యంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. తాము మంత్రులుగా కార్మికుల వద్దకు రాలేదని, కేవలం మీ తోబుట్టువులుగానే వచ్చామని పేర్కొన్నారు. సమ్మేళనానికి కార్మిక సంఘాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కార్మికుల వ్యతిరేకి బీజేపీ: వినోద్‌కుమార్
కేందంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ తీరని అన్యాయం చేస్తూ వారికి వ్యతిరేకంగా మారిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల పక్షపాతిగా నిలుస్తోందన్నారు. కార్మికుల హక్కులకు రక్షణ కావాలంటే సంఘాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, కార్మికులు తమ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తేనే పరిష్కారమవుతాయని సూచించారు. తాము అధికారంలో ఉన్నా కూడా ఎప్పటికీ కార్మికుల పక్షపాతిగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేశామని, బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, విస్తృతంగా చర్చించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్టీయూ జిల్లా నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, నాయకుడు ఎడ్ల అశోక్, ఆటో యూనియన్, హమాలీ, మధ్యాహ్నభోజనం పథకం, భవన నిర్మాణ కార్మికులు, ఆటో ట్రాలీ మినీ గూడ్స్, మున్సిపల్ కార్మికులు, ఆర్పీలు, ఆశ కార్యకర్తలు, బీఎల్వో తదితర కార్మిక సంఘా ల నాయకులు రాఘవులు, శంకర్, కుమారస్వామి, రాధ, రాజేందర్, రాజమల్లయ్య. లింగయ్య, సంపత్, రమ్య, మం జుల, రాములు, శ్రీనివాస్, తిరుపతి, నరేందర్ ఉన్నారు.
కార్మికుల శ్రేయస్సే లక్ష్యం..
కార్మికుల శ్రేయస్సే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోంది. తెలంగాణ రాక ముందు ఉన్న సమస్యలన్నీ ఇప్పుడు సీఎం కేసీఆర్ దయతో పరిష్కారమైనట్లు కార్మికులు చెబుతుండడం సంతోషంగా ఉంది. ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతంలో వారి పాత్ర ఎనలేనిది. కార్మికుల సమస్యల పరిష్కారంలో మా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. అండగా నిలవాలి.
– యాదగిరి సునీల్‌రావు, మేయర్, కరీంనగర్.
కార్మికుల పక్షపాతి బీఆర్ఎస్
సీఎం కేసీఆర్ ఆది నుంచి కార్మికుల పక్షపాతిగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేక కార్మికులకు చెందిన వేతనాలు పెంచాం. గత ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను పట్టించుకోలేదు. పూర్తిగా విస్మరించాయి. హక్కులను కాలరాశాయి. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకొని దశల వారీగా పరిష్కరిస్తున్నరు. కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతున్నడు. కార్మికులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించండి. బీఆర్ఎస్కు అండగా నిలవండి.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
అన్ని జిల్లాల్లో సమ్మేళనాలు నిర్వహిస్తాం..
బీఆర్ఎస్ ఎలాగైతే జిల్లాల్లో నియోజకవర్గాలవారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుందో దానికి అనుబంధంగా ఉన్న కార్మిక విభాగం ఆధ్వర్యంలోనూ సమ్మేళనాలు నిర్వహిస్తాం. ఈ మేరకు కరీంనగర్ నుంచే శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వాలు కార్మికులను గుర్తించిన దాఖలాలు లేవు. కానీ స్వరాష్ట్రంలో దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా కార్మికులను అక్కున చేర్చుకున్నది బీఆర్ఎస్ సర్కారు ఒక్కటే. ఇప్పటికే పెద్ద సంఖ్యలో సమస్యలు పరిష్కారమయ్యాయి. మిగిలినవి త్వరలోనే నెరవేరుతాయి. పదికాలాల పాటు కేసీఆర్ సీఎంగా ఉంటేనే కార్మికులు, సబ్బండవర్గాలకు మేలు జరుగుతుంది.
– రూప్సింగ్, బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి