రాంనగర్/ కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 11 : జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయింది. జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ మేళాలో ట్రాన్స్జెండర్లు కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఉద్యోగాలు పొందారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై యువతనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగ యువత వారధి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.
అనంతరం సీపీ సుబ్బారాయుడు మాట్లాడుతూ యువతను సన్మార్గంలో పయనింపజేసేందుకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మున్ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. అనంతరం 120 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీటికి సుమారు 4 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రముఖ కంపెనీలైన బైజూస్, విప్రో, జెన్‌ప్యాక్, హెచ్‌సీఎల్, క్లస్టర్, ఐటీ, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఇండిగో, హెటిరో, అరబిందో లాంటి ఐటీ ఫార్మా కంపెనీలతో పాటు బ్యాంకింగ్ సంస్థలు కూడా ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నాయి. నెలకు కనీసం రూ.20 వేలు మొదలుకుని రూ.50వేల జీతంతో సుమారు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి నియామక పత్రాలు అందజేశారు.
పది మంది ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు
ఈ జాబ్ మేళాలో పది మంది ట్రాన్స్ జెండర్లకు నెలకు రూ.30 వేల వేతనంతో అమెజాన్ కంపెనీలో అవకాశం పొందారు. ఎక్కడా లేని విధంగా ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు వారందరూ సభా వేదికపై మాట్లాడుతూ సంతోషంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఇటీవల జరిగిన పలు పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తమపై కఠినంగా వ్యవహరించకుండా సమాజంలో గుర్తింపు పొందే విధంగా అవకాశం ఇచ్చిన పోలీసుల సేవా గుణాన్ని కొనియాడారు.
సద్వినియోగం చేసుకోవాలి
యువత అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. శ్రద్ధాసక్తులతో విద్యాభ్యాసం పూర్తి చేసి భవిష్యత్‌పై ఆలోచనతో ముందుకు సాగాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ పడాలి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పోలీస్‌శాఖ జాబ్ మేళా నిర్వహించడం శుభ పరిణామం. ఈ మేళాలో ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయం. సమాజంలో చిన్న చూపు చూడబడుతున్న ట్రాన్స్ జెండర్లకు ఇలాంటి అవకాశాలు కల్పించడం వల్ల మున్ముందు సత్ఫలితాలు వస్తాయి.
– రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుబోయినపల్లి వినోద్‌కుమార్
సంతోషంగా ఉన్నది
డిగ్రీ అయిపోయిన వెంటనే ఉద్యోగ ప్రయత్నం చేయాలని ఉండేది. కానీ, అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినట్లు కరీంనగర్లో నిర్వహించిన ఉద్యోగ మేళాకు వచ్చాను. ఈ క్రమంలో బీజడ్ సంస్థలో మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మొదట చిన్న ఉద్యోగంతో ప్రారంభించి మున్ముందు మంచి స్థాయిలో నిలవాలన్నదే నా కోరిక.
– లిల్లి, కరీంనగర్
స్కిల్స్ చూసి జాబ్ ఇచ్చారు
ట్రాన్స్‌జెండర్ అని చూడకుండా నాకున్న స్కిల్స్‌ను చూసి జాబ్‌కు ఎంపిక చేశారు. అమెజాన్ లాంటి సంస్థలో నాకు ఉద్యోగం లభించడం ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు సీపీ సుబ్బారాయుడు సార్ చాలా ప్రోత్సహించారు. చాలా సార్లు మాతో సమావేశం పెట్టి, మీరు సమాజంలో అందరిలా ఉండాలి, హుందాగా వ్యవహరించాలని చెప్పారు. ఆయన సహకారంతో ఉద్యోగాన్ని సాధించిన. జాబ్ చేసుకుంటూ గౌరవంగా బతుకుత.
– గోల్డీ, ట్రాన్స్‌జెండర్, కరీంనగర్
రెట్టింపు వేతనంతో జాబ్
నేను ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రూ. 15వేల జీతంతో పని చేస్తున్నా. కరీంనగర్ పోలీస్ ఆధ్వర్యంలో ఉద్యోగమేళాలో ఉద్యోగానికి ఎంపికవుతాననే నమ్మకంతో ఇక్కడికి వచ్చిన. నేను ఉహించిన దాని కంటే మంచి అవకాశం వచ్చింది. హోంకేర్ నర్సింగ్‌లో ప్రీమియర్ హెల్త్ కేర్ సంస్థలో ఉద్యోగానికి రూ.30 వేల వేతనంతో ఎంపిక కావడం సంతోషంగా ఉన్నది.
– ఎస్ మాలశ్రీ, గోదావరిఖని
తొలి ప్రయత్నంలోనే ..
తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీజీ పూర్తిచేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఈ తరుణంలో కరీంనగర్ పోలీసుల ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారని తెలుసుకుని ఇక్కడికి వచ్చిన. ఈ క్రమంలో మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే అనుకున్నది సాధించిన.
– బానోత్ సుప్రియ, కరీంనగర్
కరీంనగర్‌లోనే ఉద్యోగం
బీజడ్ సంస్థ హైదరాబాద్‌లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. హాజరైన నాకు, రూ.12 వేల వేతనంతో జాబ్ వచ్చింది. అయితే సంస్థ హైదరాబాద్‌లో ఉండడంతో చేరాలా? వద్దా? అని ఆలోచించిన. కానీ, అదే సంస్థ నిర్వాహకులు కరీంనగర్లో ఉద్యోగం చేయాలని చెప్పారు. ఎంతో సంతోషం అనిపించింది. ఉద్యోగ రీత్యా నా భర్త కరీంనగర్లో ఉంటారు. నేనుకూడా ఇక్కడే ఉంటూ ఉద్యోగం చేసుకోవచ్చు.
– లావణ్య, కరీంనగర్