MLA Ch Vijayaramana Rao | కాల్వశ్రీరాంపూర్, మే 19 : ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లిలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన ఎల్లమ్మ బోనాలను మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొని ఆలయంలో పూజలు చేశారు. గౌడ సంఘం నాయకులు విప్, ఎమ్మెల్యేను శాలువాతో సత్కించారు.
ఈ సందర్భంగా గౌడ కులస్తులు ఇంటికో బోనం వండి, నెత్తిన బోనపు కుండలతో శివసత్తుల పూనకాలతో, డప్పుచప్పుళ్ల మధ్య గ్రామ సమీపంలోని ఎల్లమ్మ దేవాలయానికి చేరుకొన్నారు. నైవేధ్యం వండి అమ్మవారికి సమర్పించారు. తమ పిల్లా పాపలను చల్లంగా చూడాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఎల్లమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరెల్లి రమేశ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, గౌడ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.