హుజురాబాద్ రూరల్, నవంబర్ 04 : రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి, ప్యాక్స్, డీసీఎంఎస్, హాకా సంస్థల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో హుజురాబాద్ మార్కెట్ యార్డులోని వడ్ల కొనుగోలు సెంటర్‌ను పరిశీలించారు.
ఒకవైపు మొంథా తుఫాన్ రైతులను తీవ్ర నష్టాలపాలు చేస్తే.. కొద్దో గొప్పో చేతికి వచ్చిన పంట అమ్ముకుందామని వస్తే సెంటర్ నిర్వాహకులు అనేక కొర్రీలు పెడుతూ కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. పక్షం రోజులుగా మార్కెట్ లోనే ధాన్యం కాపలా ఉంటున్నారు. తేమ పేరుతో కాంటాలు వేయకపోవడం మూలంగా అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని లేదంటే జిల్లా కలెక్టరేట్‌ను, మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.