Medical camp | కోరుట్ల, జూన్ 13: పారిశుధ్య కార్మికులు, మహిళ సంఘాల సభ్యురాళ్ల ఆరోగ్య పరిరక్షణ కోసమే ఉచితంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆన్నారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వంద రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ సహకారంతో మున్సిపల్ ఆధ్వర్యంలో కార్మికులకు, మహిళ సంఘాల సభ్యురాళ్లకు ఉచితంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్మికులు తమ ఆరోగ్యంపై శ్రద్ద వహించాలన్నారు. పారిశుధ్య నిర్వహణలో కార్మికుల సేవలు మరులేనివని, నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారని కొనియాడారు. ప్రతి ఒక్కరి సేవలను గుర్తించి సముచిత గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అనంతరం డిప్యూటీ డిఎంహెచ్ వో శ్రీనివాస్ మహిళలకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.
ముఖ్యంగా మహిళల్లో వచ్చే బ్రెస్ట్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. అనుమానిత మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు చేశారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్సెక్టర్లు రాజేంద్ర ప్రసాద్, అశోక్, ప్రభుత్వ వైద్యులు సమీనా తబుస్సుమ్, అనిల్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.