రూ. కోట్లకు పడగెత్తిన మెడిసిన్ దందాలో ఆధిపత్య పోరు సాగుతున్నదా..? అంటే అవుననే తెలుస్తున్నది. కరీంనగర్ జిల్లాలో మెడికల్ మాఫియా మూడు వర్గాలుగా విడిపోయి, ఆధిపత్యం కోసం పాకులాడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఒక వర్గం మరో వర్గాన్ని అణచివేసేందుకు అధికారులను పావులుగా వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. నాన్ మార్కెట్ కంపెనీల మందుల కొనుగోళ్లలో, ప్రత్యేకంగా మందులు తయారు చేయించుకునే విషయాల్లో ఈ వర్గాల మధ్య అనేక విభేదాలు ఉన్నట్టు తెలుస్తున్నది. నాణ్యత లేని, డూప్లికేట్, నాన్ మార్కెటింగ్ మందులు విక్రయించడంలో.. స్టాండర్డ్, జనరల్ మందుల కంపెనీల ఎంపిక విషయంలో నిత్యం కుమ్ములాటలు జరుగుతున్నట్టు సమాచారం అందుతున్నది. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం, అధికారులను పావులుగా వాడుకోవడం, దిగి వస్తే గుట్టుగా రాజీ కుదుర్చడం, లేదంటే కేసులు పెట్టించడం వంటి చర్యలు ఒక వర్గం మాఫియాకు నిత్యకృత్యంగా మారినట్టు తెలుస్తున్నది. ఈ వర్గాల మధ్య డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సైతం నలిగిపోతున్నారనే చర్చ జరుగుతున్నది.
కరీంనగర్, జూలై 15 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : ప్రైవేట్ మెడికల్ రంగంలో అతి పెద్ద మార్కెట్‌గా మారిన కరీంనగర్లో ఓ వర్గం మాఫియా రాజ్యమేలుతున్నది. తమ సామ్రాజ్యం విస్తరించుకునేందుకు మరో వర్గాన్ని కిందికి తొక్కాలనే ప్రయత్నాలు నిత్యకృత్యంగా మారాయి. వీరి మధ్య తలెత్తే విభేదాలు పూర్తిగా వ్యాపారపరమైనవే అయినా ఇటీవలి కాలంలో విపరీతమైనట్టు తెలుస్తున్నది. కరీంనగర్‌కు చెందిన ఓ ఏజెన్సీ నిర్వాహకుడిని జైలుకు పంపించడంలో ఆయన వ్యతిరేక వర్గం పాత్ర ఉన్నట్టు మెడికల్ వ్యాపారుల్లో చర్చ జరుగుతున్నది. ఎంత పెద్ద కేసైనా ఇంత వరకు జిల్లాలో ఏ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లు జైలుకు వెళ్లిన సందర్భం లేదని, వర్గాల మధ్య విభేదాలు ముదిరాయనడానికి ఇదే నిదర్శనమని తెలుస్తున్నది. ఒక్కో మెడికల్ ఏజెన్సీకి పదుల సంఖ్యలో కంపెనీలతో డీలర్‌షిప్‌లు ఉంటాయి. ఈ మందులు ఎవరు ఎక్కువ అమ్మితే వారిని కంపెనీలు ప్రోత్సహిస్తుంటాయి. ఒక్కో కంపెనీ ఒక్క కరీంనగర్‌లోని వందల సంఖ్యలో ఉన్న ఏజెన్సీలకు ఈ విధంగా ఆథరైజ్ చేస్తున్నది. కొత్తగా మెడికల్ ఏజెన్సీలు ఏర్పాటు చేసుకుంటున్న వారిపై ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ఏజెన్సీల నిర్వాహకులు అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. పాత వారికి ఆథరైజ్డ్‌గా ఉన్న కంపెనీల నుంచి కొత్త ఏజెన్సీలు తెచ్చుకోవడం వీరికి కంటగింపుగా మారినట్టు సమాచారం. కొన్ని కంపెనీలు కొత్త వారికి ఆథరేషన్ ఇవ్వడం ఇష్టం లేని కొందరు వీరిపై తరుచూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఫిర్యాదులపై స్థానిక అధికారులు స్పందించకుంటే ఉన్నతాధికారులకు సైతం ఇతర వ్యక్తులతో వీళ్లే ఫిర్యాదు చేయిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇలా ఫిర్యాదుల పరంపర జరుగుతున్న నేపథ్యంలో మెడికల్ వ్యాపారులు మూడు వర్గాలుగా విడిపోయారనే చర్చ జరుగుతున్నది.
మెడికల్ రంగంలో పోటీ పడితేనే బిజినెస్ అన్నట్టు మారింది. ఇప్పుడు అందరు వ్యాపారుల పరిస్థితి ఇలాగే కనిపిస్తున్నది. బిజినెస్‌లో ఎదిగేందుకు ఎదుటివాన్ని తొక్కాలనే ఆలోచనతోనే మెడికల్ వ్యాపారులు ముందుకు సాగుతున్నట్టు తెలుస్తున్నది. నిజానికి ఈ రంగంలో ఎవరు సుద్దపూసలని చెప్పడానికి లేదు. ఇంత పెద్ద వ్యాపారంలో 50 మందికి లోపలే నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఇలాంటి వారు లాభాపేక్షకు వెళ్లకుండా బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించిన స్టాండర్డ్ మందులతోనే వ్యాపారం చేస్తున్నారు. మెడికల్ వ్యాపారుల మధ్య ప్రధానంగా నాన్ మార్కెటింగ్ మందుల విక్రయంలోనే పోటీ నెలకొన్నట్టు తెలుస్తున్నది. ఫార్మా కంపెనీలను స్వయంగా స్థాపించుకున్న కొందరు తమకు సంబంధించిన మందులను విక్రయించాలని చిన్న చిన్న వ్యాపారులపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఫార్మా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు తమ సొంత వ్యాపార సంస్థల పేర్లలో మందులు తయారు చేయించుకొని మార్కెటింగ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇలాంటి వ్యాపారులు జిల్లాలో పెద్ద సంఖ్యలోనే ఉన్నట్టు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎవరి మందులు వారు విక్రయించుకునే క్రమంలోనే వ్యాపారుల మధ్య తరుచూ విభేదాలు తలెత్తుతున్నట్టు తెలుస్తున్నది. తక్కువ ధరకు వచ్చే మందులను ఎక్కువ మార్జిన్‌తో ఇవ్వడం కొందరికి నచ్చడం లేదు. ధరలు తగ్గించి తమ వ్యాపారం జరగకుండా చేస్తున్నారని ఒక వర్గంపై మరో వర్గం కత్తులు దూస్తున్నది. ఒక్కో వ్యాపారి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే ప్రయత్నంలో చిన్న చిన్న వ్యాపారులను తమ దారికి తెచ్చుకుంటున్నట్టు, తమ దారికి రాని వారిపై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ అధికారులను పావులుగా వాడుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
రూ. కోట్లతో జరుగుతున్న మెడికల్ వ్యాపారంలో ఆధిపత్య పోరు సహజంగానే ఉంటుంది. కానీ, కొందరు వ్యాపారులు మాఫియాలా వ్యవహరిస్తూ ఒక్కో వర్గాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది. కరీంనగర్‌కు చెందిన ఓ వర్గం వ్యాపారులు అధికారులను తమ చెప్పు చేతల్లో పెట్టుకొని, తమకు గిట్టని ఏజెన్సీలపై దాడులు చేయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వాళ్లు తప్పు చేసినపుడే ఇలాంటి దాడులు జరుగుతున్నా కొందరిపై ఉద్దేశ పూర్వకంగా దాడులు చేయించడం, సంబంధిత ఏజెన్సీలో తనిఖీలు జరిపించడం తరుచూ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. దాడులతో దిగొచ్చి తమ దారికి వచ్చిన వారికి పెనాల్టీలు విధించి వదిలేయడం, లేదంటే కేసులు పెట్టించడంలో ఈ వ్యాపారుల పాత్ర ఉంటుందని మరో వర్గం వ్యాపారులు ఆరోపిస్తున్నారు. నిజానికి ఇటీవలి కాలంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఒక ఏజెన్సీపై సంబంధిత కంపెనీ ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టగా డూప్లికేట్ మందులు దొరికిన విషయం తెలిసిందే. ఈ ఏజెన్సీలో ఇలాంటి దందా జరుగుతున్న విషయాన్ని మెడికల్ వ్యాపారుల్లో ఒక వర్గమే సంబంధిత కంపెనీకి ఇతర వ్యక్తుల ద్వారా ఫిర్యాదు చేయించినట్టు తెలుస్తున్నది. ఈ కేసులో జైలుకు వెళ్లిన సదరు ఏజెన్సీ నిర్వాహకులు అనతి కాలంలోనే అనేక కంపెనీల మందులు విక్రయించడానికి ఆథరేషన్లు సంపాదించుకున్నట్టు తెలుస్తున్నది. ఒక వర్గం వ్యాపారికి సంబంధించి కంపెనీలే అందులో ఎక్కువగా ఉన్నట్టు, ఆయన వ్యాపారం కోట్లలో పడిపోయినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సదరు ఏజెన్సీలో డూప్లికేట్ మందులు విక్రయిస్తున్నట్టు తెలుసుకొని ఫిర్యాదు చేయించినట్టు సమాచారం.
కొత్త మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్పెక్టర్ను సంప్రదించి వారు చెప్పిన ప్రకారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు 3 వేల వరకు మాత్రమే ఉంటుంది. కానీ, ఒక వర్గం వ్యాపారులు మాత్రం తమను కలిస్తేనే లైసెన్స్‌లు ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వానికి చెల్లించే ఫీజుతోపాటు తమకు కూడా చెల్లింపులు చదివించుకోవాల్సి ఉంటుందని ఈ వ్యాపారులు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ప్రొసీజర్ ప్రకారంగా స్థానిక అధికారులు లైసెన్స్‌లు జారీ చేస్తే, వారిపై ఏదో ఒక రకంగా పై అధికారులకు ఫిర్యాదులు చేయిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఒక్కో లైసెన్స్‌పై ప్రభుత్వానికి చెల్లించేది తక్కువ, వీళ్లకు చెల్లించేది ఎక్కువవుతున్నదని కొత్తగా మెడికల్ షాపులు ప్రారంభించుకునే వారు సైతం ఆరోపిస్తున్నారు. జిల్లాలో మెడికల్ మాఫియాలో ఏర్పడిన వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఎటొచ్చి రోగులను దోచుకోవడంపైనే కేంద్రీకృతం అవుతున్నది.