కార్పొరేషన్, అక్టోబర్ 20: కరీంనగర్ ముద్దుబిడ్డ పీవీ నరసింహరావు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక పరిస్థితిని నిలబెట్టారని నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు గుర్తు చేశారు. కానీ, అలాంటి వ్యక్తి చనిపోతే కనీసం ఢీల్లీలో స్థలం కూడా ఇవ్వకుండా అవమానానికి గురిచేశారని విమర్శించారు. రాహుల్‌గాంధీ ముందుగా ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పి ఇక్కడికి రావాలని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఎస్బీఎస్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నాయకులు పదవుల కోసం కొట్టుకోవడంతోనే సరిపోయిందని, ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. కుటుంబం పేరిట రాజకీయాలు చేస్తున్నది మీరేనని విమర్శించారు.
చెట్టు పేరు చెప్పుకున్న పండ్లు అమ్ముకునే తీరులో రాహుల్‌గాంధీ ఉన్నారని, గాంధీ పేరు చెప్పుకొని విదేశాల నుంచి దిగి వచ్చి ఎంపీగా గెలిచారని ఎద్దేవా చేశారు. కనీస అవగహన లేని, ఎరోప్లెన్ నడుపుకునే వ్యక్తిని ప్రధానిగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు. అదే కేటీఆర్ మాత్రం తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజల్లో ఉన్నారని, వారి ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు. కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి సంస్థతో దేశ, విదేశాల్లో బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని చాటి ఎంపీగా గెలిచారని చెప్పారు. ఇవన్నీ తెలియయకుండా మట్లాడడం సరికాదని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని రాహుల్‌గాంధీకి హితవు పలికారు.
కుటుంబం పేరిట రాజకీయాలు చేస్తున్నదెవరలో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలిపిన చరిత్ర కాంగ్రెస్‌ది అని విమర్శించారు. 1969లో 360 మందిని పిట్టల్లా కాల్చి చంపారని వాపోయారు. 14 ఏండ్లు అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్న ఘనత కేసీఆర్‌ది అన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో రేవంత్‌రెడ్డి తుపాకీ పట్టుకొని కరీంనగర్‌కు వచ్చిన సంగతి ప్రజలు మరిచిపోలేదన్నారు.
ఆయనకు ఊడిగం చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలన్నారు. జీవన్‌రెడ్డి చౌకబారు విమర్శలు మానుకోవాలన్నారు. గత ఎన్నికల్లో ఇవే నాకు చివరి ఎన్నికలు అని ప్రజల వద్దకు వెళ్లినా జీవన్‌రెడ్డిని ప్రజలు ఆదరించలేదన్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌కు అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. సమావేశంలో కార్పొరేటర్లు వాల రమణారావు, గందె మాధవి, నాయకులు మేచినేని అశోక్‌రావు, కాశెట్టి శ్రీనివాస్, వేణు, చంద్రమౌళి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.