 
                                                            Medipalli farmers | రామగిరి, అక్టోబర్ 31 : రామగిరి మండలంలోని రత్నాపూర్ గ్రామ మేడిపల్లి శివారులో సుమారు 210 ఎకరాల భూములను ఇండస్ట్రియల్ పార్క్ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం సేకరించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దపెల్లి కలెక్టర్, మంథని ఆర్డీవో విడుదల చేసిన ప్రకటనలో భూసేకరణకు ఎకరానికి రూ.25 లక్షల పరిహారం చెల్లిస్తామని తెలిపారు. రైతులు సంతకాలు చేసి చెక్కులు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రకటనపై మేడిపల్లి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని సంప్రదించకుండా అభిప్రాయం తెలుసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా రేటు నిర్ణయించడం అన్యాయమని మండిపడుతున్నారు.
భూసేకరణకు ముందు రైతులతో సమావేశమై, వారి డిమాండ్లు పరిగణనలోకి తీసుకోవాలని, వారిని మెప్పించి ఒప్పించే ప్రయత్నం చేయాలని కోరారు. ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే మేము మౌనం వహించబోమని, తమ భూములు వంశపారంపర్యమైనవని, తమ జీవితాధారమైన ఈ భూములు కోల్పోతే తమ భవిష్యత్ అంధకారమేనని వాపోయారు. రైతులు ప్రభుత్వం ఎకరానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని, తమ కొన్ని ముఖ్య డిమాండ్లను అంగీకరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు. ఈ సమావేశంలో మేడిపల్లి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 
                            