ఏడాదిలోనే అంతా మారిపోయింది. నాడు కార్పొరేట్‌కు దీటుగా సేవలందించిన సర్కారు దవాఖానల్లో నేడు మందుల కొరత వేధిస్తున్నది. దాదాపు 90 రకాల మెడిసిన్ అందుబాటులో ఉందని చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. కొన్ని జిల్లా వైద్యశాలల్లో కీళ్లవాతం, గుండె సంబంధిత సమస్యలతోపాటు బీపీకి, కొలెస్ట్రాల్, జ్వరం, వాంతులు, సర్జరీల సమయంలో ఇచ్చే మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో లేవని తెలుస్తున్నది.
కరీంనగర్ జీజీహెచ్‌లో అయితే కనీసం నొప్పి ఆయింట్మెంట్, గాయాలను క్లీన్ చేసే ఆయిల్.. ఇలా చిన్న చిన్న మందులు లేకపోవడంతో బయటి నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉన్నది. ఇక కొన్ని టెస్ట్‌లు సైతం ప్రైవేట్‌లో చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దీంతో నిరుపేదలపై భారం పడుతుండగా, సర్కారు తీరు విమర్శలకు తావిస్తున్నది.
కరీంనగర్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ)/ విద్యానగర్ : ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరత కనిపిస్తున్నది. అన్ని రకాల మెడిసిన్ అందుబాటులో ఉందని వైద్య, ఆరోగ్య శాఖ చెబుతున్నా.. ప్రత్యక్షంగా పరిశీలిస్తే మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని దవాఖానలకు వస్తున్న రోగులే స్పష్టం చేస్తున్నారు. సర్కారు వైద్యశాలల పనితీరు గతానికి ఇప్పటికి చాలా మారిపోయిందని చెబుతున్నారు. అనారోగ్యంతో వస్తే పట్టించుకునే సిబ్బంది లేరని, కనీసం వీల్ చైర్స్, స్ట్రక్చర్స్ అందుబాటులో లేవని ఆరోపిస్తున్నారు. అరగంట, గంట నిలబడితేగాని వీల్‌చైర్ దొరకడం లేదని, చైర్ దొరికితే వైద్యుల వద్దకు, టెస్టుల కోసం తామే తీసుకెళ్లాల్సి వస్తున్నదని రోగుల బంధువులు వాపోతున్నారు.
టెస్టులు నిర్వహించే ల్యాబ్‌లు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకే అందుబాటులో ఉంటున్నాయని, ఆ తర్వాత వచ్చిన వారిని పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఒక్కో టెస్టును రెండు మూడు సార్లు చేస్తున్నారని, ల్యాబ్ టెక్నీషియన్లు ఇచ్చే రిపోర్టులు అర్థం కాక వైద్యులు మళ్లీ మళ్లీ టెస్టులు చేయిస్తున్నారని వాపోతున్నారు. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్‌కు చెందిన నేరెళ్ల నాగరాజు ఛాతిలో నొప్పితో దవాఖానకు రాగా, చెస్ట్ స్కానింగ్ చేసిన సిబ్బంది సరైన రిపోర్ట్ ఇవ్వకపోడంతో వైద్యులు మరోసారి తీసుకుని రావాలని కోరారు. ఆయనకు 2డీ ఎకో టెస్ట్ కూడా అవసరం ఉండగా ప్రభుత్వ దవాఖానలో అందుబాటులో లేదని, బయటికి వెళ్లి తీసుకోవాలని వైద్యులు సూచించారని నాగరాజు చెప్పారు.
కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన ఫార్మసీలో రోగులకు అవసరమైన 88 నుంచి 90 రకాల మందులు అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. కానీ, కొన్ని మందులు అందుబాటులో లేనట్టు స్పష్టమైంది. శనివారం దవాఖానకు వచ్చిన రోగుల్లో కొందరిని కదిలించగా, ఈ విషయం తెలిసింది. రేకుర్తికి చెందిన దుర్గం నర్సయ్య అనే వృద్ధుడిని అతని భార్య ఎల్లవ్వ, కొడుకు ఆంజనేయులు దవాఖానకు తీసుకొచ్చారు. ఆయనకు కాలు ఇన్ఫెక్షన్ కావడంతో క్లీన్ చేసేందుకు అవసరమైన మందులు లేవని చెప్పడంతో అతని కొడుకు బయటికి వెళ్లి తెచ్చుకున్నాడు.
కనీసం టర్పెంటైన్ ఆయిల్ కూడా దవాఖానలో లేదు. ఓదెల మండలం నాంసానిపల్లికి చెందిన ఇస్లావత్ లింగులు అనే వ్యక్తి అడ్డం పడగా నొప్పులతో బాధపడుతూ వచ్చాడు. ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో, వాటికి అవసరమైన పరీక్షలు నిర్వహించకుండానే నాలుగైదు మందు గోలీలు రాశారు. ఇవి ఎంత వరకు పనిచేస్తాయో తెలియదుగాని, నొప్పులు వెంటనే తగ్గేలా ఆయింట్మెంట్ ఏదైనా ఉంటే ఇవ్వాలని నోరు తెరిచి అడిగితే ఒక చీటిపై రాసిచ్చి బయట కొనుక్కోమని వైద్యులు చెప్పారు. ఇలాంటి చిన్న చిన్న మందులే కాకుండా డాక్టర్లు రాసిన చాలా రకాల మందులు ఫార్మసీలో దొరకడం లేదు. సోడియం వాల్ ప్రేట్ ఫార్ములా మందులు ఆరు నెలలుగా ప్రభుత్వ ఫార్మసీల్లో అందుబాటులో లేవు.
కనీసం బీ కాంప్లెక్స్ మందులు కూడా కనిపించ లేదు. పేరుకే 90 రకాల మందులు దొరుకుతున్నాయని చెబుతున్నా, వీటిలో పనిచేయనివే అనేకం ఉన్నాయని రోగులు వాపోతున్నారు. గన్నేరువరం మండలం మాదాపూర్‌కు చెందిన సుంకరి రాములు ఇదే విషయాన్ని చెబుతున్నాడు. ఆయన మోకాళ్ల నొప్పుల మందుల కోసం ఇది వరకే తోటపల్లి పీహెచ్‌సీకి వెళ్లాడు. అక్కడ తీసుకున్న మందులు పని చేయలేదని, కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు వచ్చాడు. ఇక్కడ అవే మందులు ఇచ్చారని వాపోయాడు. అసలు అవి ఎంత వరకు పనిచేస్తాయో చూడాలని నిట్టూర్చాడు. చాలా మంది రోగులకు వైద్యులు రాసిన మందులు లభించక పోవడంతో వాటికి అనుబంధమైన మందులు ఇస్తూ ఫార్మసీ సిబ్బంది చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు సైతం లేక పోలేదు.
నేను శబరిమలకు పెద్దపాదం పోయిన. కాళ్లకు బండలు ఒత్తి నొప్పులచ్చినయ్. ఒక కాలు మడిమ బాగా మెత్తబడి విపరీతమైన నొప్పి వస్తుంటే ఈ నెల 18న మొదటిసారి ప్రభుత్వ దవాఖానకు వచ్చిన. ఇక్కడ మూడు నాలుగు తీర్ల గోలీలు ఇచ్చి పంపిన్రు. నొప్పి అస్సలు తగ్గక పోగా ఇంకింత ఎక్కువైంది. అప్పటి సంది రెండు రోజులకోసారి దవాఖానకు వస్తనే ఉన్న. రేపు రా.. మాపు రా అంటున్నరు.
నొప్పి తగ్గడానికైనా మందులియ్యమంటే ఏవేవో ఇస్తున్నరు. అవి ఏసుకుంటే తగ్గుత లేదు. తీరా మడిమకు చీము పట్టింది. మూడు రోజుల్నుంచి నిద్ర పట్టకుంట సల్పుతంది. కనీసం చీము తీసేయ్యుండ్రని బతిమాలినా తీసెటోళ్లు లేరు. ఇక్కడికి పోతే అక్కడిపో.. అక్కడికి పోతే.. ఇంకోకాడికి పో అంటున్నరు. కాలు కింద పెట్టరాకుంట సల్పుతంది. కనీసం వీల్‌చైర్ సతం ఇవ్వలేదు. పేపరోళ్లు ఫొటో తీసిన తర్వాత ఇచ్చిన్రు. ఇక్కడ ఎవ్వలు పట్టించుకునెటోళ్లు లేరు.
– మేడిచెలిమి శ్రీనివాస్, తీగలగుట్టపల్లి
ఛాతిల నొప్పి వచ్చిందని దవాఖానకు వచ్చిన. చెస్ట్ స్కానింగ్‌కు రాసిండ్రు. అక్కడికి పోయినంక ఒకసారి తీసిండ్రు. డాక్టర్ దగ్గరికి పోయి చూపిస్తే మళ్ల తీసుకురమ్మని పంపించిండు. ఆ రిపోర్ట్ సక్కగ రాలేదని చెప్పిండు. టైమంత వేస్టయ్యింది. అల్ట్రాసౌండ్ టెస్ట్ కూడా రాసిండ్రు. చెస్ట్ స్కానింగ్‌కు రెండు సార్లు పోయేసరికి మధ్యాహ్నం రెండయ్యింది. ల్యాబ్ మూసేసిండ్రు. 2డీ ఎకో టెస్ట్ కూడా రాసిండ్రు. కానీ, ఇక్కడ లేదట. బయట తీసుకొని రిపోర్ట్ చూపియ్యిమన్నరు. ఇవ్వల్లటి మందం గోలీలు రాస్తే తీసుకున్న. మళ్ల రేపచ్చి మిగిలిన టెస్ట్‌లు చేయించుకోవాలె.
– నేరెళ్ల నాగరాజు, చెర్లభూత్కూర్
నేను బండి మీంచి కిందవడితే దెబ్బలు తగిలినయి. నొప్పులు వస్తున్నయని దవాఖానకు వచ్చిన. ఎక్స్‌రేలు తీసిండ్రు. ఫిల్మ్ అడిగితే లేదని చెప్పిండ్రు. నాలుగు తీర్ల గోలీలు రాసిండ్రు. నొప్పులు తగ్గడానికి ఒక ఆయింట్మెంట్ ఏదన్నా ఉంటే ఇయ్యిండ్రని నోరు తెరిచి అడిగిన. లేదని చీటి మీద రాసిచ్చిండ్రు. బయట కొనుక్కోమని చెప్పిండ్రు. ఇంత పెద్ద దవాఖానల గింత చిన్న మందు లేకుంటే ఎట్ల. చాలా మంది పేదలు ఇక్కడికి వస్తరు. ఇసోంటి మందులు లేకుంటే ఎట్ల..
– ఇస్తావత్ లింగులు, నాంసానిపల్లి (ఓదెల)
ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు సరిగ్గా లేక నిరుపేదలపై చాలా భారం పడుతున్నది. నాణ్యమైన మందులు అందుబాటులో ఉండడం లేదు. ఇవి బయట కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చవుతుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తికి మూడు రోజుల కింద బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఎంతో నమ్మకంతో ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ, ఇక్కడ సీటీ స్కాన్ అందుబాటులో లేదు. బయటికి వెళ్లి స్కాన్ చేయించాలంటే 7,500 అయ్యింది. పాపం వాళ్లు నిరుపేద గిరిజనులు. ఎక్కడి నుంచి తెస్తారు? మూడు రోజుల నుంచి ట్రీట్మెంట్ నడుస్తున్నది. కానీ, ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. మంచి మందులు వాడితే ఇప్పటికే కవరయ్యేదనేది నా అభిప్రాయం. ప్రభుత్వ దవాఖానలో అన్ని వసతులు కల్పించాలి. నాణ్యమైన మందులు అందుబాటులో ఉంచాలి.
– పీ సతీశ్, న్యూట్రిషియన్ కోచ్ (సుల్తానాబాద్)
జగిత్యాల, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): జగిత్యాల ప్రభుత్వ దవాఖానలో మెడిసిన్ కొరత తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తున్నది. కొద్ది రోజులుగా కీళ్ల వాతానికి ఇచ్చే కోలోక్లికైన్ రకానికి చెందిన మందులు రావడం లేదు. అలాగే, ఫెబికోస్టల్ రకానికి చెందిన టాబ్లెట్లు వస్తలేవు. శస్త్రచికిత్స చేసే సమయంలో ఇచ్చే బుపివాకిసిన్ ఫార్ములాకు చెందిన ఇంజెక్షన్లు అందుబాటులో లేవు. జ్వరానికి ఇచ్చే ట్రమడల్, పారసిటమాల్ ఇంజెక్షన్లు అందుబాటులో లేవు. సర్జికల్‌లో వాడే మిడ్జోలమ్ ఫార్ములా మందులు రావడం లేదు.
క్యాలిషియమ్ గ్లూకోనెట్ మందులు వస్తలేవు. బీపీ, కొలస్ట్రాల్‌కు సంబంధించిన అట్రోవాసిన్, క్లోపిటాబ్ రావడం లేదు. గుండెకు సంబంధించిన బీటాబ్లాకర్ మందులు సైప్లె కావడం లేదు. క్లావమ్ లాంటి యాంటిబయటిక్ మందులు లేవు. వాంతులను నిరోధించేందుకు ఇచ్చే ఆన్లీన్ ట్యాబ్లెట్ కూడా లేదు. రక్తం బ్లీడ్ కాకుండా ఆపే ట్రనీనా ట్యాబ్లెట్లు కూడా లేవు…పక్క చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సత్తయ్య. జగిత్యాల మండలానికి చెందిన ఆయన, లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. గత నెల 29న జగిత్యాల ప్రధాన దవాఖానకు వచ్చాడు.
అతడి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యులు, అదే రోజు చేర్చుకొని చికిత్స అందించారు. మూడు రోజుల తర్వాత డిశ్చార్జి చేశారు. ఈ సమయంలో మందులు రాసిచ్చారు. ఆ చీటీతో సత్తయ్య ఫార్మసీకి వెళ్లగా.. తమ వద్ద కేవలం మూడు రకాల మందులే ఉన్నాయని, మిగిలిన మూడు బయట ప్రైవేట్ షాపుల్లో తీసుకోవాలని సిబ్బంది సూచించారు. సత్తయ్యకు రాసిన మందుల్లో యుడిలివ్-150 పది గోలీలకు బయట మార్కెట్లో 779, రిహెపిటిన్ ట్యాబ్లెట్ పది గోలీలకు 229, లాక్టోలుస్ టానిక్ 100 ఎంఎల్ బాటిల్ 249 ధరతో కొనుక్కోవాల్సి వచ్చింది. సత్తయ్య ఒక్కడి కాదు.. దవాఖానకు వస్తున్న పలువురు రోగులు సైతం మందులను ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనాల్సిన దుస్థితి ఉన్నది.