Sunke Ravishankar | బోయినపల్లి రూరల్, జూన్ 21 : బోయినిపల్లి మండలం కొదురుపాక లోని ఎడారిలా తలపిస్తున్న రాజరాజేశ్వర జలాశయంను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలసి ఆదివారం రోజున సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ నుంచి అనేక లిఫ్ట్‌లు, కాలువలు, పంప్ హౌజ్‌ల ద్వారా మిడ్ మానేరుకు గోదావరి నీరు చేరేదని, అక్కడి నుంచి ప్రధాన ప్రాజెక్టులైన లోయర్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లేవన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన మిడ్‌మానేరు ప్రాజెక్టు నీళ్లు లేక వెలవెలబోతుందని, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద మానేరువాగుపై నిర్మించిన రాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్ట్ సామర్థ్యం 27.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం అతి తక్కువ గా నీళ్లు మాత్రమే ఉన్నాయన్నారు.
మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసిన నీళ్లతో గతంలో మిడ్ మానేరు నిత్యం జలకళతో ఉండేదని, కానీ, మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కుంగిపోయింది అనే సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు విడుదల చేయక పోవడం తో ఆ ప్రభావం మిడ్‌మానేరుపై పడిందని అన్నారు. నీటి నిల్వలు లేక మిడ్‌మానేరు వద్ద ఎత్తిపోతలు ఆపేయడంతో సమీపంలో చెరువులు, కుంటలు కూడా ఎండిపోయాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను గుర్తుచేసుకుంటూ, ‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎగువ మానేర్ మరియు మిడ్ మానేర్ జలాశయాల ద్వారా వాగులు, చెరువులను నింపడం ద్వారా మండే వేసవిలో కూడా రైతులను రక్షించాము. ఇప్పుడు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతన్నలు ఎంతో నష్టపడిపోయారు’ అని అన్నారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎడారి లా కల్పించే మైదానంలో కబడ్డీ, క్రికెట్ ఆడారు. ఆయన వెంట మండల నాయకులు ఉన్నారు.