Peddapally | కాల్వశ్రీరాంపూర్ జూన్ 11 : ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించి, ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో 100 శాతం ఫలితాలు సాధించాలని ఎంపీడీవో పూర్ణచందర్రావు సూచించారు. గురువారం నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న దృష్ట్యా బుధవారం మండల కేంద్రంలోని హైస్కూల్ ఆవరణలో ఎంఈవో, ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆయా పాఠశాల హెచ్ఎం లకు దుస్తులు పంపిణీ చేశారు.
ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామని, పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల పిల్లలే మండలంలో టాపర్లుగా నిలిచారని ఆయన గుర్తు చేశారు. తల్లిదండ్రులు డబ్బులు వృథా చేసుకోకుండా తమ పిల్లల్ని సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదించాలని కోరారు. అనంతరం ఆయన మధ్యాహ్న భోజన కార్మికులు, స్కావెంజర్ పనివారిని ఉద్దేశించి మాట్లాడుతూ వంటగదిని, పాఠశాల పరిసరాలు, మరుగుదొడ్లు, మూత్రశాలను, పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ హైస్కూల్ శ్రీరాంపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు నరెడ్ల సునీత, పెగడపల్లి, మల్యాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు బండి ప్రభాకర్, డిఆర్పిలు, ఎమ్మార్పీలు, సిఆర్పిలు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన వర్కర్లు, స్కావెంజర్ తదితరులు పాల్గొన్నారు.