పెద్దపల్లి, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ)/ఫర్టిలైజర్ సిటీ: పెద్దపల్లి జిల్లా ప్రధాన దవాఖానతోపాటు గోదావరిఖని, మంథని దవాఖానల్లో మందుల కొరత ఎక్కువైంది. వైద్యులు కొరత లేదని చెబుతున్నా.. ప్రిస్కిప్షన్లలో సగం గోలీలు బయట మెడికల్ స్టోర్లలో కొనాల్సిన పరిస్థితి ఉన్నది. నెల రోజులుగా ఓపీకి సరిపడా మందుల సరఫరా లేక రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ప్రధానంగా గోదావరిఖని దవాఖానకు రోజు 1500లకు పైగా రోగులు వస్తుండగా, షుగర్, కడుపు నొప్పి, మూత్ర ఇన్ఫెక్షన్లకు సంబంధించిన మందులు విడగిప్టిన్, మెట్ ఫార్మిన్, బిసాడల్, జోఫ, అమోక్సిలిన్ సిరప్లు అందుబాటులో లేవని తెలుస్తున్నది.
వైద్యులు వాటికి ప్రత్యామ్నాయంగా వేరే మందులు రాస్తున్నా, అవి కూడా దొరకడం లేదు. అలాగే సర్జరీకి సంబంధించిన గ్లౌస్, సర్జరీ బ్లేడ్లు, మాసులు సైతం అందుబాటులో లేనట్టు తెలిసింది. ఇక జిల్లాలోని ఎంసీహెచ్లలో చిన్న పిల్లలకు సంబంధించిన అమోక్సిలిన్ యాంటిబయోటిక్ సిరప్లు, బాసిల్లస్, నాజిల్ డ్రాప్స్ అందుబాటులో లేవు. మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ సొప్రమైసిన్ ఆయింట్మెంట్, వివిధ రకాల ఐ డ్రాప్స్ సైతం దొరకడం లేదు.
నాకు నడుం నొప్పి ఉండడంతో దవఖానకు వచ్చిన. ఇక్కడ డాక్టర్ ఆరు రకాల మందులు రాసిండు. అందులో రెండు రకాల మందులు దవఖాన్ల లెవ్వు. జోఫా-4, సిట్రల్ టానిక్ దొరకలే. రెండు బయట కొనుక్కున్న. అన్ని మందులు దవాఖాన్ల ఉండాలే.
– సుజాత, ఎంచపల్లి (రామగుండం మండలం)