Kamanpur PHC | కమాన్ పూర్ జూన్ 30 : ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపర్చే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు తాటికొండ శంకర్ డిమాండ్ చేశారు. కమాన్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పీహెచ్సీలో అన్ని రకాల మంధులు అందుబాటులో లేవని, వెంటనే మందులు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో నలుగురు స్టాప్ నర్సులు ఉండాల్సి ఉండగా ఒక్కరు కూడా లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాత్రి వేళల్లో ఆసుపత్రిలో నైట్ వాచ్మెన్ మాత్రమే ఉంటున్నారన్నారు. ఇప్పటికైన వెంటనే స్టాప్నర్సులను నియమించే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆసుపత్రి ఆవరణలోని క్వార్టర్లు శిథిలవస్థకు చేరుకుని నిరుపయోగంగా మారిపోయాయని వాటికి మరమ్మత్తులు చేయాలని లేని యెడల నూతనంగా క్వార్టర్ల నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి ఆవరణలో పారిశుద్యం, తాగు నీటి వసతి సక్రమంగా లేదన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులు అద్వానంగా ఉండడం బాధాకరమన్నారు. వైద్యులు అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలన్నారు. కమాన్ పూర్ పీహెచ్సీ ని 30 పడకల ఆసుపత్రిగా మార్చి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ యూత్ విభాగం మాజీ అధ్యక్షులు బొమ్మగాని అనిల్ డ్, మాజీ వైస్ ఎంపీపీ కొట్టె భూమయ్య, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, నాయకులు దండె కిషన్, కుందారపు సత్యనారాయణ, తోట రాజ్ కుమార్ పాల్గొన్నారు.