Merit Awards | కమాన్ చౌరస్తా, జూన్ 25 : హుజరాబాద్‌కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో కరీంనగర్ అర్బన్‌లోని 25 ప్రభుత్వ సెక్టార్ పాఠశాలలో గత సంవత్సరం పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన 42 మంది విద్యార్థులకు గురువారం ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి ఎన్ ప్రశాంత్ రెడ్డి, ట్రస్టు నిర్వాహకులు డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్ హాజరై విద్యార్థులకు పురస్కారాలు అందించారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులు భవిష్యత్‌లో కూడా ఇలాంటి ప్రతిభను కొనసాగించాలని, మీరందరూ కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో జాయిన్ కావాలని, ఇప్పుడు అన్ని జూనియర్ కాలేజీలో అనుభవం ఉన్న అధ్యాపకులు, వసతులు ఉన్నాయని, ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం కూడా ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. మధురమ్మ మెమోరియల్ ట్రస్టు ప్రతీ సంవత్సరం ప్రభుత్వ సెక్టార్లలో చదివి విద్యార్థులకు టాలెంట్ టెస్టులు నిర్వహించి బహుమతులు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం వసుంధర, జిల్లా సైన్స్ ఆఫీసర్ సీహెచ్ జైపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు టీ లింగారెడ్డి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.