NPDCL | ముకరంపుర, సెప్టెంబర్ 11 : రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ కో, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులను ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం కరీంనగర్ లోని 220కేవీ సబ్ స్టేషన్ ను సీఎండీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ లో ప్రస్తుతం నమోదవుతున్న లోడ్ స్థితి, విద్యుత్ సరఫరా జరుగుతున్నతీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాన్స్ కో, ఎన్పీ డీసీఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించి లోడ్, సరఫరా తీరుపై పలు సూచనలు చేశారు.
ఎల్ నినో ప్రభావంతో సీజన్ లో వర్షాలు కురవకపోవడంతో రైతులు బావులు, బోర్లపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. ఉత్పత్తి, వినియోగం మధ్య వ్యత్యాసంతో సరఫరాలో సాంకేతిక లోపాలు, సమస్యలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాన్స్‌కో అధికారులు, ఇంజనీర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ గ్రిడ్ భద్రతను కాపాడాలని, విద్యుత్ సరఫరాలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు.
ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్ల వారీగా పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. వినియోగదారులకు అంతరాయం లేకుండా, సరైన వోల్టేజ్ స్థాయిలతో కూడిన విద్యుత్ సరఫరాను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎండీ వెంట ట్రాన్స్ కో ఎస్ఈ శ్రీనివాస్, ఎన్పీడీసీఎల్ కరీంనగర్ ఎస్ఈ విజయేందర్ రెడ్డి, డీఈలు ఉపేందర్, రాజం, ట్రాన్స్ కో, ఎన్పీడీసీఎల్ అధికారులు ఉన్నారు.