తిమ్మాపూర్ రూరల్, అక్టోబర్ 17: బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బూత్ స్థాయి కమిటీ మెంబర్లు నియోజకవర్గంలోని ప్రతి ఓటరును కలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించాలని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. మండలంలోని కొత్తపల్లిలో మంగళవారం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బూత్ స్థాయి కమిటీ బాధ్యుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ, 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు, ప్రజల బాధలు ఎలా ఉండేవో నేటి యువతరానికి వివరించాలన్నారు. తెలంగాణ రాకముందు పరిస్థితులు.. వచ్చిన తర్వాత స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించాలని సూచించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిత్యం నియోజకవర్గంలో తిరుగుతూ, లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కారు గుర్తుకే మరోసారి ఓటు వేసి రసమయిని భారీ మెజార్టీతో గెలిపించుకొని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు.
అనంతరం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలే తన బలం బలగమన్నారు. పచ్చని తెలంగాణలో చిచ్చుపెట్టి మన సంపద దోచుకెళ్లాలని కాంగ్రెస్, బీజేపీ చూస్తున్నాయని, ఆ పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. పదేళ్ల కేసీఆర్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఈనుకొండ జితేందర్ రెడ్డి, ల్యాగల వీరారెడ్డి, స్వామిరెడ్డి, తెల్ల రవీందర్, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.