MBBS seat | తిమ్మాపూర్, సెప్టెంబర్ 29 : తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీలో గ్రామానికి చెందిన ఇనుకొండ స్వప్న అనే విద్యార్థిని ఇటీవల నిర్వహించిన వైద్యవిద్య ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు పొందింది. బేడ బుడగ జంగం కులానికి చెందిన ఆమె తల్లిదండ్రులు ఇనుకొండ రాజేశ్వరీ-రమేష్ ఇతర రాష్ట్రాల్లో బతుకుదెరువు కోసం సంచార జీవనం సాగిస్తూ స్వప్నను చదివించారు.
వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా స్వప్న సైతం బాగా చదివి మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఈ సందర్భంగా ఆమె వైద్య విద్య పూర్తి చేసుకొని గ్రామస్తులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని తెలిపింది. విద్యార్థిని సీటు సాధించడం పట్ల బీజేపీ మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వర చారి ఆధ్వర్యంలో విద్యార్థినితోపాటు ఆమె తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రేగురి సుగుణాకర్, వేల్పుల ఓదయ్య, ఎడ్ల భూమిరెడ్డి, కోతి రాజు, కిన్నర ముత్తిలింగం, ఇనుకొండ విఠల్, సంపత్, నరేష్, రాజు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.