Jagityal | జగిత్యాల : జగిత్యాల పట్టణంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని దోమలు, ఈగల నివారణ చర్యలు చేపట్టడంతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని 50వ వార్డు కౌన్సిలర్ ములస్తం లావణ్య మహేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె మంగళవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. వర్షాల కారణంగా నిల్వ నీరు పెరగడం వల్ల జ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో దోమల నివారణ, మురికి కాలువల శుభ్రత, సిల్ట్ తొలగింపు వంటి పనులను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు.
గత మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బ్లీచింగ్ పౌడర్, ఇతర రసాయనాల కొనుగోలు, దోమల నివారణ చర్యల కోసం రూ.25 లక్షల నిధులు కేటాయించారని గుర్తుచేస్తూ, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మున్సిపల్ పారిశుధ్య విభాగంలో పనిచేసే కార్మికుల భద్రత కోసం ఆప్రాన్లు, బూట్లు తదితర రక్షణ సామగ్రి కొనుగోలుకు రూ.9 లక్షల బడ్జెట్ కేటాయించారని, ఆ నిధులను కూడా నాణ్యమైన సామగ్రి అందించేందుకు వినియోగించాలని కోరారు. వర్షాకాలంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి మురికి నీరు రోడ్లపై, గుంతల్లో నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే రోడ్ల పక్కన ఉన్న టిఫిన్ సెంటర్లు, హోటళ్ల వద్ద చెత్త పేరుకుపోకుండా పర్యవేక్షించాలని సూచించారు.
ఈగలు, దోమలు వృద్ధి చెందకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలని, ఇళ్లలో లేదా పరిసర ప్రాంతాల్లో కొబ్బరి చిప్పలు, గుంతలు, ఇతర వస్తువుల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిల్వ నీటిలో డెంగ్యూ వ్యాధికి కారణమైన దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు.అలాగే వర్షాకాలంలో ఎక్కడైనా మంచినీటి పైపులు పగిలినట్లయితే వాటి ద్వారా మురికి నీరు సరఫరా కాకుండా వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించాలని మున్సిపల్ అధికారులను లావణ్య కోరారు.