రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్, సింగరేణి చైర్మన్ బలరాం,
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ హాజరు
Singareni | గోదావరిఖని : రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణంలో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఆధ్వర్యంలో గోదావరిఖని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్, అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ప్రోటోకాల్ పబ్లిక్ లిమిటేషన్స్ హర్కర వేణుగోపాల్ సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ పాల్గొన్నారు.
రాష్ట్రంలోని దాదాపు 100 కంపెనీలలో 3000 ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన జాబ్ మేళాలో 7000 మంది ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలు పూర్తయిన అభ్యర్థులకు అప్పటికప్పుడే ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన నియామక పత్రాలను అందజేశారు. వివిధ రంగాలకు చెందిన ఆయా కంపెనీలలో పని చేసేందుకు ఇంటర్వ్యూలకు వచ్చిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికైన వారికి వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నియామక పత్రాలు ఇవ్వడం విశేషం.
ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి బట్టీ విక్రమార్కను పలుసార్లు జాబ్ మేళా నిర్వహించాలని కోరిన మేరకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించి పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేశారని ఆయన కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. సింగరేణి చైర్మన్ బలరాం మాట్లాడుతూ సింగరేణి సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తికి పరిమితం కాకుండా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ డైరెక్టర్లు రామగుండం డివిజన్ 1 2 3 జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.